breaking news
-
కేసీఆర్ త్వరగా కోలుకోవాలి: చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును ప్రముఖులు పరామర్శిస్తున్నారు. కాలి తుంటి గాయంతో సర్జరీ అయిన ఆయన నగరంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజకీయ ప్రముఖులు ఆయన దగ్గరకు క్యూ కడుతున్నారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడితో పాటు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తాజాగా కేసీఆర్‌ను పరామర్శించి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. కేసీఆర్‌ను పరామర్శించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ‘కేసీఆర్‌ను పరామర్శించాను. డాక్టర్లు కూడా ఆపరేషన్ బాగా చేశారని చెప్పారు. ఆయన కోలుకోవడానికి ఆరువారాల టైం పడుతుందని డాక్టర్లు చెప్పారు. ఆయన త్వరగా కోలుకోవాలి. కోలుకుని మళ్లీ ప్రజా సేవకు రావాలి. జీవితంలో ఒడిదుడకులు రావటం సహజం. ప్రజలకు అంకిత భావంతో మళ్ళీ ఆయన సేవ చేయాలని కోరుకుంటున్నా’’ అని చంద్రబాబు అన్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం, మంత్రి మల్లు భట్టి విక్రమార్క, కేసీఆర్‌ను పరామర్శించి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్‌ను పరామర్శించేందుకు రాజకీయంతో పాటు సినీ ప్రముఖులు తరలి వస్తుండడం గమనార్హం. -
పొన్నాల వాట్సాప్ స్టేటస్‌పై ఎర్రబెల్లి ఫైర్
సాక్షి, వరంగల్: బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్యపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఆస్పత్రిలో ఉన్న మాజీ సీఎం కేసీఆర్‌ను.. సీఎం రేవంత్‌రెడ్డి పరామర్శిస్తున్న ఓ ఫొటోను బీఆర్ఎస్ శ్రేణులు సెటైరిక్‌గా ప్రచారం చేసుకున్నాయి. అయితే సీనియర్ నేత పొన్నాల సైతం ఆ ఫొటోను వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకున్నారు. ఈ పరిణామంపై వరంగల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మండిపడ్డారు. ‘‘మాజీ సీఎం కేసీఆర్‌ను సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా, గౌరవంగా కలిసి పలకరించారు. అందులో తప్పేం ఉందో అర్థం కావడం లేదు. పొన్నాల.. మీరొక సీనియర్ లీడర్. స్వార్దంతో పార్టీని వీడిన మీరు.. ఇలా సీఎం స్థానంలో ఉన్న వ్యక్తిని ఉద్దేశించి ఇలాంటి స్టేటస్లు పెట్టడం సిగ్గు చేటు. .. మీకు సంస్కారం లేదని ఈ విషయంతో అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు అనుభవించి మీ దారిన మీరు పోయారు. మీ వయస్సు కు తగ్గ విధంగా ప్రవర్తించండి. మరోసారి ఇలాంటివి పెడితే సహించే ప్రసక్తే లేదు’’ అని వీడియో సందేశం ద్వారా పొన్నాలను ఉద్దేశించి ఎర్రబెల్లి స్వర్ణ ఫైర్ అయ్యారు. -
సీఎం రేవంత్‌కు మల్లారెడ్డి స్పెషల్ రిక్వెస్ట్..ఏంటంటే..?
సాక్షి,హైదరాబాద్:మాజీ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు మాజీ మంత్రి మల్లారెడ్డి చెప్పారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ను సోమవారం మల్లారెడ్డి పరామర్శించారు. కేటీఆర్‌ను కలిసి కేసీఆర్ ఆరోగ్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ఇంకా రెండుమూడు రోజులు తర్వాత కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. కళ్లల్లో వత్తులు వేసుకుని మరీ కేసీఆర్ తెలంగాణను ఒక మోడల్‌గా తయారు చేశారు. కేటీఆర్ లేని హైదరాబాద్‌ను ఐటీ ఉద్యోగులు చూడలేకపోతున్నారు’ అని మల్లారెడ్డి అన్నారు. ‘రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో అన్ని సదుపాయాలు మెరుగుపడ్డాయి.లోకల్‌గా ఎమ్మెల్యే కి ఓటు వెయ్యకూడదని ప్రజలు అనుకున్నారు కానీ సీఎంగా కేసీఆర్ ఉండరని వారు అనుకోలేదు. కేసీఆర్ సీఎంగా లేనందుకు ఇప్పుడు అందరూ బాధపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఓకే ఒక్క విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాలను కాపాడాలని కోరుతున్నా’ అని మల్లారెడ్డి చెప్పారు. ఇదీచదవండి..సీఎం రేవంత్‌తో భేటీ..జానారెడ్డి కీలక వ్యాఖ్యలు -
సీఎం రేవంత్‌తో భేటీ..జానారెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్ : కొత్త ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా సీఎం రేవంత్‌రెడ్డి వచ్చి కోరారని మాజీ మంత్రి జానారెడ్డి తెలిపారు. సోమవారం సీఎం తనతో భేటీ అయిన సందర్భంగా జానారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ప్రజాభిమానం చూరగొనేలా పనిచేయాలని సీఎం రేవంత్‌కు చెప్పాను. ప్రభుత్వంలో నా పాత్ర ఏమి ఉండదు. నా సలహాలు సూచనలు కావాలంటే ఇస్తా. కొత్త ప్రభుత్వం తమకున్న బాధలు,ఇబ్బందులు వెల్లడించడం శుభపరిణామం ’ అని జానారెడ్డి తెలిపారు. ‘కేసీఆర్ ఆస్పత్రిలో ఉండడం చాలా బాధాకరం.నేను వెళ్లి కలిసే ప్రయత్నం చేశాను కానీ ఆయన నిద్రలో ఉన్నారు. కేటీఆర్, హరీష్ రావులను కలిసి వచ్చాను. కేసీఆర్ కోలుకుని కొత్త ప్రభుత్వానికి ఆయన సలహాలు సూచనలు ఇవ్వాలి.నేను పార్లమెంట్ కు పోటీ చేస్తాను అని గతంలో చెప్పా. అధిష్టానం ఆదేశిస్తే ఆలోచిస్తా’ అని జానారెడ్డి చెప్పారు. ఇదీచదవండి..స్పీకర్ ఎన్నిక 14న..ఆయనకే ఛాన్స్ ! -
TS: స్పీకర్ ఎన్నిక 14న..ఆయనకే ఛాన్స్ !
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఈ నెల 14న జరగనుంది. స్పీకర్ ఎన్నిక తేదీని ఖరారు చేస్తూ అసెంబ్లీ సెక్రటేరియట్ సోమవారం(డిసెంబర్11)నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పీకర్ పదవికి పోటీపడే వారే నుంచి ఈ నెల 13న ఉదయం 10.30గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నుంచే స్పీకర్ ఎన్నికవనున్నారు. వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌కు స్పీకర్ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అయితే స్పీకర్ ఎన్నిక ఏకగగ్రీవం కావాలంటే కాంగ్రెస్ పార్టీ తరపున ఒక్క నామినేషన్ మాత్రమే రావాల్సి ఉంటుంది. ఎవరైనా ఇతర సభ్యులు పోటీలో ఉంటే బ్యాలెట్ ద్వారా స్పీకర్‌ను ఎన్నుకుంటారు. ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలో స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఇదీచదవండి..కిషన్.. పవన్.. ఓ ప్రచారం -
కిషన్.. పవన్.. ఓ ప్రచారం
పవన్‌ను లక్ష్యంగా చేసుకొని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడినట్టుగా చేస్తున్న సోషల్ మీడియా సర్కులేషన్ వెనుక టీడీపీ నేతల హస్తం ఉందా?. ఈ ప్రచారం వెనక అసలు కారణం ఏంటి? సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంలో నిజమెంత? పవన్‌పై తాను అనుచిత వ్యాఖ్యలు చేశానంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తమని, కొందరు కావాలనే తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని కిషన్‌రెడ్డి అన్నారు. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు. ఎన్డీయేలో భాగస్వామ్యం ఉండడంతోనే జనసేనతో కలిసి బరిలో దిగామని కిషన్‌రెడ్డి అన్నారు. అసలేం జరిగిందంటే..? సోషల్ మీడియాలో నిన్న జరిగిన ప్రచారం ఏంటంటే... పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన కిషన్ రెడ్డి పవన్ కళ్యాణ్ నీ నమ్ముకొని గ్రేటర్ లో నష్టపోయాం పవన్ తో స్టేజ్ మీద కూర్చున్నప్పుడు రాష్ట్ర ప్రజలు మా విలువ తగ్గించారు. ఆ సంగతి గ్రహించే పొత్తుని ఉప సంహరించుకోవాలని అధిష్టానం సూచించింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగి పొయింది. సొంతంగా పోటీ చేసి ఉంటే కనీసం గ్రేటర్ పరిధిలో 4-5 సీట్లు గెలిచే అవకాశం ఉండేది. కనీసం మా కార్పొరేటర్ల మాట విన్నా బాగుండేదని అనిపించింది. హైదరాబాద్ వెలుపల సీట్లు, ఓట్లు సాధించినా, సిటీలో పోటీ ఇవ్వలేకపోయాం. గట్టి పోటీ ఇచ్చి గెలుస్తామని భావించిన లింగంపల్లి, ఖైరతాబాద్, కూకట్పల్లి,కుత్భూలాపూర్, యాకుత్‌పురా, ఉప్పల్, రాజేంద్రనగర్... సీట్లు కేవలం పవన్ కళ్యాణ్ తో పొత్తు కారణంగానే ఘోరంగా ఓడిపోయం సెటిలర్స్ లో ఉన్న కాపు, కమ్మ సామాజిక వర్గం నాతోనే ఉంటుందని పవన్ కళ్యాణ్ గట్టిగా నమ్మించాడు. ఈ ప్రచారం వెనక ఎవరి హస్తం ? తెలంగాణలో ఎన్నికలు ముగిసాయి. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం జనసేన పొత్తుతో పోటీ చేస్తామని నిర్ణయించుకున్నారు. ఈ రెండు పార్టీల మధ్య సీట్ల చర్చలు జరుగుతున్నాయి. తనకు కనీసం 50 ఎమ్మెల్యే టికెట్లు అలాగే ఐదు ఎంపీ టికెట్లు కావాలని పవన్ కళ్యాణ్ అడుగుతున్నాడు. అయితే 20 ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని అలాగే 3 ఎంపీ టికెట్లు ఇస్తామని తెలుగుదేశం చెబుతోంది. తెలంగాణలో బీజేపీతో 8 సీట్లకే ఒప్పుకున్నందుకు ఏపీలో 20 సీట్లు సరిపోతాయన్నది చంద్రబాబు లెక్క. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ విలువను తగ్గించేందుకు సోషల్ మీడియాను టిడిపి అస్త్రంగా చేసుకుంటుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలోనూ సోషల్ మీడియా వేదిక గా తెలుగుదేశం పలుకుట్రలు అమలు చేసిందన్నది జనసేన సైనికుల ఆరోపణ. పవన్ కళ్యాణ్ కూడా గతంలో పలుమార్లు చంద్రబాబు లోకేష్‌లను నేరుగా విమర్శించాడు. 2018-2019 మధ్య కాలంలో తన వ్యక్తిత్వాన్ని, కుటుంబాన్ని దెబ్బతీసేలా తెలుగుదేశం పార్టీ నాయకులు సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించాడు. తాజాగా పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకొని కిషన్ రెడ్డి మాట్లాడినట్టుగా చేస్తున్న సోషల్ మీడియా సర్కులేషన్ వెనుక టిడిపి నేతల హస్తం ఉందని అనుమానిస్తున్నారు. తద్వారా పవన్, జనసేన విలువను తగ్గించి ఆ పార్టీకి వీలైనన్ని తక్కువ సీట్లు ఇచ్చేలా ఒప్పించవచ్చన్నది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇదీ చదవండి: జనసేన కేడర్‌కు, పవన్‌కు వార్ -
కరెక్ట్ కాదు.. కామ్రేడ్!
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ రాష్ట్ర కమిటీ తీసుకున్న నిర్ణయంపై సీపీఎంలో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. కాంగ్రెస్‌తో సర్దుబాటు చేసుకోకుండా చివరి నిమిషం వరకు గందరగోళ నిర్ణయాలు తీసుకోవడం... అనంతరం ఒంటరిగా పోటీ చేసి డిపాజిట్లు కోల్పోవడంపై ఆ పార్టీ కార్యకర్తల్లో ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ తీసుకున్న నిర్ణయం పరోక్షంగా బీఆర్ఎస్కు ప్రయోజనం చేకూరేదిగా ఉందన్న ఆరోపణలను రాష్ట్ర అగ్రస్థాయి నాయకులు కూడా వ్యక్తం చేస్తున్నారు. దీంతో పార్టీ పోటీ చేసిన 19 నియోజకవర్గాల్లోనూ క్రాస్ ఓటింగ్ జరిగిందని పార్టీ అంతర్గత విచారణలో తేలింది. పార్టీకి చెందిన యువ ఓటర్లు కాంగ్రెస్‌కు ఓటు వేసినట్లు స్పష్టమైందని అంటున్నారు. అందువల్లే ఎన్నడూలేని స్థాయిలో పార్టీ ఎన్నికల్లో ఘోరమైన పరాభవాన్ని చవిచూడాల్సి వచ్చిందంటున్నారు. మిర్యాలగూడ, పాలేరు, భద్రాచలం వంటి స్థానాల్లోనూ ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చిందని విశ్లేvస్తున్నారు. మొత్తంగా కాంగ్రెస్‌ను గెలిపించేలా క్రాస్ ఓటింగ్ జరిగిందని పార్టీ వర్గాలు అంచనాకు వచ్చినట్లు తెలిసింది. సీపీఐ మాదిరిగా ఎందుకు వ్యవహరించలేదు? ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్తో పొత్తు పొడవకపోవడంతో కాంగ్రెస్‌తో సర్దుబాటు చేసుకోవాలని సీపీఎం నిర్ణయించిన సంగతి తెలిసిందే. చివరకు కాంగ్రెస్‌తోనూ సర్దుబాటు కుదరలేదు. మిర్యాలగూడ కేటాయించి, అధికారంలోకి వచ్చాక రెండు ఎమ్మెల్సీలు ఇస్తామని కాంగ్రెస్ విధించిన షరతును సీపీఎం తోసిపుచ్చింది. దీంతో ఒంటరిగా 19 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ ఎక్కడా డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. సీపీఐ కొత్తగూడెం సీటు, రెండు ఎమ్మెల్సీలకు ఒప్పుకొని కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని ప్రయోజనం పొందగలిగింది. ఇలా ఎందుకు చేయలేదన్న చర్చ సీపీఎంలో కొందరు నేతలు లేవనెత్తుతున్నారు. రాష్ట్రం వచ్చినప్పటి నుంచి తప్పుడు నిర్ణయాలే? తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో పార్టీ నాయకత్వం తప్పుడు నిర్ణయాలే తీసుకుంటోందని రాష్ట్రస్థాయి నాయకుడొకరు వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడంతో 2014లోనూ సీపీఎం భారీ నష్టాన్ని మూటగట్టుకుంది. 2018 ఎన్నికల్లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్)ను ఏర్పాటు చేసి విఫలమైంది. బీఎల్ఎఫ్ ఏర్పాటు విఫల ప్రయోగమని పార్టీ కేంద్ర కమిటీ చీవాట్లు పెట్టిందని అంటున్నారు. ఇక ఇప్పుడు మూడోసారి కాంగ్రెస్‌తో సర్దుబాటు చేసుకోవడంలో విఫలమై మరోసారి పరాభవాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చిందని ఒక నాయకుడు విశ్లేvంచారు. ‘పార్టీ సిద్ధాంతం గొప్పది. మార్క్సిజం అజేయమే. కానీ ఆ సిద్ధాంతాన్ని సరిగా అమలుచేయకపోవడం వల్ల ప్రజల్లో సీపీఎం పలుచన అవుతోంది. ఇది కొందరు వ్యక్తులు తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలే’నని ఆ నాయకుడు అన్నారు. ఆ మూడురోజుల్లో చర్చ పార్టీ ఓటమి, భవిష్యత్ కార్యాచరణపై ఈ నెల 12వ తేదీన రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం, 13, 14 తేదీల్లో రాష్ట్ర కమిటీ సమావేశాలు నిర్వహించాలని సీపీఎం నిర్ణయించింది. మరోవైపు పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో పనిచేసిన వ్యక్తులపై చర్యలు తప్పవని అంటున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనైనా సరైన వ్యూహాన్ని అనుసరించి ఎన్నికలకు వెళ్లాలని సీపీఎం కార్యకర్తలు కోరుకుంటున్నారు. -
ఫైళ్లు మాయంపై దర్యాప్తు జరగాల్సిందే...
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విభాగాల్లో ఫైళ్లు మాయం కావడంపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేయించాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. బాధ్యులు ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆదివారం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి ఆఫీసుతో పాటు ఇతర విభాగాల్లో కూడా ఫైళ్లు, ఇతర వస్తువులను తరలించే ప్రయత్నాన్ని ప్రజలందరూ చూశారని, స్థానికులు, పోలీసులు అప్రమత్తమవడంతో వదిలేసి వెళ్లిపోయారని వివరించారు. ఇలాంటి ఘటనలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలన్నారు. ధీరజ్‌పై రాహుల్‌కు ఎందుకంత ప్రేమ? మూడు రోజులుగా కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇంటిపై ఐటీ అధికారుల దాడులు నిర్వహిస్తున్న తీరు దేశం మొత్తం విస్తుపోయేలా చేసిందని, నగదు దొరకడం చరిత్రలోనే మొదటిసారి అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ధీరజ్ సాహు ఆపార్టీ నేత రాహుల్ గాందీకి అత్యంత సన్నిహితుడని, చిన్న చిన్న విషయాలకు స్పందిస్తూ ట్విట్టర్ లో పోస్టులు పెట్టే రాహుల్ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల్లో మూడు సార్లు ఓడిపోయినా కూడా ధీరజ్ సాహును మూడు సార్లు రాజ్యసభ ఎన్నుకున్నారని, ధీరజ్‌పై ఎందుకంత ప్రేమ చూపిస్తున్నారో రాహుల్ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి చేసే ముఖ్యమంత్రులను, ఎంపీలను ఏటీఎంలుగా మార్చుకుందని, ఆ పార్టీ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ అవినీతి మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుందని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం నుంచి రూ. వందల కోట్లను తెలంగాణ ఎన్నికలకు తరలిస్తూ పట్టుబడటం చూశామన్నారు. ధీరజ్ సాహులాగే కర్ణాటకలో మరో నాయకుడు నుండి ఈ డబ్బు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కర్ణాటకలో ప్రజలు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. రాష్ట్రంలో బీజేపీ శాసనసభాపక్షనేత ఎంపికపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అదంతా దుష్ప్రచారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుకు సంబంధించి తాను జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారని.. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇలాంటి అసత్యాలను ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నవారిపై సోమ వారం పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. -
TS: బీజేపీ నేతల్లో అంతర్మథనం..ఇప్పుడేం చేద్దాం!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ, రాష్ట్ర నాయకత్వాల అంచనాలు తప్పడానికి కారణాలు ఏమై ఉంటాయా అన్న దానిపై బీజేపీలో ప్రస్తుతం ‘పోస్ట్ మార్టమ్’ సాగుతోంది. అన్ని రకాలుగా కసరత్తు చేసి, తగిన జాగ్రత్తలతో బరిలో దిగినా చివరికి నిరాశ కలిగించేలా ఫలితాలు రావడానికి ప్రభావం చూపిన అంశాలు ఏమిటన్న దానిపై లోతైన పరిశీలనలో పార్టీ నేతలు నిమగ్నమయ్యారు. ఈ ఎన్నికల్లో పార్టీ ఆశించిన ఫలితాలను సాధించి రాష్ట్ర రాజకీయాల్లో కీలకభూమి పోషిస్తుందనే అంచనాలు తప్పి కేవలం ఎనిమిది సీట్లకే పరిమితం కావడాన్ని పార్టీ నేతలు జీచ్చి చుకోలేక పోతున్నారు. గెలిచిన 8లో ఏడు స్థానాలు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచే ఉండడం, పార్టీకి అత్యధిక పట్టు, ప్రజల ఆదరణ, మద్దతు అధికంగా ఉందని భావిస్తున్న గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నుంచి గోషామహల్ సీటు మాత్రమే రావడం వంటి పరిణామాలు నేతల అంచనాలకు పూర్తి స్థాయిలో అందడం లేదంటున్నారు. బీసీ సీఎం నినాదం, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మద్దతు, సకల జనుల సౌభాగ్య తెలంగాణ పేరిట ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో ప్రజలపై ప్రభావం చూపించలేకపోయాయని విశ్లేషిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీకి అనుకూలంగా మారకపోగా, కర్ణాటక గెలుపుతో ఊపు మీదున్న కాంగ్రెస్ పార్టీ దాన్ని విజయవంతంగా అనుకూలంగా మలుచుకోగలిగిందని లెక్కలు వేస్తున్నారు. ఎందుకు కమలాన్ని పట్టించుకోలేదంటే.. బీజేపీకి ట్రేడ్ మార్క్‌గా ఉన్న ‘హిందూత్వ’ఎజెండాను మరింత బలంగా తీసుకెళ్లాల్సి ఉండిందా? సామాజిక కోణంలో తీసుకున్న బీసీ సీఎం నినాదం పనిచేయక పోవడానికి కారణాలేంటి? బయటి నుంచి వచ్చిన నేతలకు ఎన్నికల్లో కీలక బాధ్యతలు అప్పగించడం నష్టం చేసిందా? వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనైనా పార్టీ సరైన ఫలితాలు సాధించాలంటే ఏయే మార్పులు చేయాలి? తదితర ప్రశ్నలు ఇప్పుడు బాధ్యులైన నేతల మధ్య ప్రధానంగా చర్చకు వస్తున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. బీఆర్ఎస్–బీజేపీ ఒకటేనని, రెండింటి మధ్య లోపాయికారి మితృత్వం ఉందంటూ జరిగిన ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టలేకపోవడం, కాళేశ్వరం, ఇతర ప్రాజెక్ట్‌ల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని స్వయంగా కేంద్రపెద్దలు విమర్శించినా ఆ మేరకు కనీస చర్యలు తీసుకోకపోవడం, ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత ప్రమేయం, అరెస్ట్ ఖాయమంటూ ప్రకటనలు చేసినా ఆ మేరకు యాక్షన్ లేకపోవడం, కేసీఆర్ సర్కార్‌పై రాజీలేని పోరాటం చేసి పార్టీ కేడర్‌లో నూతనోత్సాహం నింపిన బండి సంజయ్‌ని హఠాత్తుగా అధ్యక్షుడిగా తొలగించడం, బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఈటల రాజేందర్‌కు వివిధ కీలక బాధ్యతలిచ్చి ప్రాధాన్యతనివ్వడం తదితరాలు బీజేపీ ఓటమికి ప్రధాన కారణాలు కావొచ్చుననే చర్చ ఇప్పుడు పార్టీలో సాగుతోంది. అభ్యర్థుల ఖరారు ఆలస్యం కావడం, బలంలేని జనసేనకు 8 సీట్లు కేటాయించడం, పార్టీ నాయకులు ఓ జట్టుగా సమన్వయంతో పనిచేయకపోవడం వెరసి ప్రజలు బీఆర్ఎస్కు బీజేపీని ప్రత్యామ్నాయంగా చూడకపోవడంతో తీసికట్టుగా ఫలితాలు వచ్చాయని ఆ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ఎలా ? వచ్చే మార్చి, ఏప్రిల్‌లలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లోనైనా తెలంగాణ నుంచి గణనీయమైన సంఖ్యలో (గతంలో గెలిచిన 4 ఎంపీ సీట్ల కంటే అధికంగా) సీట్లు సాధించాలనే పట్టుదల రాష్ట్ర పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఓటమి భారంతో మునిగిన పార్టీలో నూతనోత్తేజాన్ని నింపేందుకు వెంటనే ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై పార్టీ నాయకులు సమాలోచనల్లో నిమగ్నమయ్యారు. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగే విషయంలో పెద్దగా ఆసక్తి చూపించడం లేదన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్లీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తీసుకొస్తే ప్రయోజనం ఉంటుందా? ఈటలకు ఆ బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుంది? లేదా లోక్‌సభ ఎన్నికల దాకా కిషన్‌రెడ్డి నే కొనసాగించి ఆ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకెళితే మంచిదా అన్న ఆలోచనల్లో జాతీయ నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది. -
ఆ రహదారిని ఆరు వరుసలకు విస్తరిస్తాం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిని త్వరలోనే ఆరు వరుసలుగా విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టును రెండేళ్లలోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ ప్రాజెక్టు పూర్తయితే విజయవాడకు అతి తక్కువ సమయంలోనే చేరుకునే అవకాశముందని కోమటిరెడ్డి వెల్లడించారు. తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు ఢిల్లీకి వెళ్తున్న నేపథ్యంలో, కేంద్రమంత్రి నితిన్గడ్కరీతో భేటీ అయి పెండింగ్‌లో ఉన్న 14 జాతీయ రహదారుల ప్రతిపాదనలపై చర్చించనున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఆదివారం ఆయన సచివాలయంలోని తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వారంలో మూడు రోజులు సచివాలయంలో, మూడు రోజులు జిల్లా పర్యటనలో ఉంటానన్నారు. రాష్ట్రంలోని రోడ్లను మెరుగుపరిచి దేశంలోనే ఒక మోడల్ రాష్ట్రంగా అభివృద్ధి చేయనున్నట్టు వెల్లడించారు. నాలుగు వరుసలకు విస్తరిస్తాం నల్గొండ నుంచి ముషంపల్లి మీదుగా ధర్మాపురం వరకు సింగిల్ రోడ్డుగా ఉండి ఎన్నో ప్రమాదాలకు కారణమవుతున్న రోడ్డును రూ.100 కోట్లతో నాలుగు వరుసలకు విస్తరిస్తామని కోమటిరెడ్డి వెల్లడించారు. కొడంగల్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే లింగంపల్లి– దుగ్యాల రోడ్డును రూ.4.15 కోట్లతో మెరుగుపరుస్తామన్నారు. వారం రోజులు కూడా కాకముందే తమ ప్రభుత్వం రైతుబంధు నిధులు ఇవ్వటం లేదని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించటం విడ్డూరంగా ఉందన్నారు. కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీనివాసరాజు, ప్రత్యేక కార్యదర్శి విజేంద్రబోయి, ఈఎన్సీలు గణపతిరెడ్డి, రవీందర్రావు, న్యాక్ డీజీ భిక్షపతి, ఈఈ శశిధర్‌తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. కేసీఆర్‌ను పరామర్శించిన మంత్రి సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోమటిరెడ్డి ఆదివారం పరామర్శించారు. అనంతరం అక్కడే ఉన్న కేసీఆర్ కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత, హరీశ్‌రావును కలిసి కేసీఆర్ ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. -
సీపీఎంకు భంగపాటు.. తమ్మినేనికి ఎదురుదెబ్బ!
ఉమ్మడి ఖమ్మం జిల్లాను ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట అనేవారు. ఇప్పుడు కంచుకోట కనుమరుగైపోయింది. కాంగ్రెస్ మద్దతుతో సీపీఐ ఒక సీటు గెలుచుకుంది. ఒంటరిగా బరిలోకి దిగిన సీపీఎం కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శికి కూడా డిపాజిట్ దక్కలేదు. ఇంత పతనాన్ని సీపీఎం నాయకులు ఊహించలేదా? ఊహించినా నిర్లక్ష్యంగా వ్యవహరించారా? తాజా ఎన్నికలతో కమ్యూనిస్టుల ప్రస్తుత వాస్తవ బలం ఎంతో తెలిసిందా?.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు ప్రస్తుతం ఉన్న ప్రజా బలం ఎంతో తేలిపోయింది. సీపీఐ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం సీటు ఒక్కటి తీసుకుని కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది. సీపీఎం మాత్రం సీట్ల బేరం కుదరక ఒంటరిగా బరిలోకి దిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 19 స్థానాల్లో పోటీ చేయగా.. కనీసం ఒక్క చోట కూడా డిజాజిట్ దక్కలేదు. పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు సొంత ఊరులో కూడా అతి స్వల్పంగా ఓట్లు రావడం ఆ పార్టీ దయనీయ పరిస్థితిని కళ్లకు కడుతోంది. ఒకనాడు ఎర్ర జెండాల రెపరెపలతో కళకళలాడిన ఖమ్మం జిల్లాలో సీపీఎంకు ఇంతటి దారుణమైన ఫలితాలు వస్తాయని ఆ పార్టీ నేతలు కూడా ఊహించి ఉండరనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తమ బలాన్ని అతిగా అంచనా వేసుకుని తమకు సీట్లు ఇవ్వని కాంగ్రెస్‌ను దెబ్బ కొడదామనుకున్నారా? లేక వాస్తవాలు తెలిసినా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన సమయంలో 2014లో జరిగిన ఎన్నికల్లో సీపీఎం, సీపీఐలకు చెరో సీటు దక్కింది. గత సభలో రెండు పార్టీలు ఒక్కో స్థానం కూడా పొందలేకపోయాయి. తాజా ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోటీ చేస్తామని చెప్పినా.. ఆచరణలో అలా జరగలేదు. కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు పెట్టుకోగా.. సీపీఎం ఒంటరిగా పోటీ చేసింది. పాలేరు నుంచి పోటీ చేసిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు కూడా సీపీఎం ఓటర్లు ఝలక్ ఇచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా సీపీఎంకు 18 వేల నుంచి 20 వేల ఓట్లు ఉన్నట్లు చెబుతున్నా.. తమ్మినేని కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. రాష్ట్రంలో సీపీఎం పరిస్థితిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. తమ్మినేని వీరభద్రంకు కేవలం 5వేల 308 ఓట్లు మాత్రమే వచ్చాయి. సొంతూరు తెల్దారపల్లిలో సైతం అతి తక్కువ ఓట్లు రావడంతో తమ్మినేని జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీపీఎంకు అన్ని నియోజకవర్గాల్లో కొంత ఓటు బ్యాంకు ఉంది. పాలేరు, మధిర, వైరా, భద్రాచలం నియోజకవర్గాల్లో సీపీఎంకు ఓట్ బ్యాంక్ ఉంది. ఈ నాలుగు స్థానాల్లోనూ గత ఎన్నికల్లో కంటే ఈసారి చాలా తక్కువ ఓట్లు సీపీఎంకు దక్కాయి. ఈసారి మధిర నియోజకవర్గంలో పోటీ చేసిన సీపీఎం అభ్యర్థికి అత్యధికంగా 6,575 ఓట్లు వచ్చాయి. ఈ ఓట్లు గత ఎన్నికల్లో నాలుగో వంతు మాత్రమే. ఇక అత్యల్పంగా హైదరాబాద్‌లోని ముషీరాబాద్ అభ్యర్థికి 835 మాత్రమే పోలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసిన 19 సీపీఎం అభ్యర్థులకు కలిపినా మొత్తం 50 వేల ఓట్లు కూడా పోలవ్వలేదు. పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్ ప్రతిపాదించినట్లు మిర్యాలగూడెం అసెంబ్లీ సీటుతో పాటు రెండు ఎమ్మెల్సీలకు అంగీకరించి ఉంటే గౌరవంగా ఉండేదన్న అభిప్రాయాలు ఇప్పుడు సీపీఎం నాయకత్వంలో వ్యక్తమవుతున్నట్లు టాక్ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోగా.. కనీసం ఆశించిన స్థాయిలో కూడా ఓట్లు రాకపోవడంతో మండలాల వారీగా సమావేశం ఏర్పాటు చేసి జరిగిన పొరపాట్లను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. లోపం ఎక్కడ జరిగిందో తెలుసుకుని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసుకుని మళ్లీ జిల్లాలో పార్టీని బలోపేతం చేసుకోవాలని సీపీఎం నాయకత్వం భావిస్తోంది. -
బీజేపీలో కొత్త చర్చ.. రాజాసింగ్‌కే మద్దతు?
తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ పక్ష నేతగా ఎవరిని ఎంపిక చేయబోతున్నారు?. గత సభలో ఫ్లోర్ లీడర్‌గా ఉన్న రాజాసింగ్‌నే కంటిన్యూ చేస్తారా?. లేక కొత్తగా ఎన్నికైనవారిలో ఎవరికైనా అప్పగిస్తారా?. తాజాగా అసెంబ్లీకి ఎన్నికైన ఎనిమిది మంది కమలం పార్టీ ఎమ్మెల్యేల్లో అందరికంటే సీనియర్ రాజాసింగ్ మాత్రమే. అందుకే ఇప్పుడీ విషయంపై బీజేపీలోనూ, రాజకీయ వర్గాల్లోనూ చర్చ మొదలైంది. అసలు బీజేపీ నిర్ణయం ఎలా ఉండబోతోంది?.. తెలంగాణ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ తరపున ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని గోషామహల్లో రాజాసింగ్ మూడోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ నియోజకవర్గంలో ఏలేటి మహేశ్వరరెడ్డి రెండోసారి గెలుపొందారు. అయితే, ఏలేటి కొంతకాలం క్రితమే బీజేపీలో చేరారు. ఇక మిగిలిన ఆరుగురు ఎమ్మెల్మేలు మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. వీరిలో ముగ్గురు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి, మరో ముగ్గురు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి గెలుపొందారు. పార్టీలో కీలక పదవుల్లో ఉన్నవారు, సీనియర్లు బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్‌రావు వంటివారంతా ఓడిపోయారు. అసెంబ్లీ కార్యకలాపాల విషయంలో అనుభవం ఉన్నవారు ఇద్దరే ఉండటంతో శాసనసభాపక్ష నేతగా ఎవరిని ఎంపిక చేస్తారనే చర్చ కమలం పార్టీలో జరుగుతోంది. గత అసెంబ్లీలో రాజాసింగ్ ఒక్కరే గెలవడంతో ఆయనే సభాపక్ష నేతగా కొనసాగారు. తర్వాత ఉప ఎన్నికల్లో దుబ్బాక నుంచి రఘునందన్‌రావు, హుజూరాబాద్ నుంచి ఈటల రాజేందర్ గెలుపొందినా ఫ్లోర్ లీడర్‌గా రాజాసింగ్‌నే కొనసాగించారు. రాజాసింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా కూడా ఆ పదవి మరొకరికి ఇవ్వలేదు. ఇప్పుడు మూడోసారి గెలిచిన రాజాసింగ్‌నే మరోసారి పార్టీ ఫ్లోర్ లీడర్‌గా కమలం పార్టీ నాయకత్వం కొనసాగిస్తుందా? లేక మరొకరికి ఆ బాధ్యత అప్పగిస్తుందా అనే టాక్ నడుస్తోంది. రాజాసింగ్ ఇలా.. రాజాసింగ్ తన నియోజకవర్గమైన గోషామహల్‌కే పరిమితం అవుతున్నారు. పైగా ఆయనకు తెలుగు భాషపై కూడా పట్టు లేదు. రాష్ట్ర సమస్యల మీదా అవగాహన లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ, మూడోసారి గెలిచారు గనుక ఆయనకే ఫ్లోర్ లీడర్ బాధ్యత అప్పగించాలని కొందరు పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇక నిర్మల్ ఎమ్మెల్యేగా గెలిచిన మహేశ్వర్ రెడ్డినే ఫ్లోర్ లీడర్‌గా నియమించే అవకాశం ఉందంటూ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం మహేశ్వరరెడ్డికి ఉంది. రాష్ట్రంలోని సమస్యల పట్ల కూడా ఆయనకు అవగాహన ఉంది. కాబట్టి ఆయనకు ఛాన్స్ ఇవ్వవచ్చని అనుకుంటున్నారు. కాటిపల్లికి ఛాన్స్.. కానీ, కామారెడ్డిలో అనూహ్యంగా ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌ను, కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారంలో ఉన్న రేవంత్ రెడ్డిని ఏకకాలంలో ఓడించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డిని బీజేపీ శాసనసభ పక్ష నేతగా చేయాలంటూ ఒక వర్గం డిమాండ్ చేస్తోంది. ఆయనను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకొని రాష్ట్రమంతా తిప్పాలని బీజేపీ శ్రేణులు కోరుతున్నాయి. బెంగాల్లో ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీని ఓడించిన సువేందు అధికారిని బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఎంపిక చేసి ఆయన్ను రాష్ట్రమంతా తిప్పుతున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా కాటిపల్లిని ఫ్లోర్ లీడర్ చేయాలని సూచిస్తున్నారు. కాటిపల్లి సమస్యలపై మాట్లాడగలరని, ఆయనలో పోరాటం చేసే తత్వం ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే, కాటిపల్లి వెంకటరమణారెడ్డి రాష్ట్ర స్థాయి రాజకీయాలకు కొత్త, ఎక్కువగా తన నియోజకవర్గానికి పరిమితమైనటువంటి వ్యక్తి కావడంతో పార్టీ హై కమాండ్ ఏ మేరకు ఆయన వైపు మొగ్గు చూపుతుందనేది సందేహమే అంటున్నారు మరికొందరు నేతలు. ఏదేమైనా అసెంబ్లీలో బీజేపీ నేత ఎవరనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. -
కేసుల్లేని మంత్రులు ముగ్గురే
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కొత్తగా కొలువుతీరిన ప్రభుత్వంలోని 12 మంది అమాత్యుల్లో సీఎం రేవంత్‌రెడ్డి సహా తొమ్మిది మంది మంత్రులపై కలిపి మొత్తం 136 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. ఇటీవల ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎనుముల రేవంత్‌రెడ్డిపై అత్యధికంగా 89 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అందులో తీవ్రమైన క్రిమినల్ కేసులు 50 ఉన్నాయి. ఇక తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదై ఉన్నట్లు ఐదుగురు మంత్రులు ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లలో వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా మంత్రివర్గంలోని ముగ్గురు మంత్రులు దామోదర్ రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావుపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారమ్స్, తెలంగాణ ఎలక్షన్ వాచ్ సంస్థలు వెల్లడించాయి. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి సహా 12 మంది మంత్రుల అఫిడవిట్ల «ఆధారంగా వారి నేరచరిత్ర, ఆస్తులు, అప్పులు తదితర అంశాలపై సమీక్ష చేపట్టిన ఏడీఆర్ సంస్థ శనివారం ఒక నివేదికను విడుదల చేసింది. రేవంత్ తర్వాత ఉత్తమ్, పొన్నం పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి తర్వాతి స్థానంలో 11 కేసులతో రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. ఆయన తర్వాత 7 కేసులతో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, 6 కేసుల చొప్పున ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి దాసరి అనసూయ సీతక్క, 5 కేసుల చొప్పున ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, 3 కేసుల చొప్పున డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఎౖMð్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు. సీతక్క మినహా అందరూ కోటేశ్వరులే మంత్రివర్గంలోని సీఎం సహా మొత్తం 12 మంది మంత్రుల్లో 11 మంది కోటీశ్వరులే ఉన్నారు. ఏడీఆర్ విశ్లేíÙంచిన 12 మంది మంత్రుల ఆస్తుల లెక్క చూస్తే.. రూ.433.93 కోట్ల విలువైన ఆస్తులతో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అత్యధికంగా ఆస్తులు ఉన్న మంత్రిగా అగ్రస్థానంలో నిలిచారు. కాగా 10 మంది మంత్రులు తమకు అప్పులు ఉన్నాయని ప్రకటించగా....అప్పుల జాబితా లోనూ రూ.43.53 కోట్లతో మంత్రి పొంగులేటి టాప్‌లో ఉన్నారు. ఆస్తుల విషయంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తర్వాత రూ.46.66 కోట్లతో దామోదర రాజనర్సింహ, రూ.39.55 కోట్లతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రూ.30.04 కోట్లతో సీఎం రేవంత్‌రెడ్డి ఆ తర్వాత స్థానాల్లో నిలిచారు. అయితే రూ.82.83 లక్షల ఆస్తులతో మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అత్యల్ప ఆస్తులున్న మంత్రిగా ఉన్నారు. -
సీఎం సహా చాలామంది దైవ సాక్షిగా ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన 119 మందిలో శనివారం ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్‌తో కలిసి 101 మంది ప్రమాణం చేశారు. వీరిలో 15 మంది ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేశారు. సభ్యులు లాస్య నందిత, పద్మావతి రెడ్డి, అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, బండారి లక్ష్మారెడ్డి, గడ్డం వినోద్, మధుసూదన్ రెడ్డి, కేపీ వివేకానంద, కాలేరు వెంకటేశ్, కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, తోట లక్ష్మీకాంతారావు, కె. మదన్ మోహన్ రావు, ముఠా గోపాల్, మైనంపల్లి రోహిత్, తెల్లం వెంకట్రావ్, గడ్డం వివేక్ ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఎంఐఎం నుంచి గెలుపొందిన జాఫర్ హుస్సేన్, కౌసర్ మొయినుద్దీన్, జుల్ఫీకర్ అలీ, మహ్మద్ మాజీద్ హుస్సేన్, మహ్మద్ మోబిన్ ఉర్దూలో ప్రమాణం చేశారు. ♦ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి,ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క సహా అధిక సంఖ్యలో సభ్యులు దైవసాక్షిగా ప్రమాణం చేశారు. ♦ మంత్రి సీతక్క, సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు సహా పలువురు సభ్యులు పవిత్ర హృదయం సాక్షిగా ప్రమాణం చేశారు. వారిలో ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్, అరికపూడి గాం«దీ, చిక్కుడు వంశీకృష్ణ, దొంతి మాధవరెడ్డి, గూడం మహిపాల్ రెడ్డి, కె. శంకరయ్య, కసిరెడ్డి నారాయణ రెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ, మాగంటి గోపినాథ్, మక్కాన్‌సింగ్, రేవూరి ప్రకాశ్ రెడ్డి, వాకిటి శ్రీహరి, వేముల వీరేశం ఉన్నారు. ‘‘దేశ సార్వభౌమాధికారాన్ని’’పలకడంలో ఇక్కడా ఇబ్బందే ప్రమాణ స్వీకారంలో భాగంగా ‘సభా నియమాలకు కట్టుబడి ఉంటానని’ చేసే ప్రతిజ్ఞ సందర్భంగా సభ్యులు చాలా మంది ‘సభా నియామకాలకు కట్టుబడిఉంటానని’ చదివారు. ‘భారత దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని...’అనే వాక్యాన్ని పలుకడానికి సహజంగానే చాలా మంది సభ్యులు ఇబ్బంది పడ్డారు. బీఆర్ఎస్ సభ్యులకు సీఎం అభివాదం.. రాజగోపాల్‌రెడ్డికి ఆలింగనం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉదయం 11.05 గంటలకు సభలోకి వచ్చిన వెంటనే డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, లాస్య నందిత , కోవాలక్ష్మి తదితరుల వద్దకు వెళ్లి అభివాదం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబుతో పాటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి వద్దకు వెళ్లి రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా ఆలింగనం చేసుకున్నారు.అనంతరం ఎంఐఎం సభ్యులను ప్రత్యేకంగా వెళ్లి కలిశారు. ♦ ప్రమాణ స్వీకారోత్సవం చూసేందుకు కుటుంబసభ్యులు కూడా సభకు వచ్చారు. ♦ అన్ని పార్టీల శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేసినవెంటనే ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ వద్దకు వెళ్లి అభివాదం చేశారు. అనంతరం కాంగ్రెస్ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్దకు వెళ్లి అభివాదం చేసి, ఫొటోలు దిగారు. ♦ కొత్త ఎమ్మెల్యేలకు అసెంబ్లీ నియమావళి, ఇతర మెటీరియల్‌తో కూడిన కిట్‌ను ప్రమాణం చేసిన ప్రతి ఎమ్మెల్యేకు అందజేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల కుటుంబసభ్యులు కూడా తరలి వచ్చారు. ♦ రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ సింగరేణి కార్మికుడి దుస్తుల్లో అసెంబ్లీకి వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శాసనసభలో మక్కాన్సింగ్నురేవంత్ ప్రత్యేకంగాఅభినందించడం కనిపించింది. ♦ మంత్రి సీతక్క ప్రమాణం చేసిన తరువాత బీఆర్ఎస్ మహిళా సభ్యులు కోవాలక్ష్మి, లాస్య నందిత, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి వద్దకు వెళ్లి కలిశారు. మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి కలవడం కనిపించింది. -
బీజేపీ ఎమ్మెల్యేల అసెంబ్లీ బహిష్కరణ
సాక్షి, హైదరాబాద్: ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని రాష్ట్ర ప్రభుత్వం నియమించడాన్ని తప్పుబడుతూ అసెంబ్లీలో తొలిరోజు జరిగిన సభ్యుల ప్రమాణస్వీకారాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు బహిష్కరించారు. ప్రొటెం స్పీకర్ ఎదుట తాము ప్రమాణం చేయబోమని స్పష్టంచేశారు. శనివారం అసెంబ్లీ గేటు ఎదుట రాజాసింగ్ మినహా మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. అరగంటపాటు రోడ్డుపైనే బైఠాయించి నినాదాలు చేశారు. వారి వద్దకు వచ్చిన అసెంబ్లీ చీఫ్ మార్షల్ సర్దిచెప్పేందుకు ప్రయత్నిం చినా బీజేపీ ఎమ్మెల్యేలు వెనక్కు తగ్గలేదు. అంతకుముందు ఈ అంశంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ఫిర్యాదు చేసేందుకు రాజ్‌భవన్‌కు వారు వెళ్ల గా ఆ సమయానికి గవర్నర్ అందుబాటులో లేరు. దీంతో గవర్నర్ కార్యదర్శి సురేంద్రమోహన్‌కు వినతిపత్రం ఇచ్చి వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం సభా విధానాలు, సంప్రదాయాలను ఉల్లంఘించి సీనియర్ సభ్యులను కాదని అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించడం ఎంతమాత్రం సరికాదని బీజేపీ ఎమ్మెల్యేలు వినతిపత్రంలో పేర్కొన్నారు. కొన్ని వర్గాల ప్రజలను ఆకర్షించేందుకే ప్రభుత్వం పనిగట్టుకొని ఈ నిర్ణయాన్ని తీసుకుందని.. దీన్ని బీజేపీ రాష్ట్రశాఖ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని తెలియజేశారు. ప్రొటెం స్పీకర్ నామినేషన్‌ను తిరస్కరించడంతోపాటు పూర్తిస్థాయి స్పీకర్ ఎన్నికకు సంబంధించిన ప్రక్రియను నిలిపేయాలని సంబంధిత అధికారులను ఆదేశించాలని గవర్నర్‌ను కోరారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డితో ఎమ్మెల్యేలు టి.రాజాసింగ్, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, వెంకట రమణారెడ్డి, రామారావు పటేల్, ధన్పాల్ సూర్యనారాయణ, పాయల్ శంకర్, పాల్వాయి హరీశ్‌బాబు, పైడి రాకేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రమాణ స్వీకారానికి వెళ్లాలా వద్దా అనే విషయమై అధిష్టానం నిర్ణయానికి అనుగుణంగా నడుచుకోవాలని ఎమ్మెల్యేలు నిర్ణయించారు. అంతకుముందు ఈ అంశంపై బీజేఎల్పీ సమావేశంలో వాడీవేడి చర్చ జరిగినట్లు తెలిసింది. పార్టీ అధిష్టానానికి చెప్పకుండానే ఎమ్మెల్యే రాజాసింగ్ ఏకపక్షంగా అసెంబ్లీని బహిష్కరిస్తామని సోషల్ మీడి యా ద్వారా పేర్కొనడాన్ని నేతలు తప్పుబట్టినట్లు తెలియవచ్చింది. ఈ భేటీ అనంతరం కిషన్‌రెడ్డితో కలసి ఏడుగురు ఎమ్మెల్యేలు చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంలో పూజలు నిర్వహించగా రాజాసింగ్ మాత్రం విడిగా బయటకు వెళ్లిపోయారు. ఆలయా నికి కూడా ఆయన వెళ్లలేదు. ఆ తర్వాత ఢిల్లీలోని జాతీయ నాయకత్వాన్ని ఫోన్లో కిషన్‌రెడ్డి సంప్రదించగా ప్రమాణస్వీకారాన్ని బహిష్కరించాలని ఆదేశించడంతో అందుకు అనుగుణంగా ఎమ్మెల్యేలు వ్యవహరించారు. అయితే ఈ నిర్ణయాన్ని రాజాసింగ్‌కు తెలియజేసేందుకు ప్రయత్నిం చగా ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చిందని... అందుకే మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌కు వెళ్లినప్పుడు, అసెంబ్లీ ఎదుట నిరసన తెలిపినప్పుడు ఆయన పాల్గొనలేదని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు స్పీకర్ ఎన్నిక జరిగాక ఆయన ఎదుటే బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారని కిషన్‌రెడ్డి తెలిపారు. -
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దూసుకెళ్తాం
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకాంక్షల మేరకు రాష్ట్రంలో అధికార సాధన దిశగా బీజేపీ దూసుకుపోతుందని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గతంలోని ఒక సీటుతో పోలిస్తే 8 సీట్లలో గెలవడంతోపాటు రెండింతల ఓట్ల శాతాన్ని సాధించిందని తెలిపారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు, నేతలు డా. ఎస్.ప్రకాశ్‌రెడ్డి, టి. ఆచారి, మురళీయాదవ్, నరహరి వేణుగోపాల్‌రెడ్డిలతో కలసి ఈటల మీడియాతో మాట్లాడుతూ ఇతర పార్టీలు డబ్బు సంచులు పంచినా ప్రజలు తమకు ఇంత గొప్ప విజయాన్ని కట్టబెట్టారని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 36 లక్షల ఓట్లు (15 శాతం ఓట్లు) సాధించేలా చేశారన్నారు. అందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఈటల పేర్కొన్నారు. ప్రజలు, కార్యకర్తలు అందించిన విశ్వాసం, నమ్మకంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 2019లో గెలిచిన సీట్ల కంటే రాష్ట్రంలో అధిక స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని చెప్పారు. అలాగే దేశవ్యాప్తంగా బీజేపీ 400 సీట్లలో గెలిచి సత్తా చాటుతుందని ఈటల విశ్వాసం వ్యక్తంచేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం గురించి తనకేమీ తెలియదని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. దీనిపై పార్టీ నాయకత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. కడియం వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: రఘునందన్ బీఆర్ఎస్ 39 సీట్లతోపాటు బీజేపీకి 8, ఎంఐఎంకు 7 సీట్లు కలిస్తే తమ బలం పెరిగి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో టీడీపీలోని ఆయన పాత మిత్రుడైన కడియం శ్రీహరి కలవదలుచుకుంటే తమకేమీ అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. ప్రజలిచ్చిన తీర్పుతో రాష్ట్రంలో బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషించనుందని, ఎంఐఎంతో అంటకాగే పార్టీలతో బీజేపీ ఎలాంటి సంబంధాలు పెట్టుకోదని ఆయన స్పష్టంచేశారు. బీజేపీకి ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని, ఈ ఎన్నికల్లో ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకొని ముందుకు సాగుతామన్నారు. సోషల్ మీడియాలో పోస్టులొద్దు... బీజేపీ నేతలపై సోషల్ మీడియాలో పెడుతున్న అభ్యంతరకర పోస్టులను పార్టీ నాయకత్వం గమనిస్తోందని రఘునందన్‌రావు ఒక ప్రశ్నకు బదులిచ్చారు. వాటిపై సరైన సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తగిన నిర్ణయం తీసుకుంటారన్నారు. అప్పటివరకు అందరూ సంయమనం పాటించాలని, ఓటమి బాధతో సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టొద్దని విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. కార్యకర్తలు నిరుత్సాహానికి గురికావొద్దని, మళ్లీ పూర్తిస్థాయి శక్తితో పుంజుకుంటామన్నారు. -
కొలువుదీరిన మూడో శాసనసభ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ శనివారం కొలువుదీరింది. ఉదయం 11.00 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత సీఎం రేవంత్ రెడ్డి.. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావు ప్రమాణం చేశారు. అనంతరం మహిళా ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేసిన తరువాత అక్షర క్రమంలో సభలోని సభ్యులతో ప్రమాణం చేయించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 61 మంది, బీఆర్ఎస్ నుంచి 32 మంది, ఎంఐఎం నుంచి ఆరుగురు, సీపీఐ నుంచి గెలిచిన ఒక్కరు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీని నియమించడాన్ని నిరసిస్తూ బీజేపీకి చెందిన 8 మంది సభ్యులు సభకు హాజరు కాలేదు. కాలు జారి పడిన కారణంగా శస్త్ర చికిత్స చేయించుకొన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయనకు సహాయకారిగా ఉన్న మాజీ మంత్రి కె. తారక రామారావు సహా ఏడుగురు బీఆర్ఎస్ సభ్యులు, వ్యక్తిగత కారణాలతో ముగ్గురు కాంగ్రెస్ సభ్యులు ప్రమాణస్వీకార కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. ప్రమాణం చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వీరే.. రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, సీతక్క, దామోదర రాజ నర్సింహ, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావు, చిట్టెం పర్ణికా రెడ్డి, మట్టా రాగమయి, పద్మావతి రెడ్డి, యశస్విని రెడ్డి, ఆది శ్రీనివాస్, ఆదినారాయణ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అనిరుధ్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, బాలు నాయక్ నేనావత్, చిక్కుడు వంశీకృష్ణ, చింతకుంట విజయ రమణారావు, దొంతి మాధవరెడ్డి, గడ్డం ప్రసాద్ కుమార్, గడ్డం వినోద్, గండ్ర సత్యనారాయణ రావు, జి. మధుసూదన్‌రెడ్డి, బీర్ల ఐలయ్య, రామ్‌చందర్ నాయక్, కేఆర్ నాగరాజు, కే శంకరయ్య, కసిరెడ్డి నారాయణరెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ, కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కోరం కనకయ్య, కె.రాజేశ్‌రెడ్డి, కుంభం అనిల్‌కుమార్ రెడ్డి, కుందూరు జయవీర్‌రెడ్డి, తోట లక్ష్మీకాంతారావు, కె. మదన్ మోహన్ రావు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, మల్ రెడ్డి రంగారెడ్డి, మందుల సామ్యేల్, మేడిపల్లి సత్యం, తుడి మేఘారెడ్డి, మురళీ నాయక్ భుక్యా, మైనంపల్లి రోహిత్, నాయిని రాజేందర్‌రెడ్డి, పి. సుదర్శన్‌రెడ్డి, పటోళ్ల సంజీవ్ రెడ్డి, పాయం వెంకటేశ్వర్లు, రాందాస్ మాలోత్, రేవూరి ప్రకాశ్ రెడ్డి, రేకులపల్లి భూపతి రెడ్డి, టి. రామ్మోహన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, వెడ్మ బొజ్జు, వేముల వీరేశం, గడ్డం వివేక్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి. బీఆర్ఎస్ నుంచి 32 మంది కోవా లక్ష్మి, లాస్య నందిత, పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, అనిల్ జాదవ్, అరికెపూడి గాంధీ, బండారి లక్ష్మారెడ్డి, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, చింతా ప్రభాకర్, దానం నాగేందర్, దేవిరెడ్డి సు«దీర్ రెడ్డి, గంగుల కమలాకర్, గూడెం మహిపాల్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, కేపీ వివేకానంద, కాలే యాదయ్య, కాలేరు వెంకటేశ్, కల్వకుంట్ల సంజయ్, మాణిక్ రావు, మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, మర్రి రాజశేఖర్ రెడ్డి, ముఠా గోపాల్, వేముల ప్రశాంత్ రెడ్డి, డాక్టర్ సంజయ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, టి. ప్రకాశ్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, తెల్లం వెంకట్రావ్, హరీశ్‌రావు, విజయుడు. ఎంఐఎం నుంచి అందరూ ఎంఐఎం నుంచి అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, జాఫర్ హుస్సేన్, కౌసర్ మెయినుద్దీన్, జుల్ఫీకర్ అలీ, మహ్మద్ మాజీద్ హుస్సేన్, మహ్మద్ మోబిన్ ప్రమాణం చేయగా, ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించిన అక్బరుద్దీన్ ఒవైసీ అంతకు ముందే గవర్నర్ సమక్షంలో ప్రమాణం చేశారు. సీఐపీ నుంచి కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. గైర్హాజరైన సభ్యులు ఎవరంటే కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, కేటీఆర్, కడియం శ్రీహరి, కొత్త ప్రభాకర్ రెడ్డి, పద్మారావు గౌడ్, పాడి కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీజేపీ నుంచి రాజాసింగ్ , ఏలేటి మహేశ్వర్ రెడ్డి, హరీశ్‌బాబు, కె. వెంకట రమణా రెడ్డి, పాయల్ శంకర్, రామారావు పవార్, పైడి రాకేశ్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గైర్హాజరయ్యారు. -
3 రోజుల్లోనే కాంగ్రెస్ రంగు బయటపడింది: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: అధికారానికి వచ్చిన మూడురోజుల్లోనే కాంగ్రెస్ సర్కార్ అసలు రంగు బయటపడిందని కేంద్రమంత్రి, బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మండిపడ్డారు. మజ్లిస్ దోస్తీతో తన పాత అలవాటు ప్రకారం శాసనసభ నియమాలు, విధానాలు, గౌరవాన్ని కాలరాసేందుకు ప్రయత్నించిందన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్‌కు బొటా»ొటీ మెజారిటీ ఉన్నదని, తుమ్మినా, దగ్గినా కూలిపోయే పరిస్థితిలో ప్రభుత్వం కొలువుదీరిందన్నారు. శనివారం పార్టీ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి, రామారావు పటేల్, ధన్పాల్ సూర్యనారాయణ, పాయల్ శంకర్, పాల్వాయి హరీశ్‌బాబు, పైడి రాకేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్రెడ్డితో కలిసి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం ఎక్కడ కూలిపోతుందేమోనని మజ్లిస్మద్దతు కోసం ఆ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి ప్రొటెం స్పీకర్గాఅవకాశం ఇచ్చిందని ఆరోపించారు. శాసనసభలో ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ ఎమ్మెల్యేను నియమించే సంప్రదాయాన్ని కాదని మజ్లిస్‌కు చెందిన వ్యక్తిని నియమించి నియమాలను తుంగలో తొక్కిందని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్, మజ్లిస్‌లు ఒకటేనని తాము ముందు నుంచి చెబుతూ వస్తున్నామన్నారు. రెగ్యులర్స్పీకర్బాధ్యతలు చేపట్టిన తర్వాతనే బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. -
తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ రూపం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తల్లి ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూడలేదని, డిసెంబర్ 7న ఎల్బీ స్డేడియంలో సోనియా గాంధీ వచ్చినప్పుడు తెలంగాణ తల్లి అంటే ఈ రూపంలో ఉంటుందని ప్రజలందరూ భావించారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎల్బీ స్టేడియంలోకి సోనియా గాంధీ ప్రవేశించిన సమయంలో లక్షలాదిమంది తెలంగాణ బిడ్డలు లేచి స్వాగతం పలికారని, ఆ క్షణం ఆమె మొఖంలో కనిపించిన సంతోషం, సంతృప్తి ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. తెలంగాణకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా కాంగ్రెస్ అండగా ఉంటుందని సోనియా ఓ తల్లిలా భరోసా ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ బిడ్డలకు సోనియానే తల్లి అని ఆయన అభివర్ణించారు. శనివారం గాం«దీభవన్‌లో జరిగిన ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో మంత్రులతో కలసి సీఎం ముఖ్యఅతి«థిగా పాల్గొన్నారు. సీనియర్ నేత వి.హనుమంతరావుతో కలసి 78 కిలోల కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల కోసం సోనియా ఆరు గ్యారంటీలను ఇచ్చి మరింత భరోసా కvచారన్నారు. పాలకుడిగా కాకుండా సేవకుడిగా ప్రజలందరి ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత తనదన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల కృషి వల్లే తాము పదవుల్లో కూర్చున్నామని చెప్పారు. పదేళ్లు కార్యకర్తలు వేల కేసులు ఎదుర్కొన్నారని.. కార్యకర్తలకు మాట ఇస్తున్నానని.. ఈ ప్రభుత్వం కార్యకర్తలదేనని ప్రకటించారు. సీఎంకు సేవాదళ్ గౌరవ వందనం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రకటన వచ్చిన డిసెంబర్ 9 చరిత్రాత్మకమైన రోజని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నా రు. కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్ చార్జి మాణిక్ రావు ఠాక్రే, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీత క్క, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహే‹శ్ కుమార్ గౌడ్, మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు, పీసీసీ నేతలు తదితరులు పాల్గొన్నారు. సీఎం హోదాలో గాందీభవన్‌కు వచ్చి న రేవంత్ సేవాదళ్ కార్యకర్తల గౌరవ వందనం స్వీకరించారు. -
‘రైతుబంధు’ ఇంకా ఇవ్వలేదేం?
