ఐపీఎల్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌ ! | IPL 2019 scheduled to be played in India  | Sakshi
Sakshi News home page

ఎన్నికల ఎఫెక్ట్ ‌: ముందుగానే ఐపీఎల్‌ !

Jan 8 2019 7:45 PM | Updated on Jan 8 2019 7:45 PM

IPL 2019 scheduled to be played in India  - Sakshi

ముంబై : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) సీజన్‌ ముందుగానే ప్రారంభం కానుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ రెండు వారాల ముందుకు జరిపింది. అంతేకాకుండా 12వ సీజన్ ఐపీఎల్‌ను భారత్‌లోనే నిర్వహించనున్నట్టు స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా.. టోర్నీని యూఏఈ లేదా దక్షిణాఫ్రికాకు తరలిస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ భారత్‌లోనే టోర్నీ నిర్వహించాలని తాజాగా బీసీసీఐ నిర్ణయించింది. గత సీజన్‌ను ఏప్రిల్ 7 నుంచి ప్రారంభించగా.. ఈసారి అంతకు ముందే ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌ను ఆరంభించనుంది. మార్చి 23 నుంచి ఐపీఎల్‌ మ్యాచ్‌లను ప్రారంభించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. 

ఐపీఎల్ వేదికల విషయమై చర్చించేందుకు సుప్రీం కోర్టు నియమిత క్రికెట్‌ పాలకుల కమిటీ (సీఓఏ) మంగళవారం న్యూఢిల్లీలో సమావేశం అయ్యింది. ప్రాథమికంగా చర్చించిన అనంతరం 12వ సీజన్‌ ఐపీఎల్‌ను స్వదేశంలోనే నిర్వహించాలని నిర్ణయించారు. విస్తృతమైన చర్చల అనంతరం ఐపీఎల్ 2019 పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్టు బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక గతంలో 2009, 2014లో ఎన్నికల సందర్భంగా ఐపీఎల్‌ను దక్షిణాఫ్రికా, యూఏఈలో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి కూడా విదేశాల్లోనే ఐపీఎల్‌ నిర్వహిస్తారని అందరూ భావించారు. కానీ బీసీసీఐ భారత్‌లోనే నిర్వహిస్తామని ప్రకటించి.. క్రికెట్‌ అభిమానులకు శుభావార్తను అందించింది.

Advertisement
 
Advertisement
Advertisement