ఆగిపోయిన ‘కేసీఆర్‌ కిట్‌’ చెల్లింపులు

Telangana KCR Kit Funds Are Stalled - Sakshi

ఆస్పత్రులు, బ్యాంకుల చుట్టూ లబ్ధిదారుల ప్రదక్షిణ

కేవలం కిట్‌తోనే సరిపెడుతున్న అధికారులు

నిధుల కొరతతో ప్రోత్సాహకానికి బ్రేకులు  

నిధుల కొరతతో ప్రోత్సాహకానికి బ్రేకులు కేసీఆర్‌ కిట్‌ పథకం లబ్ధిదారులకు ప్రోత్సాహకం నిలిచిపోయింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పుల సంఖ్య పెరుగుతున్నా గర్భిణులు, బాలింతలకు నగదు అందడం లేదు. లబ్ధిదారులు  ప్రోత్సాహం కోసం ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు తమ బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అవుతాయో తెలుసుకునేందుకు బాలింతలు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు.

సాక్షి, షాద్‌నగర్‌ : రాష్ట్ర ప్రభుత్వం సర్కారు ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు 2017 కేసీఆర్‌ కిట్‌ పథకానికి శ్రీకారం చుట్టింది. మగ పిల్లవాడు జన్మిస్తే రూ.12వేలు, ఆడపిల్ల పుడితే రూ.13వేలు నాలుగు దశల్లో నగదుకు చెల్లిస్తుంది. గర్భిణులు, బాలింతలకు పోషకాహారం కోసం, తల్లి, బిడ్డ ఆరోగ్యానికి, శిశువుకు వ్యాధి నిరోధక టీకాలు  ఇప్పించడం కోసం నాలుగు విడతల్లో ప్రభుత్వం ఈ పథకం కింద నగదును అందజేస్తుంది. ఆశా కార్యకర్తలు గర్భిణులను గుర్తించి వారి వివరాలను ఏఎన్‌ఎంలకు తెలియజేస్తారు. ఏఎన్‌ఎం గర్భిణి వద్దకు వెళ్లి  ఆధార్, బ్యాంక్‌ ఖాతా వివరాలను సేకరించి సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారులకు అందజేస్తారు. గర్భిణికి సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఆ వివరాలను  జిల్లా కేంద్రంలో ఉండే అధికారులకు పంపిస్తారు.

నాలుగు దశల్లో నగదు చెల్లింపులు  
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు చేయించుకున్న లబ్ధిదారులకు నాలుగు విడతలుగా వారి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. గర్భిణికి ఐదో నెలలో తొలిసారిగా రూ.3వేలు, ప్రసవం అయ్యాక కుమార్తె పుడితే రూ.5వేలు, కుమారుడు పుడితే రూ.4వేలు ఇస్తారు. మూడున్నర నెలల వయసులో శిశువుకు ఇంజక్షన్‌ ఇచ్చే సమయంలో రూ.2వేలు, 9నెలలకు ఇంజక్షన్‌ ఇచ్చే సమయంలో మిగిలిన రూ.3వేలు అందజేస్తారు. ఇప్పటి వరకు చెల్లింపులు ఇవీ..కేసీఆర్‌ కిట్‌ పథకం జూన్‌ 06, 2017 సంవత్స రంలో ప్రారంభమైంది. అప్పటి నుంచి 2019 జూలై వరకు జిల్లాలో గర్భిణులుగా 60,238 మంది నమోదయ్యారు.

ఇందులో కేసీఆర్‌ కిట్‌ పథకానికి 46,546 మంది అర్హత సాధించారు. వీరిలో 34,601 మందికి రూ.3వేల చొప్పున అందజేశారు. అయితే, ప్రభుత్వ ఆస్పత్రుల్లో 17,153 మంది మాత్రమే ప్రసవం చేయించుకున్నారు. ఇద్దరు పిల్లలు పుట్టిన వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు కావడంతో 13,290 మంది అర్హత సాధించారు. ఇందులో కేవలం 10,386 మందికి రూ.5వేల చొప్పున ప్రభుత్వం నగదును బ్యాంకుల్లో జమ చేసింది. ఇంకా 11,945 మంది గర్భిణులకు  మూడు వేల చొప్పున,  2,904 మంది బాలింతలకు  రూ.5వేల చొప్పున ప్రోత్సాహక నగదు ప్రభుత్వం నుంచి అందాల్సి ఉంది.

డబ్బులు జమ కాలేదు
ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసూతి చేయించుకుంటే నగదు వస్తుందని అనుకున్నాం. గర్భవతిగా ఉన్నప్పుడే ఆరోగ్య సిబ్బంది నా బ్యాంకు ఖాతా వివరాలు తీసుకున్నారు. గత ఏప్రిల్‌లో కాన్పు అయింది. ఇప్పటివరకు కూడా డబ్బులు బ్యాంకులో జమ కాలేదు. 
– తోటపల్లి పద్మ, వేములనర్వ, కేశంపేట  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top