'చాంపియన్స్‌' వార్‌ | ICC Champions Trophy: Top 5 all-rounders to watch out for in eighth | Sakshi
Sakshi News home page

'చాంపియన్స్‌' వార్‌

May 24 2017 12:35 AM | Updated on Sep 5 2017 11:49 AM

'చాంపియన్స్‌' వార్‌

'చాంపియన్స్‌' వార్‌

నాలుగేళ్ల క్రితం ఇంగ్లండ్‌లో చాంపియన్స్‌ ట్రోఫీ జరిగినప్పుడు ఇదే ఆఖరి టోర్నీ అంటూ అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తేల్చేసింది.

రెండు దశాబ్దాల ఐసీసీ ట్రోఫీ ప్రస్థానం
♦  ఏడు సార్లు జరిగిన టోర్నీ
భారత్‌ ఖాతాలో రెండు టైటిల్స్‌


నాలుగేళ్ల క్రితం ఇంగ్లండ్‌లో చాంపియన్స్‌ ట్రోఫీ జరిగినప్పుడు ఇదే ఆఖరి టోర్నీ అంటూ అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తేల్చేసింది. వన్డేలకు ప్రపంచ కప్‌ ఉండగా మరొకటి ఎందుకంటూ టెస్టు చాంపియన్‌షిప్‌ నిర్వహిస్తామని చెప్పింది. అయితే ఆరు నెలలు తిరిగేలోపే ఈ వన్డే టోర్నీని కొనసాగిస్తామంటూ మళ్లీ ప్రకటించింది. వరుసగా రెండోసారి వేదికగా ఇంగ్లండ్‌ను నిర్ణయించింది.

దాంతో ఎనిమిది అగ్రశ్రేణి జట్లు మాత్రమే పాల్గొనే ఈ మెగా ఈవెంట్‌ను మళ్లీ ఆస్వాదించే అవకాశం క్రికెట్‌ అభిమానులకు దక్కింది. 19 ఏళ్ల క్రితం నాకౌట్‌ ట్రోఫీగా మొదలై ఆ తర్వాత రెండు సార్లు ఫార్మాట్‌తో పాటు పేరు కూడా మార్చుకొని చివరకు టాప్‌–8 జట్ల చాంపియన్స్‌ ట్రోఫీగా ఇది స్థిరపడింది. ఆరంభంలో రెండేళ్ల వ్యవధిలోనే నిర్వహించగా, ఇప్పుడు దానిని కూడా నాలుగేళ్లకు మార్చారు. జూన్‌ 1 నుంచి చాంపియన్స్‌ ట్రోఫీ పోరు మొదలు కానున్న నేపథ్యంలో గత ఏడు టోర్నీల విశేషాలివిగో...


1998 (వేదిక: బంగ్లాదేశ్‌)
విజేత: దక్షిణాఫ్రికా, రన్నరప్‌: వెస్టిండీస్‌
ఒక్క మ్యాచ్‌ ఓడినా మళ్లీ కోలుకునే అవకాశం లేకుండా నాకౌట్‌ ఫార్మాట్‌లో ఈ టోర్నీ (స్పాన్సర్‌ పేరుతో విల్స్‌ ఇంటర్నేషనల్‌ టోర్నీగా వ్యవహరించారు) జరిగింది. మొత్తం 9 టెస్టు జట్లు పాల్గొన్నాయి. ఒక ప్రిక్వార్టర్‌ మ్యాచ్‌ తర్వాత నాలుగు క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లు నిర్వహించారు. సచిన్‌ సెంచరీ (141)తో ఆసీస్‌పై గెలిచి, సెమీస్‌ చేరిన భారత్‌... వెస్టిండీస్‌ చేతిలో ఓడింది. ఫైనల్లో వెస్టిండీస్‌ను 4 వికెట్లతో ఓడించి దక్షిణాఫ్రికా విజేతగా నిలిచింది. ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా గెలిచిన ఏకైక ఐసీసీ ఈవెంట్‌ ఇదే కావడం విశేషం.

2000 (వేదిక: కెన్యా)
విజేత: న్యూజిలాండ్, రన్నరప్‌: భారత్‌
రెండోసారి కూడా నాకౌట్‌ ఫార్మాట్‌ కొనసాగింది కానీ అదనంగా మరో రెండు జట్లు బంగ్లాదేశ్, కెన్యాలకు అవకాశం కల్పించి మూడు ప్రిక్వార్టర్‌ మ్యాచ్‌లు నిర్వహించారు. కెన్యా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలను ఓడించి భారత్‌ ఫైనల్‌ చేరింది. తుది పోరులో కివీస్‌ 4 వికెట్లతో భారత్‌ను ఓడించింది. గంగూలీ సెంచరీ (117) వృథా కాగా, క్రిస్‌ కెయిన్స్‌ (102) తమ జట్టును గెలిపించాడు. వన్డే చరిత్రలో న్యూజిలాండ్‌ జట్టు గెలిచిన ఐసీసీ టోర్నీ కూడా ఇదొక్కటే.

2002 (వేదిక: శ్రీలంక)
సంయుక్త విజేతలు: భారత్, శ్రీలంక
తొలిసారి చాంపియన్స్‌ ట్రోఫీ పేరుతో జరిగిన ఈ టోర్నీలో ఫార్మాట్‌ మారింది. 12 జట్లను (కొత్తగా నెదర్లాండ్స్‌) నాలుగు పూల్‌లుగా విభజించగా, పూల్‌ టాపర్‌ ఒక్కొక్కరు సెమీస్‌ చేరారు. జింబాబ్వే, ఇంగ్లండ్‌లపై నెగ్గిన భారత్, సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై 10 పరుగులతో గెలిచింది. భారత్, శ్రీలంక మధ్య జరిగిన ఫైనల్‌కు వర్షం అడ్డంకిగా నిలిచింది. రిజర్వ్‌ డే రోజు కూడా అదే తరహాలో రెండో ఇన్నింగ్స్‌ సాధ్యం కాకపోవడంతో ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు.

2004 (వేదిక: ఇంగ్లండ్‌)
విజేత: వెస్టిండీస్, రన్నరప్‌: ఇంగ్లండ్‌
మళ్లీ అదే 12 జట్లు, నాలుగు గ్రూప్‌ల ఫార్మాట్‌ కొనసాగగా, ఈసారి నెదర్లాండ్స్‌ స్థానంలో అమెరికా ఆడింది. కెన్యాపై గెలిచినా, పాకిస్తాన్‌ చేతిలో ఓడటంతో భారత్‌ సెమీస్‌ చేరడంలో విఫలమైంది. ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో బ్రియాన్‌ లారా నాయకత్వంలోని వెస్టిండీస్‌ 2 వికెట్లతో ఇంగ్లండ్‌ను ఓడించి విజేతగా నిలిచింది.

2006 (వేదిక: భారత్‌)
విజేత: ఆస్ట్రేలియా, రన్నరప్‌: వెస్టిండీస్‌
ఈసారి మళ్లీ ఫార్మాట్‌ మారింది. ర్యాంకింగ్స్‌లోని టాప్‌–6 జట్లతో పాటు ఈ టోర్నీ ఆరంభంలో నాలుగు జట్ల మధ్య క్వాలిఫయింగ్‌ పోటీలు నిర్వహించారు. బంగ్లాదేశ్, జింబాబ్వేలను వెనక్కి తోసి వెస్టిండీస్, శ్రీలంక అర్హత సాధించాయి. ఎనిమిది జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించగా, టాప్‌–2 జట్లు సెమీస్‌ చేరాయి. ఇంగ్లండ్‌పై గెలిచినా... వెస్టిండీస్, ఆస్ట్రేలియా చేతుల్లో ఓడటంతో భారత్‌ మళ్లీ సెమీస్‌కు చేరలేకపోయింది. ఫైనల్లో విండీస్‌ను 8 వికెట్లతో చిత్తు చేసి ఆసీస్‌ తొలిసారి ఈ ట్రోఫీని గెలుచుకుంది. బహుమతి ప్రదానోత్సవంలో నాటి ఐసీసీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ను వేదికపై నుంచి ఆసీస్‌ ఆటగాళ్లు తోసేయడం వివాదాస్పదమైంది.

2009 (వేదిక: దక్షిణాఫ్రికా)
విజేత: ఆస్ట్రేలియా, రన్నరప్‌: న్యూజిలాండ్‌
షెడ్యూల్‌ ప్రకారం 2008లోనే పాకిస్తాన్‌లో ఈ టోర్నీ జరగాల్సి ఉన్నా... అక్కడి పరిస్థితుల కారణంగా సాధ్యం కాకపోవడంతో ఏడాది ఆలస్యంగా వేదిక మార్చి నిర్వహించారు. లీగ్‌ దశలో విండీస్‌పై గెలిచి, పాకిస్తాన్‌ చేతిలో ఓడిన భారత్‌... వర్షంతో ఆసీస్‌ మ్యాచ్‌ రద్దు కావడంతో వరుసగా మూడో సారి సెమీస్‌ అవకాశాలు కోల్పోయింది. ఫైనల్లో న్యూజిలాండ్‌ను 6 వికెట్లతో ఓడించి ఆసీస్‌ తమ ఖాతాలో మరోసారి టైటిల్‌ను వేసుకుంది.

2013 (వేదిక: ఇంగ్లండ్‌)
విజేత: భారత్, రన్నరప్‌: ఇంగ్లండ్‌
ధోని సారథ్యంలోని భారత జట్టు అద్భుత ప్రదర్శనతో ఈ టోర్నీలో అజేయంగా నిలిచింది. తమ గ్రూప్‌లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, పాకిస్తాన్‌లను జట్టు వరుసగా ఓడించింది. సెమీస్‌లో శ్రీలంకపై కూడా సునాయాసంగా గెలిచిన టీమిండియా... వర్షం కారణంగా 20–20 ఓవర్ల ఆట మాత్రమే జరిగిన ఫైనల్లో ఆతిథ్య దేశం ఇంగ్లండ్‌పై 5 పరుగులతో నెగ్గింది.

విండీస్‌ లేకుండా...
2017 టోర్నీలో పాల్గొనే టాప్‌–8 జట్ల కోసం 30 సెప్టెంబర్‌ 2015 వరకు ఉన్న ర్యాంకింగ్‌ కటాఫ్‌ను తీసుకున్నారు. ఎనిమిదో స్థానంలో నిలిచిన బంగ్లాదేశ్‌ 2006 తర్వాత మళ్లీ అర్హత సాధించగా... 9వ ర్యాంక్‌కు పడిపోయిన మాజీ చాంపియన్‌ వెస్టిండీస్‌ తొలిసారి టోర్నీకి దూరమైంది.

ఓవరాల్‌గా భారత్‌ రికార్డు: చాంపియన్స్‌ ట్రోఫీలో మొత్తం 24 మ్యాచ్‌లు ఆడిన భారత్, 15 మ్యాచ్‌లు
గెలిచి 6 ఓడింది. మరో
3 మ్యాచ్‌లలో ఫలితం
తేలలేదు.

Advertisement
 
Advertisement
Advertisement