విజయం వేటలో...

India vs West Indies 3rd ODI in pune - Sakshi

నేడు పుణేలో మూడో వన్డే

భువనేశ్వర్, బుమ్రా పునరాగమనం

ఆత్మవిశ్వాసం కూడగట్టుకున్న వెస్టిండీస్‌  

పుణే: ఏకపక్షంగా సాగుతుందనుకున్న వన్డే సిరీస్‌ను విశాఖపట్నంలో అనూహ్య పోరాటంతో ఆసక్తికరంగా మార్చింది వెస్టిండీస్‌. తొలి వన్డేలో ముందుగా బ్యాటింగ్‌కు దిగి భారీ స్కోరు చేసి... రెండో వన్డేలో ఛేదనలో ప్రత్యర్థి స్కోరును సమం చేసి తమను తక్కువగా చూడొద్దని చాటింది. బ్యాట్స్‌మెన్‌ పట్టుదలతో పోటీలో నిలిచింది. మరోవైపు భారత్‌ తప్పనిసరిగా శక్తులను కూడదీసుకునేలా చేసింది. బౌలర్లకు కఠిన పరిస్థితులు ఎదురవుతుండటంతో టీమిండియా సైతం అప్రమత్తమైంది. భువనేశ్వర్, జస్‌ప్రీత్‌ బుమ్రాలతో మరింత కట్టుదిట్టంగా బరిలో దిగనుంది. ఈ నేపథ్యంలో శనివారం ఇక్కడ జరిగే మూడో వన్డేలో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.

ఇక్కడ ఈ ఇద్దరు...
పెద్దగా పేరు లేకున్నా... మంచి హిట్టర్లున్న విండీస్‌ను కట్టడి చేయడం ఎంత కష్టమో రెండు వన్డేల్లోనూ భారత్‌కు తెలిసొచ్చింది. ప్రత్యర్థి 600పైగా పరుగులు చేయడంతో బౌలింగ్‌ కూర్పును మార్చాల్సిన అవసరం ఏర్పడింది. ఈ పరిణామాలతో జట్టులోకి వచ్చిన భువీ, బుమ్రా పుణెలో బరిలో దిగనున్నారు. బ్యాటింగ్‌లో ఓపెనర్లు రోహిత్, ధావన్, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, అంబటి రాయుడి గురించి ఆలోచన లేకున్నా భారత్‌ మిడిలార్డర్‌ సమస్య ఎంతకూ తెగని కథలాగే ఉంది. ఇక రాత్రి వేళ మంచు ప్రభావంతో స్పిన్నర్లకు ఇబ్బంది ఎదురవుతోంది. కాబట్టి టాస్‌ గెలిస్తే బౌలింగ్‌ ఎంచుకోవడమే మేలు.   పర్యాటక జట్టు ఆత్మవిశ్వాసం కూడగట్టుకుని ఆడబోతోం దంటే అది యువ బ్యాట్స్‌మన్‌ హెట్‌మైర్, షై హోప్‌ చలవే. వీరిద్దరు తప్ప మిగతా బ్యాట్స్‌మెన్‌ ఎవరూ నిలవలేకపోవడం జట్టు బలహీనతను చాటుతోంది. బౌలింగ్‌ కూడా అంతకుతగ్గట్లే ఉంది. రెండో వన్డే ఫలితంతో కరీబియన్లు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తమ బలమేంటో చాటారు. కాబట్టి... విండీస్‌ బలహీనతలపై దెబ్బకొడితేనే భారత్‌ గెలుపును ఆశించగలం.

మధ్యాహ్నం గం.1.30 నుంచి   స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top