పంచాయతీ పోరుకు.. రాజకీయ సెగ! | Telangana Panchayat Elections Nalgonda Politics | Sakshi
Sakshi News home page

పంచాయతీ పోరుకు.. రాజకీయ సెగ!

Jan 4 2019 11:02 AM | Updated on Mar 18 2019 9:02 PM

Telangana Panchayat Elections Nalgonda Politics - Sakshi

పల్లెల్లో రాజకీయ సెగ మొదలైంది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ నెలలోనే మూడు విడతల్లో జరగనున్న ఎన్నికలకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. వాస్తవానికి ఈ ఎన్నికలు పార్టీ రహితమైనప్పటికీ... సర్పంచ్‌ పదవులపై పార్టీలన్నీ దృష్టిపెట్టి పావులు కదుపుతున్నాయి. అధికార టీఆర్‌ఎస్,  ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, ఇతర రాజకీయ çపక్షాలు గ్రామాలపై ఆధిపత్యం కోసం కాచుక్కూర్చున్నాయి. 

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : డిసెంబర్‌లో ముగిసిన శాసనసభ ఎన్నికల్లో జిల్లాలోని ఆరు స్థానాల్లో నాలుగు చోట్ల విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాలని చూస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ నాయకత్వం తమ ఎమ్మెల్యేలకు సర్పంచ్‌ ఎన్నికల బాధ్యత అప్పజెప్పింది. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండడంతో ఆ పార్టీ తరఫున బరిలోకి దిగడానికి పోటీ ఎక్కువగా ఉంది. తమకే టికెట్‌ దక్కేలా చూడాలని ఆ పార్టీ నాయకులు ఒత్తిడి పెంచుతున్నారు. రిజర్వేషన్లు కూడా ఖరారు కావడంతో ఏ గ్రామపంచాయతీలో ఏ వర్గానికి చెందినవారు పోటీ చేయాలో తేలిపోయింది.

మెజారిటీ పంచాయతీల్లో తమకు అనుకూలంగా రిజర్వేషన్‌ వచ్చిన చోట, నాయకులు ఎక్కువగా ఉన్నచోట ఈ ఎన్నికల్లో పోటీకి డిమాండ్‌ పెరిగింది. ప్రధానంగా జనరల్‌ స్థానాల్లో ఒకరికి మించి ఎక్కువ మంది ఆశావహులు ఉండడం, ఎవరో ఒకరిని మాత్రమే పోటీకి పెట్టాల్సి ఉండడంతో వారందరినీ సముదాయించే పనిలో స్థానిక నేతలు బిజీగా ఉన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 844 పంచాయతీల్లో ఈసారి 837 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. జిల్లాలో తమ పట్టును మరింత పెంచుకుని రానున్న పార్లమెంట్, పంచాయతీరాజ్‌ స్థానిక సంస్థలు, మున్సిపల్‌ ఎన్నికల్లో తిరుగులేని విజయాలు సాధించేందుకు గ్రామ పంచాయతీ పోరునే ప్రధాన వేదికగా ఉపయోగించుకోవాలని టీఆర్‌ఎస్‌ నాయకత్వం భావిస్తోంది. ఈ కారణంగానే ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా వీటిని సవాల్‌గా తీసుకొని జిల్లా నాయకత్వానికి మార్గదర్శనం చేస్తోంది.

పార్టీ రహిత ఎన్నికలైనా..!
పంచాయతీ ఎన్నికలు పూర్తిగా పార్టీ రహితమైనవి అయినా... పల్లెల్లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వారే పోటీ పడుతున్నారు. ఆయా పార్టీలనుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు కూడా ఇందులో ఉండడం గమనార్హం. ఈ కారణంగానే శాసనసభ ఎన్నికలు ముగియగానే మరోమారు రాజకీయ నాయకుల పర్యటనలతో గ్రామాలు వేడెక్కుతున్నాయి. దాదాపు ఏడాదికాలంగా పంచాయతీ ఎన్నికల కోసం ఎదురుచూస్తున్న కిందిస్థాయి నాయకులు ఈసారి అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదన్న నిర్ణయంతో ఉన్నారు. మరోవైపు సర్పంచ్‌ టికెట్ల కోసం పోటీపడుతున్న నేతలను బుజ్జగించే పనిలో ఎమ్మెల్యేలు ఉన్నారు.

శాసనసభ ఎన్నికల్లో ఫలితాలు ఎలా వచ్చినా.. గ్రామీణ ప్రాంతంపై తమ పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఈ కారణంగానే ఆ పార్టీ నేతలు సైతం తమ శ్రేణులను ఉత్సాహ పరుస్తున్నారు. ఈనెల 21, 25, 30 తేదీల్లో మూడు విడతలుగా జరగనున్న ఈ ఎన్నికల్లో తమ బలం చూపించాలని కోరుతున్నారు. అయితే సర్పంచ్‌ ఎన్నికలు సైతం ఆర్థిక అంశంతో ముడిపడినవే కావడం, ఎన్నికల ఖర్చును భరించగల ఆర్థిక స్తోమత ఉన్నవారే పోటీ చేయాలని కాంగ్రెస్‌ నాయకత్వం సూచిస్తోంది. మరోవైపు వామపక్ష పార్టీలు సైతం గతం నుంచి తమకు బాగా పట్టున్న గ్రామాల్లో  గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్నాయి. అన్ని పంచాయతీల్లో కాకుండా మండలంలో కనీసం రెండు మూడు పంచాయతీలపైనైనా ప్రత్యేక దృష్టి సారించాలని వామపక్ష పార్టీల నాయకత్వాలు భావిస్తున్నాయి. మరోవైపు రాజకీయ పార్టీలతో నిమిత్తం లేకుండానే .. గ్రామాల్లో మంచి పేరున్న యువకులను పోటీకి నిలబెట్టాలన్న  ప్రయత్నాల్లో కూడా ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement