బీజేపీ ఎమ్మెల్యేల అసెంబ్లీ బహిష్కరణ | Assembly boycott of BJP MLAs | Sakshi
Sakshi News home page

బీజేపీ ఎమ్మెల్యేల అసెంబ్లీ బహిష్కరణ

Dec 10 2023 5:02 AM | Updated on Dec 10 2023 5:51 AM

Assembly boycott of BJP MLAs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీని రాష్ట్ర ప్రభుత్వం నియమించడాన్ని తప్పుబడుతూ అసెంబ్లీలో తొలిరోజు జరిగిన సభ్యుల ప్రమాణస్వీకారాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు బహిష్కరించారు. ప్రొటెం స్పీకర్‌ ఎదుట తాము ప్రమాణం చేయబోమని స్పష్టంచేశారు. శనివారం అసెంబ్లీ గేటు ఎదుట రాజాసింగ్‌ మినహా మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. అరగంటపాటు రోడ్డుపైనే బైఠాయించి నినాదాలు చేశారు. వారి వద్దకు వచ్చిన అసెంబ్లీ చీఫ్‌ మార్షల్‌ సర్దిచెప్పేందుకు ప్రయత్నిం చినా బీజేపీ ఎమ్మెల్యేలు వెనక్కు తగ్గలేదు.

అంతకుముందు ఈ అంశంపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు ఫిర్యాదు చేసేందుకు రాజ్‌భవన్‌కు వారు వెళ్ల గా ఆ సమయానికి గవర్నర్‌ అందుబాటులో లేరు. దీంతో గవర్నర్‌ కార్యదర్శి సురేంద్రమోహన్‌కు వినతిపత్రం ఇచ్చి వచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం సభా విధానాలు, సంప్రదాయాలను ఉల్లంఘించి సీనియర్‌ సభ్యులను కాదని అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించడం ఎంతమాత్రం సరికాదని బీజేపీ ఎమ్మెల్యేలు వినతిపత్రంలో పేర్కొన్నారు.

కొన్ని వర్గాల ప్రజలను ఆకర్షించేందుకే ప్రభుత్వం పనిగట్టుకొని ఈ నిర్ణయాన్ని తీసుకుందని.. దీన్ని బీజేపీ రాష్ట్రశాఖ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని తెలియజేశారు. ప్రొటెం స్పీకర్‌ నామినేషన్‌ను తిరస్కరించడంతోపాటు పూర్తిస్థాయి స్పీకర్‌ ఎన్నికకు సంబంధించిన ప్రక్రియను నిలిపేయాలని సంబంధిత అధికారులను ఆదేశించాలని గవర్నర్‌ను కోరారు. 

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డితో ఎమ్మెల్యేలు టి.రాజాసింగ్, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, వెంకట రమణారెడ్డి, రామారావు పటేల్, ధన్‌పాల్‌ సూర్యనారాయణ, పాయల్‌ శంకర్, పాల్వాయి హరీశ్‌బాబు, పైడి రాకేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్‌ రెడ్డి సమావేశమయ్యారు. ప్రమాణ స్వీకారానికి వెళ్లాలా వద్దా అనే విషయమై అధిష్టానం నిర్ణయానికి అనుగుణంగా నడుచుకోవాలని ఎమ్మెల్యేలు నిర్ణయించారు. అంతకుముందు ఈ అంశంపై బీజేఎల్పీ సమావేశంలో వాడీవేడి చర్చ జరిగినట్లు తెలిసింది.

పార్టీ అధిష్టానానికి చెప్పకుండానే ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఏకపక్షంగా అసెంబ్లీని బహిష్కరిస్తామని సోషల్‌ మీడి యా ద్వారా పేర్కొనడాన్ని నేతలు తప్పుబట్టినట్లు తెలియవచ్చింది. ఈ భేటీ అనంతరం కిషన్‌రెడ్డితో కలసి ఏడుగురు ఎమ్మెల్యేలు చార్మినార్‌ భాగ్యలక్ష్మీ ఆలయంలో పూజలు నిర్వహించగా రాజాసింగ్‌ మాత్రం విడిగా బయటకు వెళ్లిపోయారు. ఆలయా నికి కూడా ఆయన వెళ్లలేదు.

ఆ తర్వాత ఢిల్లీలోని జాతీయ నాయకత్వాన్ని ఫోన్లో కిషన్‌రెడ్డి సంప్రదించగా ప్రమాణస్వీకారాన్ని బహిష్కరించాలని ఆదేశించడంతో అందుకు అనుగుణంగా ఎమ్మెల్యేలు వ్యవహరించారు. అయితే ఈ నిర్ణయాన్ని రాజాసింగ్‌కు తెలియజేసేందుకు ప్రయత్నిం చగా ఆయన ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వచ్చిందని... అందుకే మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌కు వెళ్లినప్పుడు, అసెంబ్లీ ఎదుట నిరసన తెలిపినప్పుడు ఆయన పాల్గొనలేదని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు స్పీకర్‌ ఎన్నిక జరిగాక ఆయన ఎదుటే బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారని కిషన్‌రెడ్డి తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement