ప్రేక్షకులు లేకుండా... ఒకే మైదానంలో... 

Australia Planning To Play Five Match Test Series Against India - Sakshi

భారత్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడే ఆలోచనలో ఆస్ట్రేలియా

కరోనా నేపథ్యంలో ఆర్థిక సమస్యలను అధిగమించే ప్రయత్నం

సిడ్నీ: భారత్‌తో సిరీస్‌ అంటే ఏ జట్టుకైనా ఆర్థికపరంగా పండుగే. భారీ టీవీ హక్కులతో పాటు ప్రేక్షకాదరణ కూడా అద్భుతంగా ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత ఎక్కువ టీమిండియాతో తలపడేందుకు అన్ని జట్లూ ప్రయత్నిస్తాయి. అందుకు ఆస్ట్రేలియాలాంటి పెద్ద జట్టు కూడా అతీతం కాదు. కోవిడ్‌–19 నేపథ్యంలో ఆర్థికపరంగా భారీ నష్టాలకు గురవుతున్న ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు (సీఏ) ఈ ఏడాది చివర్లో భారత్‌తో జరిగే టెస్టు సిరీస్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరాదని భావిస్తోంది. కరోనా వైరస్‌ వ్యాప్తి ఈ సిరీస్‌ జరగడంపై సందేహాలు రేకెత్తుతుండటంతో సిరీస్‌ నిర్వహించేందుకు ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తోంది. అవసరమైతే మైదానంలోకి ప్రేక్షకులను అనుమతించకుండా కూడా టెస్టు సిరీస్‌ ఆడించాలని సీఏ భావిస్తోంది. అదే తరహాలో వేర్వేరు వేదికలపై కాకుండా ఒకే చోట కూడా సిరీస్‌ నిర్వహించే ప్రతిపాదన ఉంది. ఈ సిరీస్‌లో నాలుగు టెస్టులే జరగాల్సి ఉండగా... నష్టం పూడ్చుకునే క్రమంలో అదనంగా మరో మ్యాచ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ను జరపాలని కూడా భావిస్తోంది. సీఏ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కెవిన్‌ రాబర్ట్స్‌ ఈ విషయాలు వెల్లడించారు.

కరోనా నేపథ్యంలో సీఏ సుమారు 20 మిలియన్‌ ఆస్ట్రేలియన్‌ డాలర్ల నష్టం ఎదుర్కొనే ప్రమాదం కనిపిస్తోంది. ‘ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త తరహాలోనైనా సరే భారత్‌తో సిరీస్‌ కోసం అందుబాటులో ఉన్న అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నాం. బీసీసీఐ, భారత క్రికెటర్లు, సహాయక సిబ్బంది మద్దతుతో ఒక అద్భుతమైన సిరీస్‌ నిర్వహించాలనేది మా ఆలోచన. మైదానంలో ప్రేక్షకులు ఉన్నా లేకున్నా సరే ఇది కొనసాగాలని కోరుకుంటున్నాం. వీటిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు కానీ బీసీసీఐతో పూర్తి స్థాయిలో చర్చిస్తాం. సిరీస్‌ను ఐదు టెస్టులకు పొడిగించడం కూడా అందులో ఒకటి. మన చేతుల్లో లేనిదాని గురించి ఏమీ చేయలేం కానీ ఇప్పుడు ఏం చేయాలో కొత్తగా ఆలోచించాలి కదా’ అని ఆయన అన్నారు. ఒకవేళ ఒకే చోట సిరీస్‌ జరిగితే అందుకు అడిలైడ్‌ వేదిక కావచ్చు. స్టేడియానికి అనుబంధంగా కొత్తగా నిర్మించిన హోటల్‌లోనే క్రికెటర్లందరినీ ఉంచాలనేది సీఏ ఆలోచన. మరోవైపు అక్టోబర్‌లోనే జరగాల్సిన టి20 ప్రపంచకప్‌ నిర్వహణ విషయంలో కూడా ఆస్ట్రేలియా బోర్డులో ఆందోళన పెరుగుతోంది. సమయానికి నిర్వహించడం సాధ్యమవుతుందా లేదంటే ఇతర ప్రత్యామ్నాయాలు చూడాలా అనే అంశంపై చర్చిస్తున్నామని, ఇంకా ఎలాంటి స్పష్టతా రాలేదని సీఏ పేర్కొంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top