వైద్యుల్లో కరోనా కలవరం

Total 46 Doctors Got Corona Positive In Telangana - Sakshi

ఇప్పటివరకు 46 మంది వైద్యులకు పాజిటివ్‌

నిమ్స్‌లో మరో ఆరుగురు వైద్యులకు పాజిటివ్‌

ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో మరో ఇద్దరికి..

కింగ్‌కోఠి ఆస్పత్రిలో ముగ్గురు పారిశుధ్య సిబ్బందికి, ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందికి..

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వైద్య సిబ్బందికి కరోనా కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఉస్మానియా వైద్య కళాశాల అనుబంధ ఆస్పత్రులతో పాటు, నిమ్స్‌లో ఒకరి తర్వాత మరొకరు కరోనా వైరస్‌ బారిన పడుతున్నారు. ఇప్పటివరకు మొత్తం 46 మంది వైద్యులకు కరోనా వైరస్‌ సోకడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఉస్మానియా వైద్య కళాశాలలో చదువుతున్న 13 మంది పీజీ వైద్యులు వైరస్‌ బారిన పడగా.. తాజాగా మరో ఇద్దరు పీజీలకు కరోనా వైరస్‌ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో వీరి సంఖ్య 15కు చేరింది. అలాగే ఇదే కాలేజీకి అనుబంధంగా పని చేస్తున్న ఓ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో 18 మంది వైద్యులు వైరస్‌ బారిన పడినట్లు సమాచారం. దీంతో ఉస్మానియా వైద్య కళాశాల పరిధిలోనే మొత్తం 33 మందిæ వైద్యులు కరోనా వైరస్‌ బారిన పడ్డారు. కాలేజీ హాస్టల్లో ఉంటున్న జూనియర్‌ డాక్టర్లు ఒక్కొక్కరికి వైరస్‌ సోకుతుండటంతో వారి కుటుంబసభ్యుల్లో ఆందోళన మొదలైంది.

నిమ్స్‌లో 13 మందికి పాజిటివ్‌..
నిమ్స్‌ కార్డియాలజీ విభాగంలో బుధవారం నలుగురు రెసిడెంట్‌ డాక్టర్లు సహా మరో ముగ్గురు ల్యాబ్‌ టెక్నీషియన్లకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా.. గురువారం ఇదే విభాగంలోని మరో ఆరుగురికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. వీరిలో ఒక ప్రొఫెసర్‌ సహా, ముగ్గురు హౌస్‌ సర్జన్లు, ఒక ఉద్యోగి, మరొక రోగి ఉన్నట్లు తెలిసిం ది. కార్డియాలజీ విభాగంలోని వైద్య సిబ్బందికి కరోనా సోకడంతో ఇప్పటికే ఆ విభాగంలో ఉన్న రోగులందరినీ డిశ్చార్జ్‌ చేశారు. నిమ్స్‌ లో 60 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు.

కింగ్‌కోఠిలో ఆరుగురు సిబ్బందికి..
కింగ్‌కోఠి ఆస్పత్రిలో పని చేస్తున్న ముగ్గురు పారిశుధ్య కార్మికులు సహా మరో ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్‌ రావడంతో వారికి సన్నిహితంగా మెలిగిన 70 మందిని క్వారంటైన్‌ చేశారు. కాగా, రాజధాని హైదరాబాద్‌లో కరోనా మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా గురువారం గాంధీ ఆస్పత్రి లో చికిత్స పొందుతున్న ధూల్‌పేటకు చెందిన ఓ గర్భిణి సహా ముషీరాబాద్‌లోని రాంనగర్‌కు చెందిన మరో వ్యక్తి మృతి చెందారు. ఆయన కుటుంబంలో తల్లి, కుమారుడు, అల్లుడికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top