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి రాగానే రైతుబంధును పెంచిన డబ్బు (ఎకరాకు రూ. 5 వేల బదులు రూ. 7,500)తో రైతుల ఖాతాల్లో వేస్తామన్న మాటేమైందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో డిసెంబర్ 9న రైతుబంధు సొమ్మును రైతుల ఖాతాల్లో వేస్తామని చెప్పారని, ఇచ్చిన మాటపై రైతులకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్లో విలేకరులతో హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రభు త్వంపై విమర్శలు చేయట్లేదని... దీనిపై ప్రజలు, రైతులపక్షాన ప్రభుత్వాన్ని అడుగుదామని వచ్చామన్నారు. ఎకరాకు ఏటా రూ. 15 వేలు అంటే.. యాసంగి పంటకు ఎకరానికి రూ. 7,500 చొప్పున ఇవ్వాలన్నారు. యాసంగి పంట పనులు ప్రారంభమయ్యాయని, రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతుబంధు ఎప్పటి నుంచి వేస్తారో రైతులకు చెప్పా లని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం యాసంగి పంటకు నవంబర్ చివరివారం లేదా డిసెంబర్ మొదటి వారంలో రైతుబంధు డబ్బు వేసేవాళ్లమని గుర్తు చేశారు. ప్రమాణస్వీకారం చేసిన ఎమ్మెల్యేలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. బోనస్‌తో పంటను కొనాలి.. రైతాంగం అంతా ప్రభుత్వం పంట ఎప్పుడు కొంటుందోనని ఎదురు చూస్తోందని హరీశ్‌రావు తెలిపారు. కాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రచారంలో రైతులను వడ్లు అమ్ముకోవద్దని చెప్పారని... అధికారంలో రాగానే రూ. 500 బోనస్‌తో వడ్లు కొంటామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. పంట మొత్తం కల్లాల్లో ఉందని, రైతులంతా కళ్లలో వత్తులేసుకొని ఎదురుచూస్తున్నారని, ఒకవైపు తుపాను ప్రభావంతో కొన్ని చోట్ల వడ్లు తడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘రూ. 500 బోనస్ ఎప్పుడు ఇస్తారు? వడ్లు ఎప్పటి నుంచి కొంటారు’అని హరీశ్ ప్రశ్నించారు. -
‘గ్యారంటీల’ భారమంతా మనపైనే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఆరు గ్యారంటీల విజయం ఆర్థిక శాఖపై ఆధారపడి ఉందని డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఆదాయం పెంచుకోవడం ద్వారానే వాటి అమలు సక్రమంగా సాగుతుందని స్పష్టం చేశారు. సచివాలయంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ఆ శాఖ మంత్రిగా శనివారం తొలి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రం రూ. 5.5 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నప్పటికీ ఈ శాఖను గాడిన పెట్టగలననే నమ్మకంతోనే ఈ బాధ్యతలు స్వీకరించినట్లు భట్టి అధికారులకు తెలియజేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఆదాయవ్యయాలు, అప్పుల గురించి ఈ సందర్భంగా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వివరించారు. రాష్ట్ర ఆర్థిక పురోగతిని కలసికట్టుగా సాధిద్దాం.. సంపద సృష్టించడం, సృష్టించిన సంపదను ప్రజలకు పంచడం కోసం ఆర్థిక శాఖ అధికారులు ఆదాయ వనరుల అన్వే షణ కోసం తమ మేధస్సును ఉపయోగించాలని భట్టి వారికి సూచించారు. ప్రభుత్వ విజయం ఆర్థిక శాఖపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు, అభయ హస్తం మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను నెరవేర్చడానికి ఆదాయాన్ని పెంచుకోవడం కోసం అధికారులు పనిచేయాలని కోరారు. ఉద్యోగస్తుల్లా కాకుండా ఈ రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తున్నామన్న ఆలోచనతో విధులు నిర్వర్తించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయని.. తద్వారా ప్రభుత్వ విజయానికి దోహదపడిన వారు అవుతారన్నారు. అనేక సవాళ్లను అధిగమిస్తూ రాష్ట్ర ఆర్థిక పురోగతిని కలసికట్టుగా సాధిద్దామని పిలుపునిచ్చారు. రెండ్రోజుల్లోనే రెండు గ్యారంటీల అమలు మా చిత్తశుద్ధికి నిదర్శనం.. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారంటీలను తమ ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే అమలు చేయడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని భట్టి పేర్కొన్నారు. మహిళా సాధికారతకు తొలి అడుగుగా మహాలక్ష్మి పథకం ప్రారంభించి అందులో భాగంగా రాష్ట్రంలోని మహిళలందరికీ తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామని, ఆరోగ్య తెలంగాణగా ఈ రాష్ట్రం ఉండాలనే ప్రజలకు మెరుగైన కార్పొరేట్ వైద్య సేవలు అందించేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని రూ. 10 లక్షలకు పెంచి నేటి నుంచి అమలు చేస్తున్నామని వివరించారు. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణారావు, సెక్రటరీ టి.కె. శ్రీదేవి, జాయింట్ సెక్రటరీలు కృష్ణ భాస్కర్, కె. హరిత, అడిషనల్ సెక్రటరీ ఆర్. రవి, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇవి ఉచితాలు కాదు.. మానవవనరులపై వ్యయం ప్రతిపక్షంలో ఉండగా తాను చేపట్టిన పాదయాత్ర సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు చెప్పుకున్న బాధలు విన్నాక తెచ్చుకున్న తెలంగాణకు అర్థం లేదని భావించానని భట్టి పేర్కొన్నారు. ప్రజాసమస్యలను పరిష్కరించడానికి ఆరు గ్యారంటీలు, అభయహస్తం మేనిఫెస్టోలో హామీలను ప్రకటించామన్నారు. ఇళ్లు లేక కొందరు, కొలువులు లేక నిరుద్యోగులు, ఉన్నత చదువులు చదివించలేక విద్యార్థుల తల్లిదండ్రులు, కొలువులు రాక పెళ్లిళ్లలో కేటరింగ్ సప్లయర్స్‌గా వెళ్లి పనిచేస్తున్న యువత దుస్థితిని పాదయాత్రలో చూశా నని ఈ సందర్భంగా భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ప్రజలకు ఉచితంగా ఇవ్వడం లేదని మానవవనరులపై వ్యయంగా చేస్తున్నట్లు భావించాలని ఆయన సూచించారు. మానవ వనరులు పెరిగితే అందుకు అనుగుణంగా ఆదాయాలు పెంచే అవకాశం ఉంటుందన్నారు. -
గ్యారంటీగా అమలు చేస్తాం
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని 2004లో కరీంనగర్ గడ్డ మీద సోనియాగాంధీ మాట ఇచ్చారు. ఆ మాట మీద నిలబడి 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించారు. నాది తెలంగాణ అని గర్వంగా చెప్పుకొనే అవకాశం కల్పించారు. ఆ స్ఫూర్తి, ఆలోచనతోనే ఈ ఏడాది సెప్టెంబర్ 17న తుక్కుగూడ సభలో ఆరు గ్యారంటీల పేరుతో రాష్ట్ర ప్రజలకు హామీలు ఇచ్చారు. ఆ ఆరు గ్యారంటీల్లో రెండింటిని సోనియా జన్మదినం సందర్భంగా శనివారం నుంచి అమల్లోకి తెస్తున్నాం. తెలంగాణ ఇచ్చినట్టుగానే ఆరు గ్యారంటీలనూ అమలు చేస్తాం..’’అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. శనివారం శాసనసభలో కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం.. అసెంబ్లీ ప్రాంగణంలోనే చేయూత, మహాలక్ష్మి పథకాలకు పచ్చజెండా ఊపారు. ‘చేయూత’పథకం కింద రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధి రూ.10 లక్షలకు పెంపు, ‘మహాలక్ష్మి’పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ, ఇతర మంత్రులు, శాసనసభ్యులతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. తాము ఇచ్చిన ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో నిక్కచ్చిగా అమలు చేస్తామని చెప్పారు. తెలంగాణను సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. డిసెంబర్ 9 తెలంగాణకు పండుగ రోజు అని వ్యాఖ్యానించారు. లోగో ఆవిష్కరించి.. జెండా ఊపి.. ‘చేయూత’పథకంలో భాగంగా రాష్ట్రంలోని పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య చికిత్సల పరిమితిని రూ.10 లక్షలకు పెంచుతూ లోగో, పోస్టర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. తర్వాత మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్కలతోపాటు మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రేలతో కలసి మహిళల ఉచిత ప్రయాణ బస్సును జెండా ఊపి ప్రారంభించారు. ఉచిత టికెట్‌ను ఆవిష్కరించారు. ఉప్పల్ డిపోకు చెందిన టీఎస్08జెడ్ 0143 నంబర్ బస్సులో మహిళా ప్రయాణికులతో కలసి లోయర్ ట్యాంక్‌బండ్ ప్రాంతంలోని అంబేడ్కర్ విగ్రహం వరకు ప్రయాణించారు. ఈ బస్సులో సీఎంతోపాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, సీఎస్ శాంతికుమారి, మహిళా ఐఏఎస్ అధికారులు వాణీప్రసాద్, టీకే శ్రీదేవి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, మహిళా ఎమ్మెల్యేలు పర్ణికారెడ్డి, యశస్వినిరెడ్డి, ఎమ్మెల్యేల బంధువులు ప్రయాణించారు. ఈ సందర్భంగా తొలి ఉచిత టికెట్‌ను తెలంగాణకు చెందిన ప్రఖ్యాత బాక్సర్ నిఖత్ జరీన్‌కు రేవంత్‌రెడ్డి అందజేశారు. ఈ బస్సుతోపాటు ఏర్పాటు చేసిన మరో రెండు బస్సుల్లో జీహెచ్ఎంసీ కార్మికులు, విద్యార్థినులు ప్రయాణించారు. ఈ కార్యక్రమంతో రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఆర్టీసీ ప్రారంభించింది. అంబేడ్కర్‌కు ఘనంగా నివాళి అర్పించి.. అసెంబ్లీ నుంచి బస్సులో ట్యాంక్‌బండ్ వరకు వెళ్లిన సీఎం రేవంత్, మంత్రులు, అధికారులు.. అక్కడ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తర్వాత సీఎం సహా అందరూ అదే ఆర్టీసీ బస్సులో తిరిగి వెళ్లారు. ఈ సందర్భంగా రేవంత్ బస్సులో నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ఉండగా.. మంత్రి సీతక్క, కొండా సురేఖ ఇద్దరూ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నేటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అంటూ పోస్టర్లను ప్రదర్శించారు. ‘మహాలక్ష్మి’తో మరింత సంతోషం: రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ కొత్త ప్రభుత్వంలో తనకు రవాణాశాఖ దక్కడం సంతోషంగా ఉందని.. తనకు ఆ శాఖను కేటాయించిన తొలిరోజే ఆర్టీసీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే పథకాన్ని ప్రారంభించటం మరింత సంతోషాన్ని కలిగించిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ‘‘ఇది గొప్ప పథకం, మహిళలకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. దీన్ని అంతా కలసి విజయవంతం చేయాలి. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వెసులుబాటు ఉందన్న ఉద్దేశంతో.. అంతగా అవసరం లేకున్నా బస్సుల్లో ప్రయాణిస్తూ ఉంటే తోటివారికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకే అవసరమున్న మహిళలు దీన్ని వినియోగించుకోవాలని కోరుతున్నా. ఓ రెండు వారాలు దీన్ని సమీక్షిస్తూ తదనుగుణంగా చర్యలు తీసుకుంటాం. నేను కొత్త మంత్రిని అయినందున శాఖపై పూర్తి అవగాహన రావాల్సి ఉంది. త్వరలోనే కార్యాచరణ ప్రారంభిస్తాను’’అని పొన్నం ప్రభాకర్ చెప్పారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో పేదలకు వైద్యం రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రారంభించిన ‘చేయూత’పథకం ద్వారా రాష్ట్రంలోని పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించనున్నారు. ఈ పథకంలో భాగంగా నిరుపేదలకు ఆరోగ్య భద్రతను కల్పించే రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఒక్కో కుటుంబానికి ఏటా రూ.10 లక్షల వరకు ఉచితంగా వైద్య సాయం అందుతుంది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 90.10 లక్షల కుటుంబాలు ఈ పథకం కింద లబ్ధి పొందుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వైద్యపరంగా మొత్తం 1,672 ప్యాకేజీలు అమలుకావడంతోపాటు 21 స్పెషాలిటీ సేవలు అందుతాయని వెల్లడించాయి. -
బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన ఆ పార్టీ ఎమ్మెల్యేలు శనివారం ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్లో భేటీ అయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్, ఆయనకు తోడుగా ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఈ సమావేశానికి హాజరు కాలేదు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి హరీశ్‌రావు, పార్టీ పార్లమెంటరీ నేత కే.కేశవరావు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. పార్టీ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ పేరును పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రతిపాదించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ ప్రతిపాదనను బలపరిచారు. పార్టీ తరపున ఎన్నికైన శాసనసభ్యులు ఈ ప్రతిపాదనను బలపరుస్తూ చప్పట్లు కొట్టడంతో కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. శాసనసభా పక్ష డిప్యూటీ లీడర్ నియామకం ఎంపిక బాధ్యతను కేసీఆర్‌కు అప్పగిస్తూ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సమావేశాన్ని హరీశ్‌రావు సమన్వయం చేశారు. సమావేశం ముగిశాక ఎమ్మెల్యేలు ప్రత్యేక బస్సులో అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులో తెలంగాణ అమరుల స్తూపం వద్ద నివాళి అర్పించిన తర్వాత అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. -
మంచి శాఖలు కేటాయించారు, ప్రజలకు సేవచేస్తా..
సాక్షి, హైదరాబాద్/కాచిగూడ: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖలను తనకు కేటాయించడంపట్ల మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) సంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో సీతక్క మాట్లాడుతూ.. తనకు మంచి శాఖలను కేటాయించారని, గ్రామస్థాయిలో ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని చెప్పారు. సర్పంచ్ల సమస్యలపై దృష్టి సారిస్తామని తెలిపారు. తండాలను పంచాయతీలుగా చేసినా వాటి అభివృద్ధికి గత ప్రభుత్వం నిధులు కేటాయించలేదని, అడవి బిడ్డగా గిరిజన, ఆదివాసీ తెగలకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానన్నారు. కాగా, మంత్రి సీతక్కను జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో పలువురు బీసీ నేతలు శనివారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. బీసీల సమస్యలు పరిష్కరించేలా చొరవ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు, సీనియర్ కాంగ్రెస్ నేత నీరడి భూపేష్ సాగర్, నీలం వెంకటేష్, వేముల రామకృష్ణ, నిఖిల్ పాల్గొన్నారు. -
రెండు చోట్లా ఓటమి.. మున్ముందు మరింత కఠిన పరీక్ష తప్పదా?
ఎప్పుడు ఎన్నిక జరిగినా అక్కడ ఆయనదే గెలుపు. నియోజకవర్గం మారినా ఇప్పటికి ఏడుసార్లు వరుసగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2021 ఉప ఎన్నికలో ఓడిపోతారనే ప్రచారం సాగింది. గులాబీ బాస్‌ను ధిక్కరించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నిక తెప్పించారు. పార్టీ మారారు. కాని కారు దెబ్బకు ఢీలా పడతారని అందరూ భావించారు. అయితే అర్జునుడిలా పద్మవ్యూహాన్ని ఛేదించి విజయుడిగా నిలిచారు. తాజా ఎన్నికల్లో మాత్రం అభిమన్యుడిలా ఓడిపోయారు. ఇంతకీ ఆయన ఎవరో? ఆయన కథేంటో చూద్దాం. ఈటల రాజేందర్.. తెలంగాణా రాష్ట్ర రాజకీయాల్లో అందరికీ పరిచయమైన పేరు. అప్పటి సీఎం కేసీఆర్ ను ఎదిరించి గులాబీ పార్టీ నుంచి బయటకు వచ్చినా..తన పంథాకు భిన్నమైన కమలం పార్టీ నీడకు చేరారు. ఆ పార్టీలో చేరాక తన సొంత జిల్లాకు చెందిన నాటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన బండి సంజయ్ తో పొసగకున్నా...తాజా ఎన్నికల్లో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూరాబాద్ తో పాటు.. సవాల్ విసిరి మరీ గజ్వేల్ లో కేసీఆర్ పై బరిలోకి దిగి, రెండు స్థానాల్లోనూ ఓటమిపాలయ్యారు. అటు కమలాపూర్ నియోజకవర్గం నుంచి..ఇటు హుజూరాబాద్ నుంచి వరుసగా ఏడుసార్లు గెలిచిన విజేతగా తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. బీఆర్ఎస్ ను వీడి బయటకు వచ్చాక జరిగిన 2021 ఉపఎన్నిక యావత్ దేశం దృష్టినీ ఆకర్షించింది. అప్పుడు ఈటలపై అధికార బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఫోకస్ చేసింది. ఈటల ఓటమి కోసం గులాబీ పార్టీ సర్వశక్తులూ ఒడ్డింది. నాటి ఉపఎన్నికలో అభిమన్యుడిని చుట్టుముట్టినట్టు చుట్టుముట్టింది. కానీ, ఈటల మాత్రం తన ఏడో విజయాన్నందుకున్నారు. దాంతో ఈటల క్రేజ్ కమలం పార్టీలో మరింతగా పెరిగింది. రోజులెప్పుడూ ఒకేలా ఉండవు. ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి. అదే పరిస్థితి ఈటల విషయంలో ఎనిమిదో ఎన్నికలో జరిగింది. ఇంతకాలం ఎదురులేని మనిషిగా నిల్చిన ఈటల.. తాజా ఎన్నికల్లో తనపైన ఎవ్వరూ అంత ఫోకస్ చేయకపోయినా తాను నమ్ముకున్న హుజూరాబాద్ లో ఓటమి పాలయ్యారు. అక్కడి ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. 2018 ఎన్నికల్లో ఈటలపై కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగి ఓటమిపాలైన కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ అభ్యర్థిగా.. ఈసారి ఎన్నికల్లో గెలిపించి పట్టం కట్టారు. ఈటలను ఓడగొడుతానని సవాల్ విసిరిన కౌశిక్‌కు.. సెంటిమెంట్ రాజకీయాలు కూడా ఈసారి కలిసివచ్చాయనే టాక్ ఎలాగూ ఉంది. అటు గజ్వేల్ లో తొడగొట్టి గులాబీ పార్టీ బాస్ కేసీఆర్‌ను ఓడగొట్టేందుకు వెళ్లి అక్కడా ఈటల భంగపడ్డారు. తాను ప్రచారంలో లేని లోటును పూడ్చేందుకు హుజూరాబాద్‌లో తన సతీమణి జమునను ప్రచారంలోకి దింపారు. రెండు నియోజకవర్గాల్లోనూ ఈటలకు ఓటమి తప్పలేదు. ఈటల వచ్చాక బీజేపీలో జరుగుతున్న మార్పులపై ఓ పెద్ద చర్చే జరుగుతున్న క్రమంలో...బీజేపీని అంటిపెట్టుకుని ఉన్న సంప్రదాయవాదుల్లో కొంత వ్యతిరేకత కూడా అంతర్లీనంగా కనిపిస్తున్న నేపథ్యంలో.. ఇప్పుడు ఈటల గెలిస్తే ఆయనకు కొంత ప్లస్సయ్యేది. కానీ అలా జరగలేదు. ఇప్పుడు ఈటల రీగెయిన్ కావడానికి తన శైలిని కొంచెం మార్చుకోవాల్సి ఉందని.. ఆచితూచి అడుగులు వేస్తేనే రాజకీయాల్లో ఇప్పటివరకూ తనకున్న ప్రత్యేకతను కాపాడుకోగలుగుతారనే వాదన వినిపిస్తోంది. కేసీఆర్ చెంతనే ఎక్కువ కాలం రాజకీయాలు చేసిన ఈటల రాజేందర్లో కొంతమేర ఉన్న అహంకార పోకడలు ఆయనకు మైనస్‌గా మారాయనే వారూ ఉన్నారు. గతంలో హుజూరాబాద్ లోనే ఉంటూ హైదరాబాద్ మంత్రిగా కాకుండా.. హుజూరాబాద్ మంత్రిగా పేరు పడ్డ ఈటల.. ఈమధ్య హుజూరాబాద్‌కు దూరమవ్వడం కూడా ఆయనలో వస్తున్న తేడాను ఇక్కడి ఓటర్లు పసిగట్టారనే టాక్ కూడా నడుస్తోంది. ఇక హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రతిపక్షంలో ఉన్న ఈటల చేసేదెంత?.. అధికారపక్షంలో ఉన్నవారైతే అయ్యే అభివృద్ధి ఎంత అనే లెక్కలతో పాటు...ఉపఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ కు ఈసారి పెద్దఎత్తున ఓట్లు పోలవ్వడం..కౌశిక్ రెడ్డిపై వెల్లువెత్తిన సానుభూతి కూడా కలిసి.. ఈటల ఓటమికి ఆయన నమ్ముకున్న హుజూరాబాద్‌లోనే బీజం పడింది. రెండు నియోజకవర్గాల్లో ఓటమి ఈటల రాజకీయ జీవితాన్ని కొంత సంక్షోభంలోకి నెట్టింది. అంతేకాదు కాంగ్రెస్ అభ్యర్థిగా వొడితెల ప్రణవ్ లీడర్‌గా ఎదుగుతున్న క్రమంలో.. ఇప్పటికే విజయంతో ఊపుమీదున్న కౌశిక్ రెడ్డితో.. మున్ముందు ఫైట్ కూడా ఈటలకు మరింత టఫ్‌గానే ఉంటుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. చదవండి: AP: కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే.. జరిగేది ఇదేనా?