చంద్రబాబు, పవన్‌ డీఎన్‌ఏ ఒక్కటే | YSRCP MLA Ambati Rambabu Fires On Pawan Kalyan | Sakshi
Sakshi News home page

చంద్రబాబు, పవన్‌ డీఎన్‌ఏ ఒక్కటే

Oct 25 2019 4:56 AM | Updated on Oct 25 2019 4:57 AM

YSRCP MLA Ambati Rambabu Fires On Pawan Kalyan - Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ డీఎన్‌ఏ ఒకేలా ఉందని, అందుకే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను ఉద్దేశించి ఉదయం చంద్రబాబు ఏం విమర్శలు చేస్తున్నారో.. సాయంత్రానికి పవన్‌ కూడా అవే విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కుట్రలు, కుతంత్రాలను అధిగమించి పోరాడి వైఎస్సార్‌సీపీని గెలిపించిన ధీరుడు వైఎస్‌ జగన్‌ అని, ఆయనను విమర్శించే నైతిక అర్హత పవన్‌కు లేదని అన్నారు. పవన్‌ బాధ్యతాయుతంగా మాట్లాడాలన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ ఇటీవల ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిషాను కలిసి రాష్ట్ర సమస్యలు వివరిస్తే.. ఆయన సానుకూలంగా స్పందించారని, చేదోడు వాదోడుగా ఉంటామని హామీ ఇచ్చారని రాంబాబు పేర్కొన్నారు.

కానీ విపక్ష నేత చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి విమర్శలు చేయడం పూర్తిగా బాధ్యతారాహిత్యం అని అన్నారు. కేసులు విచారణలో ఉన్నాకూడా చంద్రబాబు పదే పదే ముఖ్యమంత్రిని నేరస్తుడని అంటున్నారని, పవన్‌ మరో పక్క వంత పాడుతున్నారని రాంబాబు విమర్శించారు. వైఎస్‌ జగన్‌పై కేసులు ఎందుకు, ఎలా, ఎప్పుడు పెట్టారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని రాంబాబు చెప్పారు. చంద్రబాబు చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకుని జగన్‌పై కేసులు పెట్టించిన విషయం పవన్‌కు తెలియదా? అని ప్రశ్నించారు. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో జగన్‌ తిరుగులేని రాజకీయవేత్తగా ఎదిగారన్నారు. రాష్ట్ర ప్రజలు 151 సీట్లలో పార్టీని గెలిపించి జగన్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని, అలాంటి ముఖ్యమంత్రి అర్హతలను గురించి మాట్లాడే అధికారం పవన్‌కు ఎవరిచ్చారని నిలదీశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పోలీసు వ్యవస్థలను చట్టప్రకారం నడుచుకునే విధంగా చక్కదిద్దారని అన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement