వెళ్లవయ్యా.. వెళ్లూ

TDP Leaders Conflicts In Tirupati - Sakshi

నరేష్‌కు పొగబెడుతున్న తమ్ముళ్లు

అనుకున్నది ఒకటి..జరిగేది మరొకటి

సొంత పార్టీలోనే కుట్ర

చేరికను జీర్ణించుకోలేకపోతున్న ఓ సామాజిక వర్గం

సాక్షి, తిరుపతి : ఏదో చేస్తారని ఆశపడి పచ్చకండువా కప్పుకున్నందుకు టీడీపీలో అడుగడుగునా అవమానాలు తప్పడం లేదు. ఇచ్చిన మాట తప్పడంతో పాటు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారు. పార్టీ నుంచి పొమ్మనలేక పరోక్షంగా పొగబెడుతున్నారు. నియోజకవర్గంలో ఒక సామాజిక వర్గం వారికే ప్రాధాన్యం ఇస్తుండడంతో మాజీ ఎమ్మెల్సీ ఇరకాటంలో పడ్డారు. టీడీపీ కండువా కప్పుకున్నందుకు నియోజకవర్గంలో విలువలేకుండా చేశారని మాజీ ఎమ్మెల్సీ అనుచరులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్మిక సంఘ నాయకుడిగా, మున్సిపల్‌ చైర్మన్‌గా, మదనపల్లె రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన, మాజీ ఎమ్మెల్సీ నరేష్‌కుమార్‌రెడ్డికి పొమ్మనకుండా పొగబెడుతున్నారు. టీడీపీలో ఆయన చేరికను జీర్ణించుకోలేని ఒక సామాజిక వర్గానికి చెందిన కొందరు నాయకులు ఆయనకు వ్యతిరేకంగా పార్టీలో కుట్రలు పన్నుతున్నారు. ఎలాగైనా దెబ్బతీయాలనే లక్ష్యంతో వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

వాల్మీకిపురం మండలం గండబోయనపల్లెకు చెందిన నరేష్‌కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ సానుభూతిపరులుగా పనిచేశారు. దివంగత నేత వైఎస్సార్‌తో ఆయనకు ఉన్న అనుబంధం నరేష్‌కుమార్‌ రెడ్డిని కాంగ్రెస్‌ వైపు ఆకర్షించింది. వైఎస్సార్‌ హయాంలో మదనపల్లె మున్సిపల్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అంతకుముందు సీటీఎం స్పిన్నింగ్‌ మిల్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. కాంగ్రెస్‌ పార్టీలో రెండు సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఆశించి విఫలమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్‌ దేశాయ్‌తిప్పారెడ్డిపై ఒక ఓటు తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ తరువాత కోర్టు ద్వారా ఎమ్మెల్సీగా పదవిని దక్కించుకున్నారు. ఆ తరువాత టీడీపీలో చేరితే నియోజకవర్గ అభివృద్ధి, తన ఉన్నతికి సహకరిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇవ్వడంతో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నియోజకవర్గంలో పట్టున్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నరేష్‌కుమార్‌ రెడ్డి టీడీపీలో చేరడం సహించలేని ఓ సామాజిక వర్గానికి చెందిన కొందరు నాయకులు ఆయనకు వ్యతిరేకంగా కుట్రలు ప్రారంభించారు.

భూములు ఆక్రమించుకున్నారంటూ..
పన్నెండేళ్ల క్రితం నరేష్‌కుమార్‌రెడ్డి తండ్రి హయాంలో జరిగిన జరిగిన భూలావాదేవీలతో ఆయనకుæ సంబంధం ఉన్నట్లు టీడీపీలోని మరో వర్గం ఆరోపణలు చేస్తోంది. ఇదే విషయాలపై నరేష్‌పై టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. రాజకీయంగా నరేష్‌ని ఎదుర్కొనేందుకు వేరే దారిలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని నరేష్‌ వర్గీయులు చెబుతున్నారు. వాస్తవాలను వక్రీకరించి తండ్రి మరణాంతరం నరేష్‌కుమార్‌ రెడ్డికి ఆపాదించే ప్రయత్నాలు చేసినట్లు చెబుతున్నారు. జిల్లా అధికారులకు, నరేష్‌కుమార్‌రెడ్డికి మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను ఆసరాగా చేసుకుని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. వ్యక్తిగతంగా, ఆర్థికంగా ఆయనను దెబ్బతీసేందుకు సిద్ధపడ్డారు. నియోజకవర్గ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పార్టీలో చేరిన తమ నాయకుడిపై సొంత పార్టీకే చెందిన కొందరు నాయకులు కుట్రలు పన్నుతుండడంపై నరేష్‌ అనుచరులు లోలోపల మథనపడుతున్నారు. ఎమ్మెల్సీగా పార్టీలో చేరిన నరేష్‌ కుమార్‌ రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఇన్‌చార్జ్‌గా ప్రకటించకపోవడంపై ఆయన అనుచరవర్గం టీడీపీపై అసంతృప్తితో ఉన్నారు. గతంలో చేపట్టిన సభ్యత్వ నమోదులో భారీ ఎత్తున ఖర్చుచేసి 25 వేల మందిని పార్టీలో చేర్పించినట్లు నరేష్‌ వర్గీయులు వెల్లడించారు. కనీసం ఆ విశ్వాసం కూడా లేకుండా అధిష్టానం కూడా నరేష్‌ను పక్కన పెట్టడంపై ఆయన వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top