మట్టితో ‘బాబు’లు కాసుల పండుగ

Thousand Crores Looted TDP Government By Name Of Sand Mining - Sakshi

సాక్షి, విజయవాడ : కాలం మారింది.. కాలం మారింది అనంటారు. కానీ సూర్యచంద్రుల గతి మారలేదు.. భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశం వాటి నిబద్ధత మారలేదు. ఋతువుల క్రమమూ మారలేదు. ఫల, పుష్పాలు, పక్షిజాతులు వాటి ప్రక్రియల్లోనే ముందుకు సాగుతున్నాయి. మరి మారిందేమిటీ? మనిషి ఆలోచనా విధానం. తను మారి అన్నింటినీ మార్చాలనుకుంటున్నాడు. అలా మార్చేవారిలో ప్రధములు రాజకీయ నాయకులే.

అందునా అధికారం చేతిలో ఉన్నవారైతే చెప్పేదేముంటుంది. పంచభూతాలను తమ వశం చేసుకుని దాన్ని ఎలా నగదుగా మార్చుకోవాలో వారికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు కూడా. అప్పట్లో ఖాళీ స్థలాలు కనపడితే పాగా వేసేవారు. ఇప్పుడు ట్రెండ్‌ మారింది. అక్కడి మట్టి నుంచి కాసులు రాల్చేదెలాగో తెలుసుకున్నారు. దాన్నే అనుసరించారు.. భూమాతకు తూట్లు పొడిచారు. ఇందుకోసం ఓ పథకాన్ని రూపకల్పన చేసి.. దాని అసలు లక్ష్యాన్ని మార్చేసి.. వేల కోట్ల రూపాయలు బొక్కేశారు. ఆ పథకం పేరే ‘నీరు–చెట్టు’. 

కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం బ్రహ్మలింగయ్య చెరువులో నీరు– చెట్టు క్రింద చేపట్టిన పనులు స్థానిక ప్రజాప్రతినిధి ద్వారా పెద్దబాబు, చిన్నబాబులకు  కాసుల వర్షం కురిపించింది. ఆఖరకు ఇక్కడ ఉన్న దేవాలయాన్ని కూడా తొలగించి మట్టిని కొల్లగొట్టి విక్రయాలు చేసుకున్నారంటే మట్టి టీడీపీ నేతలకు ఎంత ఆదాయాన్ని సంపాదించి పెట్టిందో అర్ధమౌతుంది. మూడేళ్లుగా రిజర్వాయర్‌ పేరుతో ఈచెరువు పూడి తీస్తున్నారు. ఈ మట్టివిక్రయాలు ద్వారా టీడీపీ  నేతలకు  సుమారు రూ.50 కోట్లు ముట్టాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, సినీనటుడు బాలకృష్ణకు బంధువు అయిన కృష్ణాబాబు మట్టిని కొల్లగొట్టారు.  గుడివాడ రూరల్‌ మండలం చిరిచింతల గ్రామ చెరువును గత ఏడాది వేసవిలో  నీరు–చెట్లు పధకం క్రింద తీసుకుని  మట్టిని ‘కృష్ణా’ ర్పణం చేశారు. ఈ ‘బాబు’ అడ్డగోలుగా మట్టిని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారస్తులకు విక్రయించి లక్షలు గడించినా.. అధికారులు కానీ, గ్రామం సర్పెంచ్,  ఎమ్మెల్యేలు ఏమీ చేయలేకపోయారు. మట్టి విక్రయం ద్వారా అ విషయంలో మేము నిస్సహాయులం అంటూ నాటి గుడివాడ ఎండీఓ జ్యోతి స్వయంగా వాపోయారు. 

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన ఎమ్మెల్యేలకు కోట్లు కాసులు కమ్మురించే నీరు–చెట్టు ప«థకానికి శ్రీకారం చుట్టారు. కాల్వలో మట్టిని పూడిక తీసి కాల్వలు, గ్రామాలను అభి వృద్ధి చేసుకోవాలనే సత్సంకల్పంతో ఏర్పాటు చేసిన  నీరు–చెట్టు  పథకం లక్ష్యాన్ని మార్చేశారు. అసలు లక్ష్యాన్ని పక్కనబెట్టి అంతర్గతంగా తమ పనులు పూర్తి చేసుకున్నారు.  మట్టిని విక్రయించుకుని కోట్లు కొల్లగట్టటమేనని తరువాత అర్ధమైంది.

మట్టి నుంచి నోట్లు పిండారు!
టీడీపీ నేతలు మట్టి నుంచి నోట్ల కట్టలను పిండారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న నేతలు ఆవురావురు మంటుండగా... నీరు–చెట్లు వరంగా మారింది.దీనికితోడు జలవనరులశాఖ మంత్రి సొంత నియోజకవర్గం కావడంతో అడిగే అధికారే కరువయ్యారు. నీటి సంఘాలు, పంచాయతీలు తమ చేతుల్లో ఉండటం. అధికారపార్టీ ప్రజాప్రతినిధుల నుంచి గ్రామస్థాయి నాయకులు వరకు అందిన కాడికి దండుకున్నారు.

ముఖ్యమంత్రి బంధువే మట్టిని రియల్‌ ఎస్టేట్‌కు అమ్ముకోగా మైలవరం నియోజకవర్గంలో టీడీపీ నాయకులు బినామీలే పనులు చేస్తూ  మట్టిని యథేచ్ఛగా అమ్ముకున్నారు. ఇక బ్రహ్మలింగయ్య చెరువులోని మట్టిని జాతీయ రహదారి నిర్మాణానికి, ఎయిర్‌ పోర్టు కు  ఉపయోగిస్తూనే మట్టిని విక్రయించి కోట్లు గడించారు. 

చేయాల్సింది ఇదీ...
ఈ పన్నుల్ని నీటిసంఘాల ద్వారా, పంచాయతీల ఆమోదంతో చేయాలని నిర్ణయించారు. చెరువుల్లో మట్టి, తీయడం, చెరువుల గట్లు బలపేతం చేయడం,  చెత్తా, మొక్కలతో పూడిపోయిన చెరువుల్ని జంగిల్‌ క్లియరెన్స్‌ చేయించడం, నీటిని నిల్వ చేసుకునేందుకు చెక్‌ డ్యామ్స్‌ను నిర్మించడం ట్యాంకు ఫీడర్లు ఏర్పాటు చేయడం వంటి పనుల్ని ఈ నీరు –చెట్టు క్రింద చేపట్టాలని నిర్ణయించారు.  చెరువులు ఎండిపోయిన తరువాత వర్షాకాలం ప్రారంభమయ్యే వరకు ఈ పనులు చేయాలని నిర్ణయించారు. 

ఎలక్షన్లలో కోట్లు వెదజల్లుతున్నారు
నీరు–చెట్టు ద్వారా అధికారపార్టీకి చెందిన ప్రతి ఎమ్మెల్యే రూ.50 కోట్ల నుంచి రూ.150 కోట్లు వరకు వెనకేసుకున్నట్లు సమాచారం. ఓ మంత్రి ఆదాయమైతే దీనికి రెట్టింపు ఉంటుదని అంచనా. అడ్డగోలుగా సంపాదించిన సొమ్మును ఇప్పుడు ఎన్నికల్లో వెదజల్లుతున్నారని ఆ పార్టీ కార్యకర్తలే చెబుతున్నారు.

అప్పట్లో ప్రతి లారీని లెక్క గట్టి డబ్బులు వసూలు చేసి రిజర్వు చేశారని ఇప్పుడు అవేడబ్బులు పంపిణీ చేసి ఓట్లు కొనేందుకు ఎగబడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఒకసారి నీరు–చెట్లు ద్వారా కోట్లు సంపాదించిన ఎమ్మెల్యేలు తిరిగి అదే అధికారాన్ని వదులుకోవడానికి ఇష్టపడక  ఎన్నికల్లో కోట్లు కుమ్మరించేందుకు సిద్ధమయ్యారు. 

నిమ్మకూరులో మట్టినే అమ్మేశారు

 చెరువులో మాయమైన మట్టి
నియోజకవర్గంలో జరిగిన నీరు–చెట్టు అవినీతి పనులు టీడీపీ నేతలకు జేబులు నింపాయి. ఎంతో సదుద్దేశ్యంతో రూపొందించిన ఈ పథకాన్ని ఏ రకంగా ఉపయోగించుకుని డబ్బులు సం పాదించుకోవచ్చో అదే తరహాలో పనులు చేసి డబ్బులుగడించారు నేతలు.పథకానికి సంబంధించిన నిబంధనలు ఎక్కడా అమలు చేసిన దాఖలాలు కనపడవు. తమ పార్టీ వ్యవస్థాపన అధ్యక్షుడి స్వగ్రామం నిమ్మకూరులోని  పనుల్లోనే నేతలు కాసుల వర్షం కురిపించుకున్నారు.

గుడివాడలో అందినకాడికి...

గుడివాడ నియోజకవర్గంలోని నీరు చెట్టు పథకమంతా అవినీతి మయమే. ఒక్కచోట కూడా టీడీపీ నేతలు నాణ్యతా ప్రమాణాలు పాటించలేదు. అధికార పార్టీల నేతలే ఒకరికొకరు విమర్శించే స్థాయిలో పనులు సాగడం విశేషం. నందివాడ మండలంలో మేజర్‌ డ్రెయిన్‌గా ఉన్న చంద్రయ్యను ఎవరికి తోచినట్లు వారు పంచేసుకుని మెక్కేశారు.

దీని పూడిక తీయటం కోసం రూ. 78 లక్షలు కేటాయిస్తే  ఏడుగురు టీడీపీ నేతలు వాటిని పంచేసుకున్నారు.    ఇక మరో మేజర్‌ డ్రెయిన్‌ నెహ్రాల్లీ. దీనిని జిల్లా టీడీపీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు తీసుకున్నారు ప్రభుత్వం రూ.1.15 కోట్లు కేటాయిస్తే  తూతూ మంత్రంగా పనులు చేశారు.  కనీసం రూ.50 లక్షలు టీడీపీ నేతలకు మిగిలినట్లు భోగట్టా.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top