ఆ రహదారిని ఆరు వరుసలకు విస్తరిస్తాం

Komatireddy Venkat Reddy assumes charge in Secretariat - Sakshi

హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

సచివాలయంలో బాధ్యతల స్వీకరణ

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిని త్వరలోనే ఆరు వరుస­లుగా విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామ­­­ని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌­రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టును రెండేళ్లలోపు పూ­ర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ ప్రా­జె­క్టు పూర్తయితే విజయవాడకు అతి తక్కువ సమయంలోనే చేరుకునే అవకాశముందని కోమటిరెడ్డి వె­ల్లడించారు.

తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీ­నామా చేసేందుకు ఢిల్లీకి వెళ్తున్న నేపథ్యంలో, కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీతో భేటీ అయి పెండింగ్‌లో ఉన్న 14 జాతీయ రహదారుల ప్రతిపాదనల­పై చర్చించనున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఆదివారం ఆయన సచివాలయంలోని తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించా­రు.

అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వారంలో మూడు రోజులు సచివాలయంలో, మూడు రోజులు జిల్లా పర్యటనలో ఉంటానన్నారు. రాష్ట్రంలోని రోడ్లను మెరుగుపరిచి దేశంలోనే ఒక మోడల్‌ రాష్ట్రంగా అభివృద్ధి చేయనున్నట్టు వెల్లడించారు. 

నాలుగు వరుసలకు విస్తరిస్తాం
నల్గొండ నుంచి ముషంపల్లి మీదుగా ధర్మాపురం వరకు సింగిల్‌ రోడ్డుగా ఉండి ఎన్నో ప్రమాదాలకు కారణమవుతున్న రోడ్డును రూ.100 కోట్లతో నాలుగు వరుసలకు విస్తరిస్తామని కోమటిరెడ్డి వెల్లడించారు. కొడంగల్‌ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే లింగంపల్లి– దుగ్యాల రోడ్డును రూ.4.15 కోట్లతో మెరుగుపరుస్తామన్నారు.

వారం రోజులు కూడా కాకముందే తమ ప్రభుత్వం రైతుబంధు నిధులు ఇవ్వటం లేదని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించటం విడ్డూరంగా ఉందన్నారు. కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీనివాసరాజు, ప్రత్యేక కార్యదర్శి విజేంద్రబోయి, ఈఎన్‌సీలు గణపతిరెడ్డి, రవీందర్‌రావు, న్యాక్‌ డీజీ భిక్షపతి, ఈఈ శశిధర్‌తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.  

కేసీఆర్‌ను పరామర్శించిన మంత్రి 
 సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోమటిరెడ్డి ఆదివారం పరామర్శించారు. అనంతరం అక్కడే ఉన్న కేసీఆర్‌ కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత, హరీశ్‌రావును కలిసి కేసీఆర్‌ ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top