ఢిల్లీ పీఠంపై కోటి ఆశలు | delhi assembly elections bjp hopes | Sakshi
Sakshi News home page

ఢిల్లీ పీఠంపై కోటి ఆశలు

Dec 25 2014 12:10 AM | Updated on Mar 29 2019 9:31 PM

జార్ఖండ్, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఢిల్లీ బీజేపీ నేతలను ఉత్సాహపరిచాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభావం

న్యూఢిల్లీ :  జార్ఖండ్, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఢిల్లీ బీజేపీ నేతలను ఉత్సాహపరిచాయి. ఈ రెండు రాష్ట్రాల్లో  ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభావం పనిచేసింది. ఇదే విధంగా తాము ఢిల్లీ పీటాన్ని దక్కించుకొంటామనే నమ్మకం పార్టీ నాయకత్వంలో బలపడింది. మాజీ ప్రధానమంత్రి  అటల్ బిహారీ వాజ్‌పేయి జన్మదినం ఘనంగా జరుపుకొని, అదే సందర్భంగా నిర్వహిస్తున్న ‘సుపరిపాలన దినోత్సవం’ రోజు ఎన్నికల ప్రచారాన్ని రెట్టించిన ఉత్సాహంతో చేపట్టనున్నట్లు పార్టీ బీజేపీ నేతలు చెబుతున్నారు. హరియాణా, మహారాష్ట్రల తరువాత జార్ఖండ్ లో సాధించిన విజయం జమ్మూకశ్మీర్‌లో మునుపెన్నడూ లేనంత  భారీ సంఖ్యలో సీట్లుగెలిచి ప్రభుత్వం ఏర్పాటుకు  సంసిద్ధం కావడంతో ఢిల్లీలోనూ పార్టీకి గెలుపుఖాయనమన్న అభిప్రాయం కార్యకర్తల్లో బలపడింది. ఇదే ఉత్సాహంతో ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి పార్టీ శ్రేణులు ముందుకు సాగుతున్నాయి.
 
 చలో మోదీకే సాత్
 అభివృద్ధి, చలో మోదీకే సాథ్ నినాదాలతో  రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో  ఢిల్లీ వాసులను ఆకట్టుకోగలమని  నేతలు భావిస్తున్నారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చుట్టూ రూపొందించిన ప్రచారాన్ని రేడియో జింగిల్స్, రోడ్డుపక్క పోస్టర్లు, హోర్డింగులతో ఇప్పటికే   ప్రారంభించింది. ప్రతి కాలనీలో చిన్నచిన్న జనసభలు జరిపేందుకు వ్యూహం రూపొందించారు. మోదీ ప్రభుత్వం  సాధించిన విజయాలను ఈ జనసభలలో నొక్కి చెబుతారు. పెట్రోలు, డీజిల్ , పళ్లు కూరగాయల ధరలు తగ్గడం మొదలైన వాటిని తన  ప్రచారంలో వినియోగించుకోనుంది.  
 
 కేజ్రీవాల్ వైఫల్యాలే ప్రచారాస్త్రాలు
 రాన్ను అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని తన ప్రధాన ప్రత్యర్థిగా గుర్తించిన బీజేపీ ఆ పార్టీని ఎదుర్కొనేందు తన ప్రచార వ్యూహాన్ని  వ్యూహాన్ని రూపొందించింది.  ఆమ్ ఆద్మీ పార్టీకన్నా, ఆ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ తమకు ప్రధాన శత్రువు అన్న విషయాన్ని బైటకు చెప్పక పోయినప్పటికీ అందుకు అనుగుణంగా వ్యూహరచన చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి ఓటు వేయడానికి ఢిల్లీవాసులు సుముఖంగా ఉన్నప్పటికీ  ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేజ్రీవాల్‌నే ఇ్టపడుతున్నారని సర్వేలు వెల్లడించిన విషయంపై తీవ్రంగా ఆలోచిస్తోంది. అందుకే కేజ్రీవాల్‌పై నేరుగా దాడి చేసేలా ఎన్నికల ప్రచార వ్యూహాన్ని రూపొందించింది. 49 రోజుల తరువాత అధికారాన్ని వదిలి పలాయనం చిత్తగించిన నేతగా  కేజ్రీవాల్ వైఫల్యాన్ని ఎత్తిచూపడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. పరోక్షంగా కేజ్రీవాల్‌ను ఎగతాళి చేస్తూ రేడియోలో ప్రసారమవుతోన్న జింగిల్స్ ఈ విషయాన్నే ధ్రువీకరిస్తున్నాయి.
 
 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ దృష్టి
 న్యూఢిల్లీ : జార్ఖండ్, జమ్మూకశ్మీర్  అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఎన్నికల కమిషన్ దృష్టి ఢిల్లీపై పడింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం పరిస్థితిని అంచనావేయడానికి ఎన్నికల కమిషన్ బుధవారం స్టేక్ హోల్డర్లతో సమావేశం జరిపింది. ఓటర్ల జాబితా అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. ఓటరు జాబితాను అప్‌డేట్ చేయడం, జాబితాలో తమ పేర్లు లేవన్న పిర్యాదులను తగ్గించడం కోసం చేపట్టే కార్యాచరణ ప్రణాళికను సమావేశంలో చర్చించారు. ఎన్నికల నిర్వహణకు కావలసిన సిబ్బంది లభ్యత తదితర విషయాలు చర్చించారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఢిల్లీ పర్యటన, త్రిలోక్‌పురి, బవానాలో మతఘర్షణలు. సీమాపురలో చర్చిలో అగ్నిప్రమాదం ఘటనల నేపథ్యంలో నగరంలో శాంతి భద్రతల పరిస్థితిపై సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. నగరంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపడానికి అవసరమైన రోడ్ మ్యాప్ సమర్పించాలని ఎన్నికల కమిషన్ ఢిల్లీ పోలీసులను కోరినట్లు సమాచారం.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement