ఏ సర్వే చెప్పలేదు

Uttam Kumar Reddy Fires On KCR - Sakshi

 టీఆర్‌ఎస్‌ గెలుస్తుందన్న కేసీఆర్‌ మాటలు ఓ బూటకం

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌

సూర్యాపేట : సీఎం కేసీఆర్‌ మాటలు ఓ బూటకమని.. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని ఏ సర్వే చెప్పలేదని టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆయన నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని, ఆ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి ఇక లేదని విమర్శించారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ మున్సిపల్‌ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన హాజరై ప్రసంగించారు. ఎన్నికలంటే కాంగ్రెస్‌ పార్టీకి భయం లేదని, కాంగ్రెస్‌కు సమర్థవంతమైన నాయకత్వం ఉందన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ జెండా ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

దోచుకున్న సొమ్ముతో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల్లోకి వస్తే.. ప్రజాబలంతో కాంగ్రెస్‌ పార్టీ వస్తుందన్నారు. ఆరు సార్లు ఎన్నికల్లో గెలిచిన సత్తా తనకుందని, పిచ్చిపిచ్చి మాటలు మానుకోవాలని టీఆర్‌ఎస్‌ నేతలకు హితవు పలికారు. ఎన్నికలంటే తనకు భయమని టీఆర్‌ఎస్‌ గ్లోబెల్‌ ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఎన్నికలను ఆపేందుకు కోర్టుకు వెళ్లలేదని, గడువు కావాలని మాత్రమే వెళ్లామని తెలిపారు. ఈ నెల 6న కోర్టులో విచారణ ఉందని.. తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని భావిస్తున్నామని పేర్కొన్నారు. నోటిఫికేషన్‌ వచ్చిన మరునాడే నామినేషన్లు ఎలా వేస్తారని, ప్రభుత్వం, ఎన్నికల సంఘం కలిసి కుట్ర పన్నాయని ఆరోపించారు. సూర్యాపేటలో రోడ్ల విస్తరణతో మంత్రి జగదీశ్‌రెడ్డి అక్కడి ప్రజలకు అన్యాయం చేశారని మండిపడ్డారు. ఎన్నో ఏళ్లుగా అక్కడ నివాసం ఉన్న వారికి ఒక్క రూపాయి నష్ట పరిహారం ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారని, వారికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతుందని తెలిపారు. దీనిపై రెండు మూడ్రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి ఇళ్లు, దుకాణాలు కోల్పోయిన వారికి పరిహారం ఇవ్వాలని కోరుతామని చెప్పారు. ఈనెలాఖరులోపు ఇళ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయకుంటే ఈ విషయాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తానని ఉత్తమ్‌ స్పష్టం చేశారు.

ఒక్క హామీని నెరవేర్చలేదు...
టీఆర్‌ఎస్‌ గత ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, దీంతో ప్రజల్లో ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉందని ఏఐసీసీ కార్యదర్శి సలీం ఆహ్మద్‌ అన్నారు. రాష్ట్రంలో అత్యధిక మున్సిపల్‌ స్థానాలు కాంగ్రెస్‌ పార్టీకే దక్కుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కష్టించి పనిచేయాలని పిలుపునిచ్చారు. మున్సిపాలిటీల అభివృద్ధిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయన్నారు. వారి వెంట మాజీ మంత్రి ఆర్డీఆర్, ప్రేమ్‌లాల్, పటేల్‌ రమేశ్‌రెడ్డి, చెవిటి వెంకన్న ఉన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top