రాష్ట్రంలో రాక్షస పాలన

YV Subba Reddy Slams On Chandrababu Naidu Government - Sakshi

యర్రగొండపాలెం(ప్రకాశం): రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, ప్రజలకు కనీసం తాగు, సాగునీరు ఇవ్వలేని పరిస్థితుల్లో టీడీపీ ప్రభుత్వం ఉందని ఒంగోలు పార్లమెంటు మాజీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. వెలిగొండ సాధన కోసం వైవీ చేపట్టిన ప్రజా పాదయాత్ర 12వ రోజు ఆదివారం దర్శి నియోజకవర్గం దొనకొండ మండలంలోని కట్టకిందిపాలెం నుంచి ప్రారంభమై గుండ్లకమ్మ మీదుగా యర్రగొండపాలెం నియోజకవర్గంలోని కంభంపాడు క్రాస్‌రోడ్డు నుంచి యాత్ర కొనసాగింది. పెద్దారవీడు మండలంలోని తోకపల్లి గ్రామంలో ఆయన వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలవేసి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేస్తున్న ఈ ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టుకు నిధులు కేటాయించకుండా జాప్యం చేస్తోందని ఆయన విమర్శించారు.

జిల్లాలో నాలుగేళ్లుగా కరువు విలయ తాండవం చేస్తుందని, 700 అడుగుల లోతు బోరు వేసినా నీరు పడే పరిస్థితి లేదని ఆయన అన్నారు. నీరుపడినా అవి తాగేందుకు ఉపయోగపడటం లేదని వైవీ ఆవేదన వ్యక్తపరిచారు. జిల్లాలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి వెలిగొండ ప్రాజెక్టుకు నిధులు కేటాయించి పనులు వేగవంతం చేశారని, అప్పట్లోనే దాదాపు 70 శాతం పనులు పూర్తయ్యాయని ఆయన అన్నారు. 2014లో అబద్ధపు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన టీడీపీ.. ప్రాజెక్టుకు నిధులు కేటాయించకుండా తీవ్ర జాప్యం చేసిందని ఆయన అన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో సంక్రాంతి నాటికి జిల్లా ప్రజలకు వెలిగొండ ప్రాజెక్టు నుంచి సాగర్‌ జలాలు అందిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే వెలిగొండ ప్రాజెక్టు పూర్తవుతుందని, ఆ ప్రాజెక్టు కింద ఉన్న భూములు సస్యశ్యామలం అవుతాయని, ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడే పరిస్థితి ఉండదని ఆయన అన్నారు. రాష్ట్రాభివృద్ధిని దృష్టిలోపెట్టుకొని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేస్తున్నారని, మాటతప్పని నాయకుడు జగన్‌ను సీఎంను చేసుకోవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు.
 
కల్లబొల్లి మాటలు చెప్తారు..నమ్మకండి:
ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు కల్లబొల్లి మాటలు చెప్పటానికి మీ ముందుకు వస్తారని, వాటిని నమ్మి మరోసారి మోసపోవద్దని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ అన్నారు. వైవీ చేపట్టిన ప్రజా పాదయాత్రకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అభివృద్ధి చెందటానికి ప్రత్యేక హోదాతోపాటు రాజకీయ అనుభవమున్న నారా చంద్రబాబునాయుడు సీఎం అయ్యాడని అందరూ సంబరపడ్డారని, కానీ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని, ఎన్నికల ముందు చేసిన 600 హామీల్లో ఏఒక్క హామీ నెరవేర్చలేదని ఆయన అన్నారు.  రాష్ట్రాభివృద్ధికి, ప్రత్యేక హోదా కోసం వైవీ తన పదవిని త్యజించారని, ఇప్పుడు ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వెలిగొండ సాధన కోసం ప్రజల్లో చైతన్యం తీసుకొని రావడం కోసం పాదయాత్ర చేపట్టడం అభినందించదగిన విషయమని ఆయన అన్నారు.

వెలిగొండ ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, పాలకుల కళ్లు తెరిపించాలన్న ఉద్దేశంతో వైవీ ప్రజా చైతన్య పాద యాత్రను ప్రారంభించారని వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ అన్నారు.  పర్సంటేజీల కోసం టీడీపీ ప్రభుత్వం కొత్త కాంట్రాక్టర్లకు అప్పచెప్పటానికి ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు. జగన్‌ సీఎం అయితేనే వెలిగొండ ప్రాజెక్టు పూర్తవుతుందని, తీవ్ర కరువు కాటకాలతో అలమటిస్తున్న పశ్చిమ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంద అన్నారు. కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి, వైఎస్సార్‌ సీపీ పర్చురు నియోజకవర్గ ఇన్‌చార్జి రావి రమనాధబాబు, కో ఆపరేటివ్‌ సొసైటీ మాజీ చైర్మన్‌ మేదరమెట్ల శంకరరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ కోట్ల సుబ్బారెడ్డి, కాపు రిజర్వేషన్‌ పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా ప్రభాకర్, ఏవన్‌ గ్లోబల్‌ విద్యాసంస్థల అధినేత షంషీర్‌ఆలీబేగ్, జెడ్పీటీసీ సభ్యులు దుగ్గెంపూడి వెంకటరెడ్డి, అమిరెడ్డి రామిరెడ్డి, ఎంపీపీ చేదూరి విజయభాస్కర్, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర, జిల్లా నాయకులు కె.వి.రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, పాలిరెడ్డి కృష్ణారెడ్డి, దొంతా కిరణ్‌గౌడ్, ఉడుముల శ్రీనివాసరెడ్డి, చుండూరు రవి, జంకె ఆవులరెడ్డి, లక్ష్మీబాయి, అరుణాబాయి, సావిత్రి, రవణమ్మ పాల్గొన్నారు.
 
పాదయాత్ర సాగిందిలా..
ప్రజా పాదయాత్ర ఆదివారం దొనకొండ మండలంలోని కట్టకిందిపాలెంలో ఉదయం 9.40 గంటలకు ప్రారంభమైంది. యర్రగొండపాలెం నియోజకవర్గం పెద్దారవీడు మండలంలోని తంగిరాలపల్లెక్రాస్‌ రోడ్డులోకి 10.45 గంటలకు ప్రవేశించింది. కంభంపాడు క్రాస్‌రోడ్డు సమీపానికి చేరుకొని భోజన విరామం తీసుకున్నారు. తిరిగి 3.15 గంటలకు పాదయాత్ర ప్రారంభమైంది. తోకపల్లి ఎస్సీ కాలనీ, తోకపల్లి గ్రామం, రాజంపల్లి ఎస్సీ కాలనీ, చట్లమిట్ల క్రాస్‌రోడ్‌ వరకు సాగి రాత్రి 6.10 గంటలకు ముగిసింది. 12వరోజు 18.70 కిలోమీటర్లు సాగింది.

నేటి షెడ్యూల్‌..
సోమవారం ఉదయం చట్లమిట్ల క్రాస్‌రోడ్‌ నుంచి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి కర్రోల క్రాస్‌రోడ్, మద్దెలకట్ట క్రాస్‌రోడ్, సానికవరం, పెద్దదోర్నాల మండలంలోని చిన్నగుడిపాడుకు సమీపంలోకి చేరుకొని భోజన విరామం తీసుకొని తిరిగి 3.15 గంటలకు పాదయాత్ర చిన్నదోర్నాల అడ్డరోడ్డు, జమ్మిదోర్నాల క్రాస్‌రోడ్డు, హసనాబాద్‌ క్రాçస్‌రోడ్‌ మీదుగా పెద్దదోర్నాల సమీపంలో రాత్రి బస చేస్తారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top