భారత్‌ 285 ఆలౌట్‌ | India bowled out for 285 in the womens only Test at Lords | Sakshi
Sakshi News home page

భారత్‌ 285 ఆలౌట్‌

Jul 11 2026 1:07 AM | Updated on Jul 11 2026 1:07 AM

India bowled out for 285 in the womens only Test at Lords

మెరిసిన స్మృతి, హర్మన్, దీప్తి

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 21/1

లార్డ్స్‌లో మహిళల ఏకైక టెస్టు  

లండన్‌: మహిళల టి20 ప్రపంచకప్‌లో గ్రూప్‌ దశలోనే వైదొలిగిన భారత క్రికెట్‌ జట్టు... ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టులో మెరుగైన ప్రదర్శన చేస్తోంది. సుదీర్ఘ చరిత్ర గల లార్డ్స్‌ మైదానంలో జరుగుతున్న మహిళల తొలి టెస్టులో హర్మన్‌ప్రీత్‌ సారథ్యంలోని టీమిండియా ఫర్వాలేదనిపించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 74.5 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ స్మృతి మంధాన (108 బంతుల్లో 83; 11 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్  హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (121 బంతుల్లో 58; 7 ఫోర్లు), ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ (87 బంతుల్లో 57; 7 ఫోర్లు) ఆర్ధశతకాలతో రాణించారు. 

ఈ ముగ్గురు సీనియర్‌ ప్లేయర్లు ఆచితూచి ఆడగా... మిగిలినవాళ్లు ఎక్కువసేపు నిలవలేకపోయారు. షఫాలీ వర్మ (0) డకౌట్‌ కాగా... యస్తిక భాటియా (12), రిచా ఘోష్‌ (13), స్నేహ్‌ రాణా (13) విఫలమయ్యారు. జెమీమా రోడ్రిగ్స్‌ (38 బంతుల్లో 35; 5 ఫోర్లు) వేగంగా ఆడింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో సోఫీ ఎకిల్‌స్టోన్‌ 3 వికెట్లు పడగొట్టగా... లౌరన్‌ ఫిలెర్, ఇస్సీ వాంగ్, మ్యాడీ విలియర్స్‌ తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 11 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 21 పరుగులు చేసింది. 

చేతిలో 9 వికెట్లు ఉన్న ఆతిథ్య జట్టు... టీమిండియా స్కోరుకు ఇంకా 264 పరుగులు వెనుకబడి ఉంది. కెరీర్‌లో చివరి టెస్టు ఆడుతున్న టామీ బ్యూమాంట్‌ (2) విఫలం కాగా... మైయా (17 బ్యాటింగ్‌), హీతర్‌ నైట్‌ (1 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్‌ ఒక వికెట్‌ తీసింది. ఈ మ్యాచ్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసింది. మ్యాచ్‌ ఆరంభానికి ముందు శ్రీచరణికి వైస్‌ కెప్టెన్ స్మృతి మంధాన టెస్టు క్యాప్‌ అందజేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement