నేను వాస్తవాన్ని

Prakash Raj Book Release in Hyderabad - Sakshi

సినీ‘మాయ’కు అతీతంగా నన్ను నేను చూసుకున్నా

నటుడు, పుస్తక రచయిత ప్రకాష్‌ రాజ్‌

హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌లో అభిమానుల సందడి

సాక్షి,సిటీబ్యూరో: ‘సినిమా.. ఒక మాయ ఒక అబద్దం. యాభై మూడేళ్ల జీవితంలో నటుడిగా అబద్ధాలు మాట్లాడుతూ ఒక సినీ‘మాయా’ ప్రపంచంలో ఉండిపోయాను. కానీ రాయడం ప్రారంభించాక కొత్త జీవితాన్ని ఆస్వాధిస్తున్నాను. నన్ను నేను తెలుసుకుంటున్నాను’.. ప్రముఖ సినీనటుడు, ప్రజాస్వామిక వాది, ‘దోసిట చినుకులు’ పుస్తక రచయిత ప్రకాష్‌రాజ్‌ అభివ్యక్తి ఇది. ఆయన కన్నడంలో రాసిన దోసిట చినుకులు పుస్తకాన్ని ‘మిసిమి’ పుస్తకప్రచురణ సంస్థ తెలుగులో ప్రచురించింది. తన  అనుభవాలను, ఆలోచనలను, భావోద్వేగ క్షణాలను, ఆకాంక్షలను ప్రకాష్‌రాజ్‌ ఈ పుస్తకంలో వ్యక్తీకరించారు. దోసిట చినుకులు తెలుగు పుస్తక ఆవిష్కరణ ఆవిష్కరణ సభ సోమవారం హైదరాబాద్‌ పుస్తక ప్రదర్శనలో జరిగింది. కార్యక్రమానికి రచయిత ప్రకాష్‌ రాజ్‌ హాజరై మాట్లాడారు. ‘నా జీవితంలో ఏదీ నేను అనుకున్నట్లుగా జరగలేదు. పుస్తకం రాస్తాననుకోలేదు, కానీ రాయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నా జీవిత ప్రయాణమే నా కర్తవ్యాన్ని నిర్ణయిస్తుంది. బాగా చదివే అలవాటు ఉంది. కానీ రాయడంలోని అలసట ఇప్పుడిపుడే తెలుస్తోంది. నేను రాసిన మొదటి పుస్తకం ఇది. రాయడం నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది. ఇక రాయకుండా ఉండలేను’ అని చెప్పారు.

ఎంతో ఎత్తు నుంచి జీవితాన్ని చూసే అవకాశం లభించిందని, కానీ ఆ ఎత్తు మాత్రం తనది కాదని.. అది ఎంతోమంది రచయితలు, కవులు, మేధావులు, కర్షకుల నుంచి నేర్చుకున్న అనుభవంగా పేర్కొన్నారు. తాను పొందిన అనుభవాలు, అవగాహన ప్రపంచాన్ని సూక్ష్మంగా పరిశీలించే శక్తిని ఇచ్చిందని, అలాంటి అనుభవాలనే పుస్తకరూపంలో పంచుకున్నానన్నారు. ‘మౌనం మనల్ని మింగేస్తుంది. ఒక నటుడిగా నాకు అప్పగించిన క్యారెక్టర్‌లో నటించాను. కానీ అదంతా అబద్ధం.. మాయ. అది నా జీవితం కాదు. నా చుట్టూ ఘనీభవించిన ఆ మౌనంలోంచి బయటకు రావాలనిపించింది. నేనెవరో  తెలుసుకోవాలి. ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాను. నేను ఒక మాయను కాదు. నేను ఒక వాస్తవాన్ని. ఆ నిజాన్ని అక్షరాల్లో ఆవిష్కరించాను. ఇప్పుడు నాకు గొప్ప సంతృప్తిగా ఉంది. ఇక నేను ఏ మాత్రం రహస్యం కాదు’ అంటూ తన ‘దోసిట చినుకులు’ పుస్తక రచన వెనుక నేపథ్యాన్ని ప్రకాష్‌ రాజ్‌ వివరించారు.

కన్నడంలో రాసిన పుస్తకం ఇప్పటికే పలు భాషల్లోకి అనువాదమైందన్నారు. ప్రముఖ కవి, విమర్శకుడు సీతారామ్‌ పుస్తకాన్ని సమీక్షించారు. ఇది ఒక ధర్మాగ్రహమని, సత్యాన్ని సత్యంగా ప్రకటించడమని చెప్పారు. ఒక్కొక్క అనుభవం ఒక్కో భావశకలమై పాఠకులను స్పృశిస్తుందన్నారు. మనిషికి, ప్రకృతికి ముడిపడిన అనుబంధాన్ని గుర్తుచేసే గ్రీన్‌ లిటరేచర్‌ అని అభివర్ణించారు. ప్రముఖ సినీనటులు తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. ప్రకాష్‌రాజ్‌ గొప్ప నటుడైన అతి సామాన్య వ్యక్తిగా చెప్పారు. బీసీ కమిషన్‌ సభ్యులు జూలూరి గౌరీశంకర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సినీ దర్శకుడు కృష్ణవంశీ, ప్రముఖ వ్యాఖ్యాత ఓలేటి పార్వతీశం, మిసిమి సంపాదకులు వల్లభనేనిఅశ్వినీకుమార్, హైదరాబాద్‌ బుక్‌ ఎగ్జిబిషన్‌ సొసైటీ కార్యదర్శి కోయ చంద్రమోహన్‌ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top