breaking news
Cauvery Tribunal
-
తమిళనాడుకు సుప్రీంకోర్టు షాక్
సాక్షి, ఢిల్లీ: కావేరీ నదీ జలాల విడుదల వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నీటి వాటా విడుదలలో ఏవైనా అభ్యంతరాలు లేదా ఫిర్యాదులు ఉంటే వాటిని కావేరీ జలాల నిర్వహణ సంస్థ (CWMA) ముందే లేవనెత్తాలని తమిళనాడు ప్రభుత్వానికి స్పష్టం చేసింది. కర్ణాటక నుంచి తమకు రావాల్సిన అదనపు నిష్పత్తి నీటి వాటాను విడుదల చేసేలా ఆదేశించాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారించింది.వివరాల్లోకి వెళితే.. కావేరీ నీటి నియంత్రణ కమిటీ (CWRC) ఆగస్టు 12 నుండి 15 రోజుల పాటు ప్రతిరోజూ తమిళనాడుకు 12,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని కావేరీ జలాల నిర్వహణ సంస్థ (CWMA) కూడా సమర్థించింది. అయితే వాటా న్యాయపరంగా తమకు దక్కడం లేదని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమిళనాడు తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సి.ఎస్. వైద్యనాథన్ వాదనలు వినిపిస్తూ, తమకు దక్కాల్సిన సరైన నిష్పత్తిలో నీరు అందడం లేదని ధర్మాసనానికి తెలిపారు. దురదృష్టవశాత్తూ క్షేత్రస్థాయిలో నీటి విడుదల సక్రమంగా జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ఈ అంశాన్ని సంబంధిత అథారిటీ (CWMA) సమావేశంలోనే లేవనెత్తాలని సుప్రీంకోర్టు సూచించింది.గత విచారణలో కర్ణాటక ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ సమర్పించిన నీటి విడుదల వివరాల చార్ట్‌ను ధర్మాసనం ప్రస్తావించింది. ఆ చార్ట్ ప్రకారం CWMA ఆదేశాల మేరకే తమిళనాడుకు నీటిని విడుదల చేసినట్లు కనిపిస్తోందని బెంచ్ వ్యాఖ్యానించింది. దీనిపై వైద్యనాథన్ స్పందిస్తూ, నిష్పత్తి ప్రకారం నీటిని విడుదల చేయడానికి CWMA దిశా నిర్దేశం చేయడం లేదని, దీనివల్ల తమిళనాడులోని రైతులకు తాము ఒక్క చుక్క నీటిని కూడా విడుదల చేయలేకపోతున్నామని, కానీ కర్ణాటక మాత్రం తమ రైతులకు నీటిని ఇచ్చుకుంటోందని వాదించారు. దీంతో సుప్రీంకోర్టు ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 31కి వాయిదా వేస్తూ, ఆ రోజు నాటికి తాజా పరిస్థితిపై నివేదిక (అప్డేటెడ్ స్టేటస్) సమర్పించాలని ఇరు రాష్ట్రాలను ఆదేశించింది.అంతకుముందు ఆగస్టు 17న జరిగిన విచారణలో కూడా CWMA ఆదేశాలను కర్ణాటక తప్పనిసరిగా పాటించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.తమిళనాడు ప్రభుత్వం కోర్టుకు తెలిపిన వివరాల ప్రకారం, వర్షపాతం తక్కువగా ఉన్న ఈ సంవత్సరంలో తమకు రావలసిన న్యాయమైన వాటా దక్కడం లేదు. CWRC కేటాయించిన పరిమాణం కంటే, పొరుగున ఉన్న కర్ణాటక విడుదల చేసిన నీటి పరిమాణం చాలా తక్కువగా ఉందని తమిళనాడు తన పిటిషన్లో పేర్కొంది.జూలై 28న జరిగిన CWRC సమావేశంలో జూలై 29 నుండి 15 రోజుల పాటు రోజుకు 3,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించినప్పటికీ, జూలై 29 నుండి ఆగస్టు 2 వరకు బిలిగుండ్లు వద్ద కేవలం 158 నుండి 550 క్యూసెక్కుల లోపే నీరు అందిందని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది.తమిళనాడు ప్రభుత్వం విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం.. ఆగస్టు 3 నాటికి కర్ణాటకలోని కేఆర్ఎస్, కబిని, హారంగి, హేమవతి జలాశయాలలో మొత్తం నీటి నిల్వ 77.537 టీఎంసీలుగా ఉంది. కాబట్టి తమిళనాడుకు చెందాల్సిన వాటాను నిష్పత్తి ప్రకారం విడుదల చేయడానికి కర్ణాటకకు ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసింది.కర్ణాటకలోని కేఆర్ఎస్, కబిని డ్యామ్‌ల క్యాచ్మెంట్ ఏరియాలలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా, బిలిగుండ్లు వద్ద తమిళనాడుకు అందాల్సిన నిష్పత్తి నీరు 26.954 టీఎంసీలుగా ఉండాలని పేర్కొంది. దీనితో పోలిస్తే కావేరీ జలాల నిర్వహణ సంస్థ (CWMA) కేటాయించిన 4.536 టీఎంసీలు చాలా తక్కువని తమిళనాడు ఆరోపించింది. మొత్తంగా కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుకు ఇవ్వాల్సిన 26.954 టీఎంసీల న్యాయమైన వాటాను పంచుకోవడంలో విఫలమైందని తమిళనాడు ప్రభుత్వం తన అధికారిక ప్రకటనలో వెల్లడించింది. -
కావేరిపై ఉత్కంఠ
►రంగంలోకి ఉన్నత స్థాయి కమిటీ ►నేడు మెట్టూరులో పర్యటన ► బోర్డు ఏర్పాటే లక్ష్యంగా కమలదళం ఒత్తిడి ►చల్లారని నిరసనలు ► అరియలూరులో వాసన్, తిరుచ్చిలో సీమాన్ ►15న తిరుచ్చి వేదికగా కాంగ్రెస్ దీక్ష ► రాష్ట్రపతి, పీఎంతో భేటీకి స్టాలిన్ ప్రయత్నాలు ►ఈశాన్యం కరుణించేనా! ► 20న రుతు పవనాల ప్రవేశానికి అవకాశం కావేరి అభివృద్ధి బోర్డు, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు లక్ష్యంగా రాష్ట్రంలో సాగుతున్న పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. కేంద్రం నియమించిన ఉన్నత స్థాయి సాంకేతిక కమిటీ రంగంలోకి దిగింది. ఆదివారం మెట్టూరులో ఈ కమిటీ పర్యటించనుంది. బోర్డుల సాధనే లక్ష్యంగా రాజకీయ పక్షాలు కదిలాయి. విమర్శల నేపథ్యంలో తాము సైతం అంటూ కమలనాథులు కూడా కదిలారు. అధ్యక్షుడు అమిత్ షా ద్వారా కేంద్రంపై ఒత్తిడికి తేవడానికి ఢిల్లీకి బయల్దేరారు. సాక్షి, చెన్నై: కావేరి ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు అభివృద్ధి బోర్డు, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటుకు కేంద్రం మోకాలొడ్డే పనిలో పడ్డ విషయం తెలిసిందే. ఈ తీర్పును తుంగలో తొక్కడం లక్ష్యంగా కుట్రలు ఢిల్లీలో సాగుతుండడంతో రాష్ట్రంలో నిరసనలు భగ్గుమన్నాయి. శనివారం కూడా పలుచోట్ల అన్నదాతలు తమ ఆక్రోశాన్ని ప్రదర్శించారు. అరియలూరులో తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్ నేతృత్వంలో భారీ నిరసన చేపట్టారు. తిరుచ్చిలో నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ నేతృత్వంలో భారీ ర్యాలీ సాగింది. అన్నదాతలు ఓ వైపు, ప్రజా సంఘాలు మరో వైపు, రాజకీయ పక్షాలు ఇంకో వైపు నిరసనల్ని ఉధృతం చేసే పనిలో పడ్డాయి. కేంద్రంలోని తమ ప్రభుత్వం అడ్డు తగులుతున్నదన్నట్టుగా ముప్పేట దాడి సాగుతుండడంతో కమలనాథులు మేల్కొన్నారు. బోర్డు, కమిటీ సాధనే లక్ష్యంగా ఢిల్లీ బాట పట్టారు. ఆదివారం పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలవనున్నారు. ఆయన ద్వారా ప్రధాని నరేంద్ర మోదీకి విన్నవించి, తదుపరి నీటి పారుదల శాఖ మంత్రి ఉమాభారతితో భేటీకి నిర్ణయించడం గమనార్హం. అన్ని పార్టీలు పోరు ఉధృతం చేయడంతో తాము సైతం అంటూ కాంగ్రెస్ దీక్షలకు నిర్ణయించింది. ఈ నెల 15న తిరుచ్చిలో జరిగే దీక్షకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తిరునావుక్కరసర్ నేతృత్వం వహించనున్నారు. ఇప్పటికే నిరసనల్లో దూసుకెళ్తోన్న డీఎంకే దళపతి, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ మరో అడుగు వేసి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీల్ని కలిసే ప్రయత్నాల్లో పడ్డారు. ఇందుకు తగ్గ అనుమతి లభించగానే, ఢిల్లీ వెళ్లి తమిళ అన్నదాతల ఆవేదనను అక్కడి పెద్దల వద్ద మొర పెట్టుకోనున్నారు. నేడు మెట్టూరుకు కమిటీ: కర్ణాటకలోని జలాశయాల్లో నీటి నిల్వ, తమిళనాడులోని మెట్టూరు జలాశయం, కావేరి తీరంలో సాగు పరిస్థితిని అధ్యయనం చేయడానికి ఉన్నత స్థాయి సాంకేతిక కమిటీని కేంద్రం నియమించిన విషయం తెలిసిందే. సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ జీఎస్ షా నేతృత్వంలో తొమ్మిది మందితో కూడిన ఈ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రజా పనుల శాఖ అధికారులు ప్రభాకర్, సుబ్రమణియన్లను నియమించి ఉన్నారు. ఈ కమిటీ కర్ణాకటకలో పర్యటిస్తోంది. శనివారం రాత్రి తన పర్యటనను ముగించుకుని ఈ కమిటీ మెట్టూరుకు చేరుకోనుంది. ఇక్కడి అతిథి గృహంలో బస చేసే ప్రతినిధులు ఆదివారం మెట్టూరు జలాశయంలో పరిశీలన జరపనున్నారు. ప్రస్తుతం మెట్టూరులో నీటి మట్టం 71.93 అడుగులుగా ఉంది. అవుట్ ఫ్లో సెకనుకు 12 వేల ఘనపుటడుగులు, ఇన్ ఫ్లో 715 ఘనపుటడుగులుగా ఉన్నాయి. ఈ పరిశీలన అనంతరం తంజావూరులో రాత్రి బస ఈ కమిటీ బస చేయనుంది. సోమవారం తంజావూరు, తిరువారూర్లలో సాగు పరిస్థితిపై పరిశీలించి ఈ నెల 17న కేంద్రానికి నివేదికను సమర్పించనుంది. ఈ కమిటీ నివేదిక సుప్రీంకోర్టుకు చేరినానంతరం, పరిస్థితుల అధ్యయనం తదుపరి కావేరి మళ్లీ పరవళ్లు తొక్కేనా లేదా అన్నది వేచి చూడాల్సిందే. ఈ బృందం రాాకతో సేలం జిల్లా కలెక్టర్ సంపత్ నేతృత్వంలో అధికార వర్గాలు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఈశాన్యం కరుణించేనా: నైరుతీ ముఖం చాటేయడంతో సాగు నీటి కోసం అన్నదాతలు తీవ్ర ఇక్కట్లకు గురి అవుతున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ముందస్తుగా ఈశాన్య రుతు పవనాలు రాష్ట్రంలోకి ప్రవే శించే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. గత ఏడాది ఈశాన్య రుతు పవనాల రూపంలో చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, కడలూరు జిల్లాలు వరద ప్రళయంలో చిక్కిన విషయం తెలిసిందే. ఇతర జిల్లాల్లోనూ ఆశాజనకంగా వర్షాలు పడ్డాయి. ఈ ఏడాది కూడా ప్రభావం అదే విధంగా ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి. ముందుగానే ఈ నెల 20న ఈ పవనాలు రాష్ట్రానికి తాకనున్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ రుతు పవనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు భారీగా పడేందుకు అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నారు. ఈశాన్య రుతు పవనాల కాలంలో 40 సె.మీ మేరకు వర్షం పడే అవకాశం ఉందని వివరించడంతో అన్నదాతల్లో అడుగంటి ఉన్న ఆశలు చిగురిస్తున్నాయి. -
చుక్కెదురు
