కావేరి ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు అభివృద్ధి బోర్డు, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటుకు కేంద్రం మోకాలొడ్డే పనిలో పడ్డ విషయం తెలిసిందే.
►రంగంలోకి ఉన్నత స్థాయి కమిటీ
►నేడు మెట్టూరులో పర్యటన
► బోర్డు ఏర్పాటే లక్ష్యంగా కమలదళం ఒత్తిడి
►చల్లారని నిరసనలు
► అరియలూరులో వాసన్, తిరుచ్చిలో సీమాన్
►15న తిరుచ్చి వేదికగా కాంగ్రెస్ దీక్ష
► రాష్ట్రపతి, పీఎంతో భేటీకి స్టాలిన్ ప్రయత్నాలు
►ఈశాన్యం కరుణించేనా!
► 20న రుతు పవనాల ప్రవేశానికి అవకాశం
కావేరి అభివృద్ధి బోర్డు, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు లక్ష్యంగా రాష్ట్రంలో సాగుతున్న పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. కేంద్రం నియమించిన ఉన్నత స్థాయి సాంకేతిక కమిటీ రంగంలోకి దిగింది. ఆదివారం మెట్టూరులో ఈ కమిటీ పర్యటించనుంది. బోర్డుల సాధనే లక్ష్యంగా రాజకీయ పక్షాలు కదిలాయి. విమర్శల నేపథ్యంలో తాము సైతం అంటూ కమలనాథులు కూడా కదిలారు. అధ్యక్షుడు అమిత్ షా ద్వారా కేంద్రంపై ఒత్తిడికి తేవడానికి ఢిల్లీకి బయల్దేరారు.
సాక్షి, చెన్నై: కావేరి ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు అభివృద్ధి బోర్డు, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటుకు కేంద్రం మోకాలొడ్డే పనిలో పడ్డ విషయం తెలిసిందే. ఈ తీర్పును తుంగలో తొక్కడం లక్ష్యంగా కుట్రలు ఢిల్లీలో సాగుతుండడంతో రాష్ట్రంలో నిరసనలు భగ్గుమన్నాయి. శనివారం కూడా పలుచోట్ల అన్నదాతలు తమ ఆక్రోశాన్ని ప్రదర్శించారు. అరియలూరులో తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్ నేతృత్వంలో భారీ నిరసన చేపట్టారు.
తిరుచ్చిలో నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ నేతృత్వంలో భారీ ర్యాలీ సాగింది. అన్నదాతలు ఓ వైపు, ప్రజా సంఘాలు మరో వైపు, రాజకీయ పక్షాలు ఇంకో వైపు నిరసనల్ని ఉధృతం చేసే పనిలో పడ్డాయి. కేంద్రంలోని తమ ప్రభుత్వం అడ్డు తగులుతున్నదన్నట్టుగా ముప్పేట దాడి సాగుతుండడంతో కమలనాథులు మేల్కొన్నారు. బోర్డు, కమిటీ సాధనే లక్ష్యంగా ఢిల్లీ బాట పట్టారు. ఆదివారం పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలవనున్నారు. ఆయన ద్వారా ప్రధాని నరేంద్ర మోదీకి విన్నవించి, తదుపరి నీటి పారుదల శాఖ మంత్రి ఉమాభారతితో భేటీకి నిర్ణయించడం గమనార్హం.
అన్ని పార్టీలు పోరు ఉధృతం చేయడంతో తాము సైతం అంటూ కాంగ్రెస్ దీక్షలకు నిర్ణయించింది. ఈ నెల 15న తిరుచ్చిలో జరిగే దీక్షకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తిరునావుక్కరసర్ నేతృత్వం వహించనున్నారు. ఇప్పటికే నిరసనల్లో దూసుకెళ్తోన్న డీఎంకే దళపతి, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ మరో అడుగు వేసి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీల్ని కలిసే ప్రయత్నాల్లో పడ్డారు. ఇందుకు తగ్గ అనుమతి లభించగానే, ఢిల్లీ వెళ్లి తమిళ అన్నదాతల ఆవేదనను అక్కడి పెద్దల వద్ద మొర పెట్టుకోనున్నారు.
నేడు మెట్టూరుకు కమిటీ: కర్ణాటకలోని జలాశయాల్లో నీటి నిల్వ, తమిళనాడులోని మెట్టూరు జలాశయం, కావేరి తీరంలో సాగు పరిస్థితిని అధ్యయనం చేయడానికి ఉన్నత స్థాయి సాంకేతిక కమిటీని కేంద్రం నియమించిన విషయం తెలిసిందే. సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ జీఎస్ షా నేతృత్వంలో తొమ్మిది మందితో కూడిన ఈ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రజా పనుల శాఖ అధికారులు ప్రభాకర్, సుబ్రమణియన్‌లను నియమించి ఉన్నారు. ఈ కమిటీ కర్ణాకటకలో పర్యటిస్తోంది. శనివారం రాత్రి తన పర్యటనను ముగించుకుని ఈ కమిటీ మెట్టూరుకు చేరుకోనుంది. ఇక్కడి అతిథి గృహంలో బస చేసే ప్రతినిధులు ఆదివారం మెట్టూరు జలాశయంలో పరిశీలన జరపనున్నారు.
ప్రస్తుతం మెట్టూరులో నీటి మట్టం 71.93 అడుగులుగా ఉంది. అవుట్ ఫ్లో సెకనుకు 12 వేల ఘనపుటడుగులు, ఇన్ ఫ్లో 715 ఘనపుటడుగులుగా ఉన్నాయి. ఈ పరిశీలన అనంతరం తంజావూరులో రాత్రి బస ఈ కమిటీ బస చేయనుంది. సోమవారం తంజావూరు, తిరువారూర్‌లలో సాగు పరిస్థితిపై పరిశీలించి ఈ నెల 17న కేంద్రానికి నివేదికను సమర్పించనుంది. ఈ కమిటీ నివేదిక సుప్రీంకోర్టుకు చేరినానంతరం, పరిస్థితుల అధ్యయనం తదుపరి కావేరి మళ్లీ పరవళ్లు తొక్కేనా లేదా అన్నది వేచి చూడాల్సిందే. ఈ బృందం రాాకతో సేలం జిల్లా కలెక్టర్ సంపత్ నేతృత్వంలో అధికార వర్గాలు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు.
ఈశాన్యం కరుణించేనా: నైరుతీ ముఖం చాటేయడంతో సాగు నీటి కోసం అన్నదాతలు తీవ్ర ఇక్కట్లకు గురి అవుతున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ముందస్తుగా ఈశాన్య రుతు పవనాలు రాష్ట్రంలోకి ప్రవే శించే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. గత ఏడాది ఈశాన్య రుతు పవనాల రూపంలో చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, కడలూరు జిల్లాలు వరద ప్రళయంలో చిక్కిన విషయం తెలిసిందే. ఇతర జిల్లాల్లోనూ ఆశాజనకంగా వర్షాలు పడ్డాయి.
ఈ ఏడాది కూడా ప్రభావం అదే విధంగా ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి. ముందుగానే ఈ నెల 20న ఈ పవనాలు రాష్ట్రానికి తాకనున్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ రుతు పవనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు భారీగా పడేందుకు అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నారు. ఈశాన్య రుతు పవనాల కాలంలో 40 సె.మీ మేరకు వర్షం పడే అవకాశం ఉందని వివరించడంతో అన్నదాతల్లో అడుగంటి ఉన్న ఆశలు చిగురిస్తున్నాయి.


