కల్వకుంట్ల చరిత్రను లిఖించదలిచారా? | BJP State President Laxman Criticized KCR on Yadagirigutta | Sakshi
Sakshi News home page

స్వామితో పాటు మీ దర్శనం కూడా కావాలనుకుంటున్నారా?

Sep 7 2019 7:18 PM | Updated on Sep 7 2019 7:44 PM

BJP State President Laxman Criticized KCR on Yadagirigutta - Sakshi

సాక్షి, యాదాద్రి : స్వామి వారి చరిత్రను పక్కన పెట్టి కల్లకుంట్ల చరిత్రను లిఖించదలిచారా? అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ కేసీఆర్‌పై మండిపడ్డారు. యాదాద్రిలో కేసీఆర్‌, కారు బొమ్మలు వివాదాస్పదమైన నేపథ్యంలో శనివారం ఆయన కార్యకర్తలతో కలిసి యాదాద్రి గుట్టపైకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకొని లక్ష్మణ్‌తో పాటు మరో ఐదుగురిని మాత్రమే అనుమతించడంతో గుట్టకింద బీజేపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ నయా నిజాం పాలన చేస్తున్నారని, స్వామివారితో పాటు తన దర్శనం కూడా కావాలని కేసీఆర్‌ కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు. పవిత్ర క్షేత్రమైన యాదాద్రినే అపవిత్రం చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ గొప్ప హిందువునని చెప్తారు కానీ ఇతర మతాల చిత్రాలు చెక్కడం దేనికి సంకేతమని నిలదీశారు.

హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ.. గర్భగుడిలోనూ చిత్రాలు చెక్కుతారా అని ప్రశ్నించారు. ఇది ఉద్దేశ్యపూర్వకంగా చేసిందేనంటూ దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యకర్తలను అరెస్ట్‌ చేయడంపై స్పందిస్తూ దేవుణ్ణి దర్శించడానికి వస్తే ఆంక్షలు పెడుతున్నారనీ, సీఎం కేసీఆర్‌ ఏమైనా ఆదేశాలిచ్చారా అనేది స్పష్టం చేయాలన్నారు. వారంలోపు బొమ్మలను తొలగించకపోతే ఆందోళన తప్పదని హెచ్చరించారు. మరోవైపు కేసీఆర్‌ యజ్ఞయాగాలు చేయడం తన కొడుకు పట్టాభిషేకం కోసమేనని విమర్శించారు.  

Advertisement
 
Advertisement
Advertisement