చెన్నై, సాక్షి ప్రతినిధి: కావేరి వాటా జలాలపై రాష్ట్ర ప్రభుత్వ వాదనకు ట్రిబ్యునల్ సమావేశంలో చుక్కెదురైంది. కావేరీ జలాల హక్కులపై దశాబ్దాల తరబడి దక్షిణాది రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతోంది. ప్రధానంగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య రేగిన ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్రం ఒక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్ 2007 ఫిబ్రవరి 5న తీర్పు వెల్లడించింది. కావేరీలో ఏడాదికి సుమారు 740 టీఎంసీల నీరు అందుబాటులోకి వస్తోందని, ఇందులో తమిళనాడుకు 419 టీఎంసీలు, కర్ణాటకకు 270 టీఎంసీలు, కేరళకు 30 టీఎంసీలు, పుదుచ్చేరికి 7 టీఎంసీల చొప్పున వాటాలను నిర్ణయించింది. ఈ తీర్పు ప్రకారం తమిళనాడుకు ఏడాది పొడవునా కర్ణాటక 192 టీఎంసీలు నీటిని విడుదల చేయాలని ఆదేశించింది. ఇందుకోసం కర్ణాటక సరిహద్దుల్లోని బిల్లిగుండులుకు 182 టీఎంసీలు వదలాలి. అలాగే మిగతా 10 టీఎంసీలు పర్యావరణ పరిరక్షణకు వినియోగించాలని ట్రిబ్యునల్ తన తీర్పులో పేర్కొంది. తీర్పుపై పూర్తి వివరాలు కావాలంటూ తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలు ట్రిబ్యునల్‌ను కోరాయి. ట్రిబ్యునల్ తీర్పుకు అభ్యంతరం చెబుతూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కారణంగా ఇతర రాష్ట్రల విజ్ఞప్తులపై చర్చించేందుకు ట్రిబ్యునల్ నిరాకరించింది. 2007 జూలై 10 వ తేదీన ట్రిబ్యునల్ చివరిసారిగా సమావేశమైంది. ట్రిబ్యునల్ చైర్మన్‌గా ఉన్న ఎన్బీ సింగ్ 2012లో రాజీనామా చేశారు. కొత్త చైర్మన్ నియామకం జరగక పోవడంతో కావేరికి సంబంధించి అన్ని విజ్ఞప్తుల పరిశీలనపై ప్రతిష్టంభన ఏర్పడింది. ఆ తరువాత సుప్రీం కోర్టు రిటైర్డు న్యాయమూర్తి పీఎస్ సౌకాన్ చైర్మన్‌గా గత కేంద్ర ప్రభుత్వం నియమించింది. వివాదానికి వీలైనంత త్వరలో తెరదించాల్సిన ట్రిబ్యునల్ ఎట్టకేలకూ ఏడేళ్ల తరువాత మంగళవారం డిల్లీలో సమావేశమైంది. తమిళనాడుతో పాటూ కర్ణాటక, కేరళ, పుదుచ్చేరీ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు హాజరై తమ వాదనను వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజాపనుల శాఖ కార్యదర్శి సాయికుమార్ తదితరులు హాజరయ్యూరు. ఇతర రాష్ట్రాల నుంచి ఉన్నతాధికారులు హాజరై తమ వాదనలను ట్రిబ్యునల్‌కు వినిపించారు. తమిళనాడు ప్రభుత్వం తరపున న్యాయవాది వినోద్ బాబ్డే మాట్లాడుతూ, తీర్పుపై వివరణ కోరుతూ తమ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరపాలని, ఈ పిటిషన్‌ను విచారించేందుకు వీలులేదని సుప్రీం కోర్టుకూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదని పేర్కొన్నారు. కర్ణాటక ప్రభుత్వం తరపున హాజరైన న్యాయవాది ఇందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టులో కేసు నడుస్తున్నందునే గత చైర్మన్ తమిళనాడు పిటిషన్లను విచారించేందుకు నిరాకరించారని గుర్తు చేశారు. కావేరిపై సుప్రీం కోర్టు తాజా తీర్పును వెలువరించే వరకు యథాస్థితి కొనసాగాలని ఆయన వాదించారు. కర్ణాటక వాదనతో ఏకీభవించిన ట్రిబ్యునల్ చైర్మన్ తమిళనాడు విజ్ఞప్తిని నిరాకరించారు. ఈ కారణంగా ట్రిబ్యునల్ సమావేశమైనా తమిళనాడు పిటిషన్ల విచారణపై చుక్కెందురైంది.


