రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఆయా కమిటీ చైర్మన్లు, వైస్-ైచైర్మన్లు, సభ్యులంతా తమ పదవులను కోల్పోయారు.
ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఆయా కమిటీ చైర్మన్లు, వైస్-ైచైర్మన్లు, సభ్యులంతా తమ పదవులను కోల్పోయారు. ఆ కమిటీలకు తక్షణమే పర్సన్ ఇన్‌చార్జీలను నియమించాలని వ్యవసాయ మార్కెటింగ్ కమిషనర్‌ను సర్కార్ ఆదేశించింది. కొత్త కమిటీలు ఏర్పాటయ్యే వరకు పర్సన్ ఇన్‌చార్జులే వాటిపై అధికారాలు కలిగి ఉంటారని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. రాష్ట్రంలో 220 మార్కెట్లు ఉంటే... వాటిల్లో 150 మార్కెట్లకు గత ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేసింది.
వారంతా కాంగ్రెస్‌కు చెందినవారే. ఆదాయాన్ని బట్టి మార్కెట్లను ఎ, బి, సి కేటగిరీగా విభజించారు. ఇదిలాఉండగా, మార్కెట్ కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో ఆయా సామాజిక వర్గాల వారికి గణనీయంగా పదవులు లభిస్తాయి. ఇప్పటికే మార్కెట్ కమిటీ పదవులపై పలువురు టీఆర్‌ఎస్ నాయకులు ఆశలు పెట్టుకున్నారు. కొందరు ముఖ్య నేతలకు ఈమేరకు హామీ కూడా లభించింది. పాత కమిటీలు రద్దయినందున ఆ పదవులను దక్కించుకునేందుకు పైరవీలు మొదలుకానున్నాయి.