చేవెళ్ల– ప్రాణహితకు ప్రాణం పోస్తాం

Uttam Kumar Reddy Criticize On KCR Government - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అధికారంలోకి రాగానే చేవెళ్ల– ప్రాణహిత ప్రాజెక్టును పునరుద్ధరిస్తామని ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు డిజైన్‌ మార్చిన టీఆర్‌ఎస్‌ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రైతుల గొంతు నులిమేసిందని మండిపడ్డారు. పరిగిలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో  ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతానికి సాగునీటి భాగ్యం కల్పించాలని మేం ప్రయత్నిస్తే.. టీఆర్‌ఎస్‌ సర్కారు రీడిజైన్‌ పేరిట రద్దు చేయడం దారుణమని వ్యాఖ్యానించారు.

ఇతర జిల్లాలకు తరలించిన ప్రాజెక్టును తాము గద్దెనెక్కగానే పాత నమూనాకు అనుగుణంగా నిర్మిస్తామని ప్రకటించారు. పరిగి ప్రాంత రైతుల సాగునీటి అవసరాల కోసం కృష్ణా జలాలను తరలిస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం మంజూరు చేసిన వికారాబాద్‌– కృష్ణా రైలు మార్గం పనులు చేపట్టడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకు రాకపోవటం దురదృష్టకరమని, స్థానిక ప్రజల చిరకాల వాంఛను త్వరలోనే తీరుస్తామని స్పష్టం చేశారు. వికారాబాద్‌ పట్టణ అభివృద్ధికి కాంగ్రెస్‌ హయాంలో రూ.2,200 కోట్లతో శాటిలైట్‌ టౌన్‌ పథకం కింద నిధులు మంజూరు చేస్తే ఇప్పటి వరకు కేవలం రూ.200 కోట్లు మాత్రమే కేంద్రం విడుదల చేసిందని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మిగతా నిధులను కూడా వి«డుదల చేస్తామని తెలిపారు.

కేసీఆర్‌ దద్దమ్మ..  
తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా లక్షా ఏడు వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం హోదాలో కేసీఆర్‌ చెప్పారని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. నాలుగున్నరేళ్లు గడిచాక కూడా 90 వేల ఖాళీలు అలాగే ఉన్నాయని తెలిపారు. ఇలా నిరుద్యోగలను వంచించిన కేసీఆర్‌ను దద్దమ్మ అనాలా.. సన్నాసి అనాలా.. తెలియట్లేదన్నారు. అప్పటి యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడితో ఐటీఐఆర్‌ను మంజూరు చేసి 50 లక్షల ఉద్యోగాల కల్పన కోసం ప్రయత్నిస్తే రాష్ట్ర ప్రభుత్వం నీరుగార్చిందని ఆరోపించారు.

ఐటీఐఆర్‌ ప్రాజెక్టు గవర్నర్‌ ప్రసంగంలో కూడా పొందు పర్చినా అమలు చేయలేదని ఆరోపించారు. తెలంగాణను అన్ని విధాలా మోసం చేశారని దుయ్యబట్టారు. ప్రాణహిత– చేవెళ్ల  ప్రాజెక్టు రీడిజైన్‌ చేసి పరిగికి నీళ్లు రాకుండా చేశారన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తానని మాయ మాటలు చెప్పారని మండిపడ్డారు. వక్ఫ్‌ భూములను కాపాడలేక పోయాడని, ఉర్దూ అకాడమీని పటిష్టం చేసిన పాపాన పోలేదని కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు.  

దశ– దిశ మారుతుంది... పాలన మారాలి.. 
సాగునీరు వచ్చినప్పుడే ఈ ప్రాంతం దశ, దిశ మారుతుందని ప్రజా కూటమి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. ఈ ప్రాంతానికి దగ్గరగా ఉన్న జూరాల నుంచి సాగు నీరు రావాలన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం వరప్రదాయినిగా మారుతుందని చెప్పారు. మన నాయకులు నీళ్ల కోసం పోరాడిన దాఖలాలు లేవని విమర్శించారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా జిల్లాను జోగులాంబ జోన్‌లో కలిపి తీరని అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ  ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపదను తరలించుకుపోయినా.. దాని ద్వారా వచ్చే రాయల్టీని స్థానికంగా ఖర్చు చేయాల్సిన అంశాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రగతి భవన్‌లో ప్రజాస్వామ్యం కరువైందని ఆవేదన వ్యక్తంచేశారు.  నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, కంపెనీలు రావాలంటే పాలనలో మార్పు రావాలని పిలుపునిచ్చారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top