మరోసారి అనుమతి కోరండి: హైకోర్టు

TS HC Comments On PIL Filed Conducting Procession Of Bonalu festival - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బోనాల ఘటాల ఊరేగింపు అనుమతి విషయంలో తానేమీ చేయలేనని హైకోర్టు స్పష్టం చేసింది. అక్కన్న, మాదన్న ఆలయ నిర్వాహకులు సౌత్ జోన్ డీసీపీకి మళ్ళీ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పాతబస్తీ  హరిబౌలి శాలిబండలోని చారిత్రాత్మక కట్టడం అక్కన్న మాదన్న ఆలయంలో ఏటా బోనాల పండుగ ఘనంగా నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అమ్మవారి ఘటాన్ని ఏనుగు అంబారీపై ఊరేగిస్తారు. ప్రస్తుతం కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో కరోనా సాకు చూపి తమతో సంప్రదించకుండా ప్రభుత్వం బోనాల పండుగను నిలిపివేసిందంటూ ఆలయ నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించారు. బోనాల ఘటాల ఊరేగింపునకు అనుమతి ఇవ్వాలని పిటిషన్‌ దాఖలు చేశారు. సంప్రదాయాలకు విఘాతం కలగకుండా చూడాలని కోరారు. కరోనా నుంచి ప్రజలను రక్షించాలని అమ్మవారిని ప్రార్థిస్తూ బోనాల పండుగ జరుపుతామని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు గురువారం విచారించింది.

ఈ క్రమంలో కోవిడ్ 19 నిబంధనల నేపథ్యంలో ఊరేగింపునకు ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదని దేవాదాయ శాఖ కోర్టుకు తెలిపింది. ఇప్పటికే జరిగిన గోల్కొండ, సికింద్రాబాద్ బోనాలకు కూడా ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఇందుకు బదులుగా... 72 సంవత్సరాలు గా అమ్మవారిని అంబారీపై ఉరేగిస్తున్నారని కోర్టుకు తెలిపిన పిటిషనర్... జూన్ 22 న పురీ జగన్నాథ్ యాత్రకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ఘటాలతో పాటు అమ్మవారిని 3 కిలోమీటర్ల వరకు  సామాజిక దూరం పాటిస్తూ ఏనుగు మీద ఉరేగిస్తామని తెలిపారు.

ఈ విషయం గురించి ఇప్పటికే హైదరాబాద్ సీపీ, డీసీపీలకు అనుమతి ఇవ్వాలని కోరామని కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో అర్చకులు వెళ్లి పూజలు చేసుకోవడానికి అనుమతి ఉందన్న దేవాదాయ అధికారులు... ఘటాల ఊరేగింపునకు ఎలాంటి అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఇరువాదనలు విన్న కోర్టు.. సంబంధిత అధికారులకు మరోసారి అప్లికేషన్ పెట్టుకోవాలని సూచించింది. పూరీ జగన్నాథ్ రథయాత్ర కు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దృష్టిలో పెట్టుకుని పోలీసులు ఈ విషయాన్ని పరీశీలించాలని సూచించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top