నేడు ‘బాక్సింగ్‌ డే’ టెస్టుల షురూ | Australia And New Zealand Set To Play Boxing Day Test | Sakshi
Sakshi News home page

నేడు ‘బాక్సింగ్‌ డే’ టెస్టుల షురూ

Dec 26 2019 1:39 AM | Updated on Dec 26 2019 1:39 AM

Australia And New Zealand Set To Play Boxing Day Test  - Sakshi

వార్నర్‌ ప్రాక్టీస్‌

మెల్‌బోర్న్‌: ఆ్రస్టేలియా టాపార్డర్‌ బ్యాట్స్‌మన్‌ లబ్ షేన్ ను అరుదైన సెంచరీ చాన్స్‌ ఊరిస్తోంది. అతను గత మూడు టెస్టుల్లోనూ శతకం సాధించాడు. ఇప్పుడు ఇక్కడా శతక్కొడితే... వరుసగా నాలుగు టెస్టుల్లో సెంచరీలు చేసిన ఆరో ఆ్రస్టేలియన్‌గా నిలుస్తాడు. ఈ జాబితాలో బ్రాడ్‌మన్‌ మూడుసార్లు ఈ ఘనతకెక్కాడు. తర్వాత ఫింగ్లెటన్, హార్వీ, హేడెన్, స్మిత్‌ వరుసగా నాలుగు టెస్టుల్లో సెంచరీలు చేశారు. మరోవైపు తొలి టెస్టు పరాజయంతో సిరీస్‌లో వెనుకబడిన న్యూజిలాండ్‌ ‘బాక్సింగ్‌ డే’ టెస్టులో ప్రతాపం చూపాలని గట్టి పట్టుదలతో ఉంది.

అయితే కివీస్‌కు మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ (ఎంసీజీ) ఎప్పుడూ కలిసి రాలేదు. ఇక్కడ మూడు మ్యాచ్‌లాడిన న్యూజిలాండ్‌ రెండు ఓడి, ఒకదాంట్లో ‘డ్రా’ చేసుకుంది. కానీ ఈసారి ఆ రికార్డును మార్చేపనిలో ఉంటామని న్యూజిలాండ్‌ కెపె్టన్‌ విలియమ్సన్‌ అన్నాడు. ఆతిథ్య జట్టేమో ఈ మ్యాచ్‌ కూడా గెలిచి... మరోటి మిగిలుండగానే మూడు టెస్టుల సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకోవాలని ఆశిస్తోంది.  మెల్‌బోర్న్‌లాంటి బౌన్సీ వికెట్‌ పిచ్‌లపై ఐదుగురు బౌలర్లను బరిలోకి దించాలని యోచిస్తోంది. హాజెల్‌వుడ్‌ స్థానంలో ప్యాటిన్సన్‌ తుది జట్టులోకి వచ్చాడు. కమిన్స్, స్టార్క్, లయన్‌లతో ఐదో బౌలర్‌గా మైకెల్‌ నెసెర్‌ను తీసుకునే అవకాశముందని కోచ్‌ లాంగర్‌ చెప్పాడు.

సెంచూరియన్‌: గాయాలతో సతమతమవుతున్న ఇంగ్లండ్‌... ఆతిథ్య దక్షిణాఫ్రికాతో తొలిటెస్టుకు సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య గురువారం నుంచి ‘బాక్సింగ్‌ డే’ పోరు జరగనుంది. పేస్‌ బౌలర్లు స్టువర్ట్‌ బ్రాడ్, జోఫ్రా ఆర్చర్, క్రిస్‌ వోక్స్, స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌... ఇలా కీలక ఆటగాళ్లు ‘ఫ్లూ జ్వరాలతో బాధపడుతున్నారు. తన తండ్రి అనారోగ్యం కారణంగా స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ కూడా ఆడేది అనుమానంగా మారింది. ఇది ఇంగ్లిష్‌ జట్టు కూర్పునకు పెను సమస్యగా మారింది. అయితే అందుబాటులో ఉన్న ఆటగాళ్లు సత్తాచాటేందుకు సిద్ధంగా ఉన్నారని కెపె్టన్‌ జో రూట్‌ తమ జట్టులో స్థైర్యాన్ని పెంచే ప్రకటన చేశాడు.

రూట్, డుప్లెసిస్‌

మరోవైపు సొంతగడ్డపై బలంగా కనబడుతున్న దక్షిణాఫ్రికా జట్టు మొదటి రోజు నుంచే ‘దెబ్బ’తిన్న ఇంగ్లండ్‌పై పైచేయి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ టెస్టుతో తమ బ్యాట్స్‌మన్‌ రస్సీ వాన్‌డెర్‌ డస్సెన్‌ అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేస్తాడని దక్షిణాఫ్రికా కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ తెలిపాడు. అలాగే ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ ప్రిటోరియస్‌ కూడా అరంగేట్రం చేసే అవకాశముందని చెప్పాడు. ఐసీసీ టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగమైన ఈ సిరీస్‌లో ఇరు జట్లు నాలుగు టెస్టు మ్యాచ్‌ల్లో తలపడతాయి. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 56 పాయింట్లతో ఆరో స్థానంలో ఉండగా... దక్షిణాఫ్రికా ఇంకా ఖాతానే తెరువకపోవడంతో అట్టడుగున 9వ స్థానంలో ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement