దాదాపు రెండేళ్లుగా వివిధ అంతర్జాతీయ ఈవెంట్లలో పతకాలు సాధించిన క్రీడాకారుల ఎదురు చూపులు ఫలించాయి.
- నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు
- సైనా, సింధుల పాత బకాయిలు కూడా చెల్లింపు
సాక్షి, హైదరాబాద్: దాదాపు రెండేళ్లుగా వివిధ అంతర్జాతీయ ఈవెంట్లలో పతకాలు సాధించిన క్రీడాకారుల ఎదురు చూపులు ఫలించాయి. ఇటీవల కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన వారితో పాటు... గతంలో పతకాలు సాధించిన వారికి కూడా తెలంగాణ ప్రభుత్వం నజారానా ప్రకటించింది. వీళ్లందరికీ చెల్లించేందుకు గాను రూ. 29.6 కోట్లు విడుదల చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
2012లో లండన్ ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరిన కశ్యప్‌కు రూ. 25 లక్షలు, 2013లో వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పతకానికిగాను సింధుకు రూ.25 లక్షలు ఇవ్వనున్నారు. అలాగే ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్‌లో టైటిల్ గెలిచిన సైనా నెహ్వాల్‌కు రూ. 20 లక్షలు ఇస్తారు. ఆగస్టు 15వ తేదీన చెల్లింపునకు వీలుగా నిధులను విడుదల చేస్తూ యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.