అడ్డా కూలీలకు గడ్డు కాలం

Daily Labour Suffering With COVID 19 Hyderabad - Sakshi

కరోనా ప్రభావంతో అడ్డా కూలీలకు దొరకని పని

అడ్డామీదికొచ్చి నిరాశతో వెనుతిరుగుతున్న కూలీలు

వారం రోజులుగా పస్తులు

చార్మినార్‌: కోవిడ్‌–19 వైరస్‌ ప్రభావం పాతబస్తీలోని అడ్డా కూలీలపై కూడా పడింది. సాధారణ రోజుల్లో అంతంత మాత్రంగా దొరికే కూలీ పనులు ప్రస్తుతం కోవిడ్‌ వైరస్‌ దెబ్బతో అడ్డా కూలీలను మరింత కుంగదీస్తోంది. రోజు పొద్దున్నే తిన్నా.. తినకపోయినా అడ్డాల మీదికి చేరుకునే రోజు వారి కూలీలకు గత వారం రోజులుగా పనులు దొరకడం లేదు. దీంతో ప్రతిరోజు ఉదయం అడ్డాలకు చేరుకోవడం.. పనులు దొరక్కపోవడంతో నిరాశతో ఇళ్లకు చేరడం పరిపాటిగా మారింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌ వైరస్‌ ప్రభావంతో పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో గృహ నిర్మాణం పనులు కూడా సన్న గిల్లాయి. అన్ని రకాల బిజినెస్‌లు దెబ్బతినడంతో ఆర్థిక లావాదేవీలు మందగించాయి. దీంతో గృహవసరాల కోసం మాత్రమే డబ్బును వినియోగించడానికి ప్రజలు సిద్ధమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 31 వరకు విద్యాసంస్థలతో పాటు జనం ఎక్కువగా గుమిగూడే ప్రాంతాలన్నింటినీ మూసి వేయడంతో స్థానిక ప్రజలు అప్రమత్తమయ్యారు. విద్యార్థులకు పాఠశాలలు లేకపోవడంతో చాలా వరకు ఇళ్లకే పరిమితమయ్యారు. సిమెంట్, ఇసుక, కంకర అశించిన మేరకు అందుబాటులో లేకపోవడంతో గృహ నిర్మాణాలు చాలా వరకు కుంటుపడినట్లు బిల్డర్లు చెబుతున్నారు. దీంతో రోజు వారి అడ్డా కూలీలకు కూలీ పనులు దొరకడం గగనంగా మారింది.  

సొంతూరికి పయనం  
చార్మినార్, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురా, యాకుత్‌పురా తదితర నియోజకవర్గాల పరిధిలో డబీర్‌పురా, యాకుత్‌పురా, బడాబజార్, కోకాకీతట్టీ, లాల్‌దర్వాజ మోడ్, పురానాపూల్, బహదూర్‌పురా, తాడ్‌బన్, కిషన్‌బాగ్, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, ఐఎస్‌ సదన్, యాదగిరి థియేటర్, ఎర్రకుంట, సంతోష్‌నగర్‌ వాటర్‌ ట్యాంక్, బార్కాస్‌ తదితర ప్రాంతాల్లో లేబర్‌ అడ్డాలు కొనసాగుతున్నాయి. ప్రతి రోజు ఉదయం ఈ లేబర్‌ అడ్డాలలో వందల సంఖ్య లో కూలీలు పనుల కోసం వేచి ఉంటారు. ఉదయం నుంచి మ«ధ్యాహ్నం వరకు కూలీ పను లు దొరుకుతాయాఅనిఆశగా ఎదురు చూస్తారు. వారంరోజులుగా కోవిడ్‌ టెన్షన్‌తో పనులుదొరక డం లేదు. దీంతో రోజుల తరబడి పస్తులుండ లేక సొంత ఊర్లకు వెళుతున్నారు. సొంత ఊర్ల కు వెళ్లలేని ఉన్న కొద్ది మందికి కూడా పనులు దొరకని దుర్బర పరిస్థితులు పాతబస్తీలో నెలకొన్నాయి. దీంతో పాతబస్తీలోని లేబర్‌ అడ్డాలు కూలీలు లేక వెలవెలబోతున్నాయి.

రేషన్‌ ద్వారా సరుకులు ఇవ్వాలి  
నగరంలో పరిస్థితులు ఈవిధంగానే ఉంటే తమ కుటుంబ సభ్యులు పస్తులుండే పరిస్థితులున్నాయని అడ్డా కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వారం రోజులుగా పనులు లేక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల అద్దెతో రోజు వారీ ఖర్చులకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాపోతున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని జీవితాలు గడుపుతున్న తమను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. రేషన్‌ దుకాణాల ద్వారా రెండు నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులను ఉచితంగా అందజేయాలని కోరుతున్నారు. గుర్తింపు పొందిన అడ్డా కూలీలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని దినసరి వేతన కూలీల సంఘం నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

రోజూ వస్తున్నా..పని దొరకుత లేదు
వారం రోజులగా డబీర్‌పురాలోని లేబర్‌ అడ్డా కు వస్తున్నా. పని దొర కుత లేవు. ఉదయం వచ్చి మధ్యాహ్నం వరకు అడ్డాలో కూర్చొని సాయంత్రం ఒట్టి చేతులతో ఇంటికి పోతున్నా. ఏం చేయాలో తెలుస్త లేదు. కూలీ చేస్తేనే మాకు డబ్బులొస్తాయి. లేకపోతే రావు. రోజు వారీ ఇంటి ఖర్చుల కోసం ఏం చేయాలో తెలుస్తలేదు. మా చుట్టాలు సొంత ఊర్లకు వెళ్లి పోయిండ్రు. నేను కూడా పోతా. రేషన్‌ దుకాణాల ద్వారా నిత్యావసర వస్తువులను ఉచితంగా పంపిణీ చేసి మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి.      – యాదమ్మ, డబీర్‌పురా

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top