చుక్కెదురు | Cauvery Tribunal Asks Tamil Nadu to Approach SC | Sakshi
Sakshi News home page

చుక్కెదురు

Jul 16 2014 12:20 AM | Updated on Nov 9 2018 5:52 PM

చుక్కెదురు - Sakshi

చుక్కెదురు

కావేరి వాటా జలాలపై రాష్ట్ర ప్రభుత్వ వాదనకు ట్రిబ్యునల్ సమావేశంలో చుక్కెదురైంది. కావేరీ జలాల హక్కులపై దశాబ్దాల తరబడి దక్షిణాది రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతోంది.

 చెన్నై, సాక్షి ప్రతినిధి: కావేరి వాటా జలాలపై రాష్ట్ర ప్రభుత్వ వాదనకు ట్రిబ్యునల్ సమావేశంలో చుక్కెదురైంది. కావేరీ జలాల హక్కులపై దశాబ్దాల తరబడి దక్షిణాది రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతోంది. ప్రధానంగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య రేగిన ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్రం ఒక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్ 2007 ఫిబ్రవరి 5న తీర్పు వెల్లడించింది. కావేరీలో ఏడాదికి సుమారు 740 టీఎంసీల నీరు అందుబాటులోకి వస్తోందని, ఇందులో తమిళనాడుకు 419 టీఎంసీలు, కర్ణాటకకు 270 టీఎంసీలు, కేరళకు 30 టీఎంసీలు, పుదుచ్చేరికి 7 టీఎంసీల చొప్పున వాటాలను నిర్ణయించింది.
 
 ఈ తీర్పు ప్రకారం తమిళనాడుకు ఏడాది పొడవునా కర్ణాటక 192 టీఎంసీలు నీటిని విడుదల చేయాలని ఆదేశించింది. ఇందుకోసం కర్ణాటక సరిహద్దుల్లోని బిల్లిగుండులుకు 182 టీఎంసీలు వదలాలి. అలాగే మిగతా 10 టీఎంసీలు పర్యావరణ పరిరక్షణకు వినియోగించాలని ట్రిబ్యునల్ తన తీర్పులో పేర్కొంది. తీర్పుపై పూర్తి వివరాలు కావాలంటూ తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలు ట్రిబ్యునల్‌ను కోరాయి. ట్రిబ్యునల్ తీర్పుకు అభ్యంతరం చెబుతూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కారణంగా ఇతర రాష్ట్రల విజ్ఞప్తులపై చర్చించేందుకు ట్రిబ్యునల్  నిరాకరించింది.
 
 2007 జూలై 10 వ తేదీన ట్రిబ్యునల్ చివరిసారిగా సమావేశమైంది. ట్రిబ్యునల్ చైర్మన్‌గా ఉన్న ఎన్‌బీ సింగ్ 2012లో రాజీనామా చేశారు. కొత్త చైర్మన్ నియామకం జరగక పోవడంతో కావేరికి సంబంధించి అన్ని విజ్ఞప్తుల పరిశీలనపై ప్రతిష్టంభన ఏర్పడింది. ఆ తరువాత సుప్రీం కోర్టు రిటైర్డు న్యాయమూర్తి పీఎస్ సౌకాన్ చైర్మన్‌గా గత కేంద్ర ప్రభుత్వం నియమించింది. వివాదానికి వీలైనంత త్వరలో తెరదించాల్సిన ట్రిబ్యునల్ ఎట్టకేలకూ ఏడేళ్ల తరువాత మంగళవారం డిల్లీలో సమావేశమైంది. తమిళనాడుతో పాటూ కర్ణాటక, కేరళ, పుదుచ్చేరీ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు హాజరై తమ వాదనను వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజాపనుల శాఖ కార్యదర్శి సాయికుమార్ తదితరులు హాజరయ్యూరు. ఇతర రాష్ట్రాల నుంచి ఉన్నతాధికారులు హాజరై తమ వాదనలను ట్రిబ్యునల్‌కు వినిపించారు.
 
 తమిళనాడు ప్రభుత్వం తరపున న్యాయవాది వినోద్ బాబ్డే మాట్లాడుతూ, తీర్పుపై వివరణ కోరుతూ తమ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరపాలని, ఈ పిటిషన్‌ను విచారించేందుకు వీలులేదని సుప్రీం కోర్టుకూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదని పేర్కొన్నారు. కర్ణాటక ప్రభుత్వం తరపున హాజరైన న్యాయవాది ఇందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టులో కేసు నడుస్తున్నందునే గత చైర్మన్ తమిళనాడు పిటిషన్లను విచారించేందుకు నిరాకరించారని గుర్తు చేశారు. కావేరిపై సుప్రీం కోర్టు తాజా తీర్పును వెలువరించే వరకు యథాస్థితి కొనసాగాలని ఆయన వాదించారు. కర్ణాటక వాదనతో ఏకీభవించిన ట్రిబ్యునల్ చైర్మన్ తమిళనాడు విజ్ఞప్తిని నిరాకరించారు. ఈ కారణంగా ట్రిబ్యునల్ సమావేశమైనా తమిళనాడు పిటిషన్ల విచారణపై చుక్కెందురైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement