కుల్దీప్‌పై వేటు.. చహల్‌కు చోటు | West Indies Won The Toss And Opted Bat In 3rd ODI Against India | Sakshi
Sakshi News home page

కుల్దీప్‌పై వేటు.. చహల్‌కు చోటు

Aug 14 2019 6:46 PM | Updated on Aug 14 2019 6:58 PM

West Indies Won The Toss And Opted Bat In 3rd ODI Against India - Sakshi

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌:  ప్రపంచకప్‌ సెమీస్‌లోనే నిష్క్రమించిన వైఫల్యం నుంచి త్వరగానే కోలుకున్న టీమిండియా వెస్టిండీస్‌ పర్యటనలో అదరగొడుతోంది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను దక్కించుకున్న కోహ్లి సేన తాజాగా వన్డే సిరీస్‌పై కూడా కన్నేసింది. నిర్ణయాత్మకమైన చివరి వన్డేలో టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ కోసం టీమిండియా ఒక్క మార్పు చేసింది. కుల్దీప్‌ యాదవ్‌ను పక్కకు పెట్టి చహల్‌ను  తుది జట్టులోకి తీసుకుంది. కరేబియన్‌ జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. షెల్డన్‌ కాట్రెల్‌, థామస్‌లపై వేట వేసి కీమో పాల్‌, ఫాబియన్‌ అలెన్‌లపై విండీస్‌ మేనేజ్‌మెంట్‌ నమ్మకం పెట్టుకుంది.  మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దవగా.. రెండో వన్డేలో కోహ్లి సేన జయభేరి మోగించింది. దీంతో నిర్ణయాత్మక మూడో వన్డేలో గెలిచి సిరీస్‌ కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తుండగా.. చివరి వన్డేలో తప్పక గెలిచి సిరీస్‌ సమం చేయాలని వెస్టిండీస్‌ ఆరాటపడుతోంది. 

ఒత్తిడిలో గబ్బర్‌...
గాయం కారణంగా వరల్డ్‌కప్‌ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ఫామ్‌ భారత్‌ను కలవరపెడుతోంది. టీ20 సిరీస్‌లో గబ్బర్‌ 1, 23, 3తో నిరాశ పరిచాడు. రెండో వన్డేలోనూ 2 పరుగులకే పరిమితం అయ్యాడు. టెస్టుల్లో చోటుదక్కని ధావన్‌కు కరీబియన్‌ గడ్డపై నిరూపించుకొనేందుకు మూడో వన్డేనే చివరి అవకాశం. అందుకే ఇప్పుడు ఒత్తిడంతా అతడిపైనే నెలకొంది. కాట్రెల్‌ విసిరిన ఇన్‌స్వింగ్‌ బంతులకే శిఖర్‌ రెండు సార్లు ఔట్‌ అవ్వడం గమనార్హం. రెండో వన్డేలో క్లిష్ట సమయంలో అదరగొట్టిన శ్రేయస్‌ అయ్యర్‌తో రిషభ్‌పంత్‌కు పోటీ ఎదురవుతోం ది. ప్రస్తుతం జట్టు యాజమాన్యం పంత్‌ను కీలకమైన నాలుగో స్థానంలో ఆడిస్తోంది. 

విధ్వంసకరంగా ఆడే అతడు జట్టుకు అవసరమైన సమయాల్లోనే చెత్త షాట్లతో వికెట్‌ పారేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఐదో స్థానంలో వచ్చి సహనంతో ఆడిన అయ్యర్‌ నాలుగో స్థానానికి గట్టి పోటీదారునని చెప్పకనే చెప్పాడు. మరోవైపు దాదాపు ఆర్నెల్ల తర్వాత శతకం బాదిన కెప్టెన్‌ కోహ్లీ ఊపుమీదున్నాడు. రెండో వన్డేలో ఓపెనర్లు రోహిత్, ధావన్‌ విఫలం కావడంతో చివరి వరకు నిలిచి భారత్‌కు భారీ స్కోరు అందించాడు. బౌలింగ్‌లో భువనేశ్వర్‌ కుమార్‌ బంతిని రెండువైపులా స్వింగ్‌ చేస్తూ అదరగొడుతున్నాడు. 

పరువు నిలుపుకోవాలని..
టీ20 సిరీస్‌ చేజార్చుకున్న విండీస్‌.. ఈ సిరీస్‌నైనా కాపాడుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలుపుకోవాలని తాపత్రయ పడుతోంది. ఆ జట్టు కోచ్‌ సైతం కోహ్లీసేనపై కాస్త పౌరుషం, పట్టుదల చూపించాలని ఆటగాళ్లను కోరిన సంగతి తెలిసిందే. నిర్ణయాత్మక పోరులో గెలవాలంటే విండీస్‌లో షైహోప్, నికోలస్‌ పూరన్, షిమ్రన్‌ హెట్‌మైయిర్‌ వంటి యువకులు రాణించాల్సి ఉంది. భారీ భాగస్వామ్యాలు నిర్మించాల్సి ఉంది. బౌలింగ్‌ పరంగా కరీబియన్‌ జట్టుకు ఇబ్బందేమీ లేదు. 

తుది జట్లు: 
భారత్‌: విరాట్‌ కోహ్లి(సారథి), రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, రిషభ్‌ పంత్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, కేదార్‌ జాదవ్‌, రవీంద్ర జడేజా, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమీ, ఖలీల్‌ అహ్మద్‌, చహల్‌
వెస్టిండీస్‌: హోల్డర్(సారథి) గేల్, లూయిస్‌, హోప్, హెట్‌మైర్, పూరన్, చేజ్, బ్రాత్‌వైట్, రోచ్, కీమో పాల్‌, ఫాబియన్‌ అలెన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement