జమా ‘బందీ’ | irregularities in revenue department | Sakshi
Sakshi News home page

జమా ‘బందీ’

Nov 19 2014 2:03 AM | Updated on Sep 2 2017 4:41 PM

ప్రభుత్వ శాఖలకు మార్గదర్శకంగా ఉండాల్సిన రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది.

 ఖమ్మం జెడ్పీసెంటర్: ప్రభుత్వ శాఖలకు మార్గదర్శకంగా ఉండాల్సిన రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ప్రతి ఏటా ప్రభుత్వానికి ఆ శాఖ నుంచి కోట్ల రూపాయాల ఆదాయం రావాల్సి ఉన్నా అధికారుల మాయాజాలంతో లక్షల్లోనే సరిపెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. రెవెన్యూ శాఖకు ఆయువుపట్టుగా ఉన్న గ్రామీణ గణాంక పుస్తకాలను సిబ్బంది పట్టించుకున్న దాఖలాలు లేవు. వీటి నమోదును పరిశీలించేందుకు ప్రభుత్వం రెవెన్యూ శాఖలో జమాబంది విధానాన్ని ఏర్పాటు చేసింది.

ప్రతి ఏటా నిర్వహించాల్సిన జమాబంది గత ఆరేళ్లుగా అధికారుల చేతుల్లో ‘బందీ’ అవుతోంది. 2009లో నాటి కలెక్టర్ ఉషారాణి హయాంలో జమాబంది నిర్వహించారు. తర్వాత వచ్చిన కలెక్టర్లు దీని జోలికి వెళ్లకపోవడంతో రెవెన్యూ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయం తగ్గింది.

 సమీకృత గ్రామీణ గణాంకాల్లో తలెత్తుతున్న అంశాలిలా ఉన్నాయి..
 రిజిస్టర్ ఆఫ్ ల్యాండ్స్..
 రెవెన్యూ గ్రామ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు, వ్యవసాయ, ఇళ్ల స్థలాలకు అనువైన భూములను గుర్తించి వాటి నమోదు రికార్డు చేయాల్సి ఉంటుంది, కానీ జిల్లాలో ఎక్కడా కూడా దకల్(రిజిష్టర్) దస్తావేజలకు రికార్డుల్లో భూమి సరిపోవడం లేదు. లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు పలుకుబడి కలిగిన, రాజకీయ నేతల కబంధ హస్తాల్లో కూరుకుపోయాయి. ఎన్నెస్పీ భూముల్లో అనేక రకాలైన అనితర సాధ్యం కాని కొత్త జీవోలు, కొర్రీలు, మెలికలతో బడాబాబుల చేతుల్లోకి వెళ్తున్నాయి. వీటిలో అటవీ, ఇనాంభూములు, సర్ఫక్రాస్, భూదాన్ భూములు ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు.

 మ్యూటేషన్ రిజిష్టర్..
 వ ంశపారపర్యంగా సంక్రమించిన భూములకు పేరు మార్పిడి చేయడానికి ఉపయోగించాల్సిన మ్యూటేషన్ ప్రక్రియ అనర్హులకు వరంలా మారింది. అసలైన వంశీకులు రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోని రెవెన్యూ సిబ్బంది.. భూముల ధరలు పెరగడంతో భూ బకాసురులకు, అనర్హులకు, జీపీఏ(జనరల్ పవర్ ఆఫ్ అటార్ని), మధ్యవర్తులకు పేరుమార్పిడి చేస్తున్నారు. ప్రభుత్వానికి నిజంగా రావాల్సిన కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్ రుసుం సాదా బైనామా పేరుతో ఎగవేతకు గురవుతోంది. నిజమైన రైతులకు ఉయోగించాల్సిన సెక్షన్‌లు రియల్ మాఫియాకు అధికారులు తాకట్టు పెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
 
పహణీలు..
 భూ యాజమానులను గుర్తించి వారికి సంబంధిత పహణీలు అందించాల్సిన రెవెన్యూ అధికారులు.. దళారుల వద్ద డబ్బు తీసుకుని ఒకే భూమికి చెందిన పహణీలను ఇద్దరు, ముగ్గురు రైతులకు ఇస్తున్నారనే విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ గ్రామంలో ఉన్న భూముల కంటే పహణీల్లో రెట్టింపు భూములు నమోదవుతున్నాయి. బందోబస్తు కాలాలను తాజా పరచడం, ప్రభుత్వ భూముల వివరాలు(ఎర్రసిరాతో) పహణీల్లో రాయాల్సి ఉంటుంది.

అయితే పహణీల్లో వారసుల పేర్లు కాస్తు, పట్టాదారుల వివరాలు నమోదు చేయక అనేక ఏళ్లు గడుస్తోంది. వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు, చెరువులు, వాగులు, వంకలు, సడక్(కాలిబాట), పొలిమేర హద్దులు, మతక భూములు కబ్జాకోరల్లో నలుగుతున్నాయి. జిల్లాలో అనేక చెరువులు, శ్మశాన వాటికలు దురాక్రమణకు గురయ్యాయి. ఖమ్మం మున్సిపాలిటి అయినా ఇప్పటివరకు అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రస్తావన లేకుండా పోయింది. జిల్లాలో సీలింగ్ యాక్టు ఎక్కడా అమలు కావడం లేదు.

 నెలవారీ సాగు నమోదు...
 3ఏ ద్వారా జిల్లాలోని రెవెన్యూ గ్రామ పరిధిలో నెల వారీ వ్యవసాయ సాగు రిజిష్టర్ తప్పని సరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ గ్రామంలో ఎంతమంది రైతులు ఉన్నారు.. ఎన్ని ఎకరాల భూమి సాగు అవుతోంది.. అందులో ఏఏ పంటలు సాగవుతున్నాయో రికార్డుల్లో పొందుపరచాలని రెవెన్యూ సెక్షన్‌లో ఉంటుంది. సాగు మొత్తానికి సంబంధించి అంచనాలు రూపొం దిం చాలి. అయితే ఏ గ్రామంలో ఏ పంటలు పండుతున్నాయో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది.

 నీటి ఆయకట్టు భూముల గుర్తింపు...
 8ఏ ప్రకారం నీటి ఆయకట్టు కలిగిన భూములను గుర్తించడం, అక్కడ వ్యవసాయానికి అనుకూలం గా ఉన్న నీటి వనరులు ఎమి ఉన్నాయో గుర్తించి నమోదు చేయాలి. కానీ రెవెన్యూ అధికారులు వ్యవసాయ భూములను రియల్ భూములుగా మార్చేందుకు ఆసక్తి చూపుతున్నారు తప్ప నీటి వసతిగల భూములను గుర్తించడం లేదు.
 
భూమి శిస్తు రశీదు..
 ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రెవెన్యూ అధికారులకు వరంగా మారింది. భూముల డిమాండ్, కలెక్షన్, బ్యాలెన్స్ విధానంలో భూమి శిస్తులను రెవెన్యూ ఉద్యోగులు వసూలు చేసి రికార్డులు నమోదు చేయాలి. కానీ జిల్లాలో శిస్తు రశీదు పుస్తకాల్లో కార్బన్ పేపర్ మాయాజాలం కనబరుస్తున్నారు. ఒరిజనల్ రశీదుపై తీసుకున్న డబ్బును నమోదు చేస్తూ, రెవెన్యూ శాఖకు పంపే రశీదుపై కొద్ది మొత్తం నగదు చూపుతూ ప్రభుత్వ కళ్లు గప్పి ఏడాదికి లక్షల్లో సిబ్బంది ఆదాయం గడిస్తున్నారు. ఇలా ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు.
 
జనవరి నుంచి జమాబంది చేపడతాం
 జమాబంది లెక్కల నిర్వహణను జనవరి నెలలో చేపట్టేందుకు ప్రణాళిక చేపడుతున్నాం. జిల్లా కలెక్టర్ ఇలంబరితి ఈ విషయంపై చర్చించారు. పహ ణీలు, రికార్డులు అన్నీ అప్‌డేట్ చేసేలా చూస్తాం. తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్, ఆర్‌ఐ, వీఆర్వోలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఈ కార్యక్రమం చేపడతాం. జమాబందితో రెవెన్యూకు సంబంధించిన ఆన్ని రికార్డులు పటిష్టం అవుతాయి. ప్రసుత్తం పింఛన్లు, ఆహారభద్రత కార్డుల దరఖాస్తుల పరిశీలన, జారీ కార్యక్రమం చేపడుతున్నందున జమాబందీని జనవరిలో చేపట్టాలని నిర్ణయించాం.
  - కె.సురేంద్రమోహన్, జాయింట్ కలెక్టర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement