వింజమూరులో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీని కిడ్నాప్ చేయడానికి బలవంతంగా కారులోకి నెడుతున్న దృశ్యం
వింజమూరు, బొమ్మనహాళ్‌లో పచ్చమూకల దాష్టీకం
గూండాగిరి, దౌర్జన్యాలతో ఏకపక్షంగా ఎంపీపీ ఎన్నిక
వింజమూరులో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అపహరణ
మరో మహిళా ఎంపీటీసీపై దాడి.. ఇంకో ఎంపీటీసీ నిర్బంధం
ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అరాచకం
టీడీపీ ఆగడాలతో వైఎస్సార్‌సీపీ సభ్యుల వాకౌట్
బలం లేకున్నా బరిలో దిగి.. ఓడిపోతామని తెలిసి.. ఎంపీపీ ఉప ఎన్నికలో టీడీపీ బరితెగించింది. వారి ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో... ఖాకీల సాక్షిగా... గూండాగిరి, దౌర్జన్యాలకు తెగబడింది. వైఎస్సార్‌సీపీ సభ్యుల కిడ్నాప్.. దాడులు.. నిర్బంధాలతో ప్రజాస్వామ్యాన్ని పచ్చమూక ఖూనీ చేసింది. సోమవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరు, అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్ ఎంపీపీ ఉప ఎన్నికలలో అధికార పార్టీ ఆగడాలకు అంతులేకుండా పోయింది.. అడ్డదారుల్లో వెళ్లి పచ్చ పార్టీ అక్రమంగా గెలుపును ఖాతాలో వేసుకుంది. ‘రెడ్‌బుక్’ రాజ్యాంగాన్ని ప్రయోగించి దొడ్డిదారిన పదవులు దక్కించుకోవడం విస్తుపోయేలా చేసింది.
సాక్షి టాస్క్‌ఫోర్స్, వింజమూరు (ఉదయగిరి): పోలీసుల సమక్షంలోనే వింజమూరు ఎంపీపీ ఉప ఎన్నికలో టీడీపీ శ్రేణులు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులపై దౌర్జన్యం చేశాయి. ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఎంపీడీవో కార్యాలయంలో తిష్టవేసి దీన్నంతటినీ నడిపించారు. ఆయన కనుసన్నల్లో వైఎస్సార్‌సీపీకి చెందిన ఊటుకూరు ఎంపీటీసీ సభ్యుడు జి.మల్లికార్జునను బలవంతంగా లాక్కెళ్లి కారులో ఎక్కించి కిడ్నాప్ చేశారు. మరో ఎంపీటీసీ, మాజీ ఎంపీపీ అయిన ఇనగలూరి మోహన్‌రెడ్డిని పోలీసులు నిర్బంధించారు. తాత్కాలిక ఎంపీపీ అన్నంగి రమణయ్య వైఎస్సార్‌సీపీకి మద్దతు తెలుపుతారనే అనుమానంతో అజ్ఞాతంలోకి తీసుకెళ్లారు. నల్గొండ్ల ఎంపీటీసీ ఉంటా రత్నమ్మనూ కిడ్నాప్ చేసేందుకు బరితెగించారు.
ఈ క్రమంలో పెనుగులాటలో ఆమె చేతికి గాయమైంది. అయినా లెక్కచేయకుండా ప్రతిఘటించారు. వైఎస్సార్‌పీపీ ఎంపీపీ అభ్యర్థి పల్లాల కొండారెడ్డి, ఎంపీటీసీ డేగా వంశీ, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు రేవునూరి శ్రీనివాసరెడ్డిలు... టీడీపీ దౌర్జన్యాన్ని అడ్డుకుని రత్నమ్మను రక్షించారు. తమ సభ్యుడిని కిడ్నాప్ చేశారంటూ కొండారెడ్డి మిగతా ఎంపీటీసీలతో ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. దౌర్జన్యాన్ని ఎన్నికల అధికారి నిర్మలాదేవికి వివరించి, ఎన్నిక వాయిదా వేయాలని కోరారు. కానీ, కోరం ఉందని ఎన్నికల అధికారులు చెప్పడంతో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు వాకౌట్ చేశారు. ఎన్నికల పరిశీలకులు, జేసీ మొగిలి వెంకటేశ్వర్లుకు విషయం మొత్తం చెప్పినా ఫలితం లేకపోయింది.
2 నిమిషాల్లో సభ వాయిదా పడుతుందనగా...
ఉప ఎన్నిక ఉదయం 11కు ప్రారంభమవుతుందనగా 10.30కు ఐదుగురు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు బంగ్లా సెంటర్ చేరుకున్నారు. పోలీసులు వారి కారులో కాకుండా నడిచివెళ్లాలని చెప్పారు. ఇంతలో టీడీపీ శ్రేణులు అడ్డుకుని దౌర్జన్యం చేశాయి. ఇద్దరు సభ్యుల కిడ్నాప్‌నకు ప్రయత్నించి.. ఒకరిని లాక్కెళ్లారు. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. టీడీపీ ఎంపీటీసీలను వారి వాహనంలో తీసుకొచ్చారు. కాగా, ఎంపీపీ ఎన్నికకు ఆరుగురు సభ్యుల కోరం అవసరం. నలుగురు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు బాయ్‌కాట్ చేశారు. టీడీపీ తరఫున ఐదుగురే మిగిలారు. సమావేశం వాయిదా పడేందుకు 2 నిమిషాలు ఉందనగా తాత్కాలిక ఎంపీపీ రమణయ్యను పోలీసులు దొడ్డిదారిన తీసుకొచ్చారు. కోరం ఉందంటూ సమావేశం నిర్వహించి వనిపెంట హైమావతిని ఎంపీపీగా ఏకగ్రీవంగా ప్రకటించి ప్రమాణ స్వీకారం చేయించారు.
బొమ్మనహాళ్‌లో ‘పచ్చ’ మూక దాష్టీకం ‘కాలవ’ రౌడీయిజం.. అడుగడుగునా ఆంక్షలు
బొమ్మనహాళ్ ఎంపీపీ ఉప ఎన్నిక టీడీపీ అరాచకాలకు పరాకాష్టగా నిలిచింది. ఆ పార్టీకి సంఖ్యా బలం లేకపోయినా ఏడుగురు ఎంపీటీసీ సభ్యులతోనే ఎన్నిక పూర్తి చేశారు. గత ఎన్నికల్లో 16 ఎంపీటీసీ స్థానాలకు గాను 15 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ, ఒకచోట ఇండిపెండెంట్ గెలిచారు. వైఎస్సార్‌సీపీ సభ్యురాలు పద్మావతి ఎంపీపీ అయ్యారు. ఇటీవల ఆమె రాజీనామా చేశారు. టీడీపీ నాయకుల ప్రలోభాలు, ఇతర కారణాలతో నలుగురు ఆ పార్టీ వైపు మొగ్గుచూపారు. స్వతంత్ర అభ్యర్థితో కలిపి టీడీపీ బలం 5 మాత్రమే. ఈ క్రమంలో ఎంపీపీ ఎన్నిక కోసం క్యాంపులో ఉన్న 8 మంది ఎంపీటీసీ సభ్యులను తీసుకుని బొమ్మనహాళ్ బయల్దేరిన వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి అడుగడుగునా పోలీసు ఆంక్షలు, టీడీపీ నేతల దౌర్జన్యాలను ఎదుర్కొన్నారు. ఆయనతో ఉన్న వైఎస్సార్‌సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎంపీ తలారి రంగయ్య, నాయకులను పోలీసులు కణేకల్లు క్రాస్‌లోనే అడ్డుకున్నారు.
రిటర్నింగ్ అధికారి గంగాధర ఉదయం 10 గంటలకు ఎన్నిక ప్రారంభించారు. వైఎస్సార్‌సీపీ నుంచి ఉద్దేహాళ్ ఎంపీటీసీ కరూరు కల్పన, టీడీపీ అభ్యర్థిగా ఉప్పరహాళ్ ఎంపీటీసీ ముల్లంగి నాగమణి పోటీపడ్డారు. ప్రత్యేక ఆహ్వానితులుగా రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, ఎంపీ అంబికాలక్ష్మీనారాయణ హాజరయ్యారు. దర్గాహొన్నూరు ఎంపీటీసీ–1 నాగరత్నమ్మ (వైఎస్సార్‌సీపీ) గైర్హాజరవగా, ఎన్నిక సమయంలో ఇద్దరు సభ్యులు టీడీపీ వైపు మొగ్గుచూపారు. చివరకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి 8 మంది, టీడీపీకి ఏడుగురు మద్దతుగా నిలిచారు.
టీడీపీ ఓటమిని గుర్తించిన ఎమ్మెల్యే కాలవ... దేవగిరి ఎంపీటీసీ సభ్యుడు అనుమేష్‌ను బయటకు పిలిచి మద్దతు తెలపాలని చాలా సమయం తీవ్రస్థాయిలో ఒత్తిడి చేశారు. ఈ విషయాన్ని అనుమేష్ మీడియాకు స్వయంగా తెలిపారు. కాగా, ఎమ్మెల్యే వైఖరితో మనస్తాపం చెందడంతో పాటు సహనం కోల్పోయిన ఏడుగురు వైఎస్సార్‌సీపీ సభ్యులు కార్యాలయం నుంచి బయటకు వచ్చేశారు. ఇదే అదనుగా భావించి ఉన్నవారితో కోరం చూపి ఎంపీపీ ఎన్నికను పూర్తిచేశారు. క్షణాల వ్యవధిలోనే టీడీపీ అభ్యర్థి చేతిలో డిక్లరేషన్ పెట్టారు.
మెట్టు వాహనంపై టీడీపీ గూండాల రాళ్ల దాడి
మండల పరిషత్ నుంచి బయటకు వచ్చేసిన వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు.. మెట్టు గోవిందరెడ్డిని కలిశారు. ఆయన వారిని వెంటబెట్టుకుని జరిగిన అన్యాయంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు అనంతపురం బయలుదేరారు. దేవగిరి వద్ద టీడీపీ గూండాలు మెట్టు వాహనంపైకి రాళ్లు రువ్వారు. వాహనం దెబ్బతినగా.. డ్రైవర్ చాకచక్యంతో ప్రమాదం తప్పింది. కాగా, ఎంపీపీ ఎన్నిక నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి టీడీï³ దౌర్జన్యపూరిత వైఖరి తమను తీవ్ర ఆందోళనకు గురిచేసిందని వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులు వాపోయారు. టీడీపీ ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ఎన్నికను ఏకపక్షం చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యే కాలవ దౌర్జన్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యానికి పాతర: మెట్టు మండిపాటు
‘‘మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక రాక్షస రాజ్యంలో ఉన్నామా? ఎంపీపీ ఎన్నికలో నైతిక విజయం వైఎస్సార్‌సీపీ. కోరం లేకున్నా గెలిచినట్టు ప్రకటించుకోవడం సిగ్గుచేటు. రక్షణగా నిలవాల్సిన పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు. మాకు ఆంక్షలు, అడ్డంకులు విధించి, టీడీపీ నాయకులకు మాత్రం గేట్లు తెరిచారు’’ అని మెట్టు గోవిందరెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు..మండల పరిషత్‌లోకి వెళ్లి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను బెదిరిస్తున్నా పోలీసులు అడ్డుకోలేదని అన్నారు. తమపై దాడులకు పాల్పడినవారిపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికను రద్దుచేసి న్యాయబద్ధంగా మళ్లీ నిర్వహించాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేస్తామన్నారు.


