కాళేశ్వరం కడుతున్నప్పుడు ఏం చేశారు? | YS Jagan Fires On Chandrababu In Assembly Over Kaleshwaram Project | Sakshi
Sakshi News home page

కాళేశ్వరం కడుతున్నప్పుడు ఏం చేశారు?

Jul 12 2019 4:23 AM | Updated on Jul 12 2019 12:07 PM

YS Jagan Fires On Chandrababu In Assembly Over Kaleshwaram Project - Sakshi

సాక్షి, అమరావతి: ‘తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టును కడుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్నది ఎవరు? దానిని అడ్డుకోవాల్సింది ఎవరు? ఆ ప్రాజెక్టు కడుతున్నప్పుడు ఒక్క మాటయినా మాట్లాడారా? హరికృష్ణ భౌతికకాయాన్ని పక్కనే పెట్టుకుని కేటీఆర్‌తో పొత్తు గురించి మాట్లాడింది మీరు కాదా?’ అంటూ ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల మొదటి రోజైన గురువారం తెలుగుదేశం సభ్యులు పలువురు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సీఎం జగన్‌ వెళ్లి రాష్ట్రానికి నష్టం చేశారంటూ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించిన వ్యక్తి ఎలా వెళ్లారని చంద్రబాబు ప్రశ్నించారు. తెలుగువారి భవిష్యత్తు అని, ఐదుకోట్ల మంది నోళ్లు మూయించలేరని అన్నారు. ఈ ఆరోపణలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఘాటుగా సమాధానం ఇచ్చారు. తప్పు చేసినదంతా చంద్రబాబు సర్కారేనని, ఇప్పుడు తమపై బురదజల్లుతున్నారంటూ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి మాట్లాడుతున్న సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు మారు మాట్లాడలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే..

నేను వెళ్లకపోయినా బటన్‌ నొక్కేవారు..
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి హోదాలో మీరు ఎందుకు వెళ్లి బటన్‌ నొక్కారని అడుగుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయ్యాక మాత్రమే నేను ముఖ్యమంత్రి హోదాలో వెళ్లా. నేను ప్రారంభానికి వెళ్లినా వెళ్లకపోయినా వాళ్లు బటన్‌ నొక్కేవాళ్లు, ఆన్‌ అయ్యేది. ఐదేళ్లు బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది. ప్రాజెక్టు కడుతున్నప్పుడు అడ్డుకోకుండా అప్పడేమైనా గాడిదలు కాశారా? టీడీపీ అధికారంలో ఉండగానే ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచారు. గడిచిన 47 సంవత్సరాల్లో సీడబ్ల్యూసీ (సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌) లెక్కల ప్రకారం కృష్ణా నది నుంచి శ్రీశైలం దిగువకు 1,100 నుంచి 1,200 టీఎంసీల నీళ్లు వచ్చేవి. గత 10 ఏళ్ల నుంచి సగటున చూస్తే కృష్ణా నది నుంచి శ్రీశైలంకు వచ్చే నీళ్లు ఐదారు వందల టీఎంసీలకు పడిపోయిన పరిస్థితి. ఆల్మట్టి ఎత్తు పెంచుకుంటూ పోతున్నా చంద్రబాబు ఏనాడూ మాట్లాడలేదు. ఆల్మట్టి 519 మీటర్ల నుంచి 524 మీటర్ల ఎత్తుకు పెంచితే మనకు నీళ్లు ఎలా వస్తాయి? రెండు రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్‌ విడిపోతే నష్టం జరుగుతుందని తెలిసి కూడా విభజనకు లేఖ ఇచ్చింది మీరు కాదా? సోనియా గాంధీ అంటే మీకు భయమా? గోదావరికి ప్రధాన పాయలు నాలుగు. 

నాసిక్‌ నుంచి వచ్చే మొదటి పాయ ఇప్పటికే ఎండిపోయిన పరిస్థితిలో ఉంది. రెండోదైన ప్రాణహిత నుంచి గోదావరి 36 శాతం నీళ్లు తీసుకెళ్తోంది. సుమారు 65 శాతం నీళ్లు తీసుకొచ్చే ఈ రెండు పాయలూ తెలంగాణలోనే ఉన్నాయి. మూడోదైన ఇంద్రావతి నుంచి 26 శాతం నీళ్లు వెళ్తున్నాయి. మనకు నీళ్లు తెస్తున్నది శబరిపాయ మాత్రమే. ఈ పాయ నుంచి 11 శాతం నీళ్లు మాత్రమే గోదావరి జలాలు వస్తున్నాయి. కేవలం 500 టీఎంసీల నీళ్లు మాత్రమే మనకు కిందకు వచ్చే పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వం నీళ్లు వదిలితే గానీ ఇక్కడకురావు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 3 టీఎంసీల నీళ్లు లిఫ్ట్‌ చేసుకుని తరలించుకుపోతుంటే ఏం చేయగలిగారు? వాళ్ల రాష్ట్రంలోని నదులను వాళ్లు ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నా ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు. నీళ్లకోసం గొడవలు పడతాం.. కోర్టుకు వెళతాం, కేసులు వేస్తాం. కానీ అవేమీ తెగవు.  

సఖ్యత ఉంటేనే అభివృద్ధి..
మనకు ఇప్పుడు రాష్ట్రాల మధ్య సఖ్యత కావాలి. సఖ్యత ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వాళ్ల రాష్ట్రం నుంచి కృష్ణా ఆయకట్టు స్థిరీకరణ కోసం ముందుకొచ్చారు. ఎందుకంటే  శ్రీశైలానికి నీళ్లు వస్తే తెలంగాణలోని మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు నీళ్లు వస్తాయని, నాగార్జునసాగర్‌కు నీళ్లు వస్తే ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు నీళ్లు ఇచ్చే పరిస్థితి మెరుగవుతుందని. కృష్ణా ఆయకట్టు ప్రశ్నార్థకమైతే తమ రాష్ట్రానికి ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో కేసీఆర్‌ ముందుకు వచ్చారు. ఇద్దరం కలిసి గోదావరి నీళ్లను శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు తీసుకెళ్లగలిగితే కృష్ణా ఆయకట్టుకు మొత్తం స్థిరీకరణ జరుగుతుంది. దీనికి సంతోషించాల్సింది పోయి.. రాజకీయాలు చేస్తున్నారంటే ఇంతకంటే దిక్కుమాలిన ప్రతిపక్షం మరొకటి ఉండదు. ఏదైనా నదీ జలాల ఒప్పందాల వ్యవహారాలు చంద్రబాబుకు తెలియకపోవడం దారుణం. ఇంత ఘోరమైన ప్రతిపక్షం ప్రపంచ చరిత్రలో ఎక్కడా ఉండదు. ఇప్పటికైనా టీడీపీ నేతల వైఖరి మార్చుకోకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement