పేట్రేగుతున్న అరాచకం..!

TDP Activists Attacking On YSRCP Members In Jammala madugu - Sakshi

సాక్షి, కడప : జమ్మలమడుగు నియోజకవర్గం అధికార పక్ష దౌర్జన్యకాండకు కేరాఫ్‌గా మారుతోంది. రోజూ ఎక్కడోచోట ఏదో తరహాలో దాడులు జరుగుతూనే ఉన్నాయి. ముద్దనూరు ఎంపీపీ కళావతి, బోడితిప్పనపాడు వెంకటేశు, జమ్మలమడుగు 8వార్డు కౌన్సిలర్‌ వనం వెంకటేశు, సీనియర్‌ నాయకుడు బెల్లాల లక్షుమయ్య ఇలా ఒకరి తర్వాత మరొకరిపై బెదిరింపులకు దిగడం, దాడులు చేయడం సర్వసాధారణమైంది. మంత్రి ఆదినారాయణరెడ్డి కనుసైగల మేరకు ఆయన సోదరుడు ఎమ్మెల్సీ శివనాథరెడ్డి, బావ సూర్యనారాయణరెడ్డి, టీడీపీ అభ్యర్థి తరుఫున జంబాపురం రమణారెడ్డి సోదరులు ప్రత్యక్ష బెదిరింపులకు దాడులకు తెగబడుతున్నారనే విమర్శలు పెరుగుతున్నాయి.

పార్టీ మారతారని తెలసుకున్న వారిని ఇంటికి వెళ్లి వాహనంలో ఎక్కించుకెళ్లడం, బెదిరించి ఆలోచన విరమించే చర్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే పెద్దముడియం మండలంలో సుదర్శన్‌రెడ్డిని ఎమ్మెల్సీ శివనాథరెడ్డి తన వాహనంలో తరలించకుపోయి పార్టీ మారకుండా ఆపారు. ముద్దునూరు ఎంపీపీకి స్వయంగా ఫోన్‌చేసి పార్టీ మారితే జాగ్రత్తంటూ హెచ్చరికలు చేశారని తెలిసింది. ఎమ్మెల్సీ బెదిరింపులకు జడవకుండా ఎంపీపీ కళావతి ఇతర ఎంపీటీసీలు వైఎస్సార్‌సీపీలో చేరిపోయారు. బోడితిప్పనపాడులో వెంకటేసు ఇటీవల టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరారు.

ఆయనపై టీడీపీ అభ్యర్థి రామసుబ్బారెడ్డి వర్గీయలు రామలింగేశ్వరరెడ్డి, మణిభూషణరెడ్డిలు దాడికి పాల్పడ్డారు. 8వార్డు కౌన్సిలర్‌ వనం వెంకటేశు వైఎస్సార్‌సీపీలో చేరితే మంత్రి ఆది బావ సూర్యనారాయణరెడ్డి ఫోన్‌ చేసి బెదిరించారు. పార్టీ మారలేదని మీడియా స్టేట్‌మెంట్‌ ఇవ్వాలని లేనిపక్షంలో.. అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడినట్లు సమాచారం. ఒకప్పుడు అన్న టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన సీనియర్‌ నేత బెల్లాల లక్షుమయ్యపై టీడీపీ నేతలు జంబాపురం రమణారెడ్డి సోదరులు ప్రత్యక్షదాడికి తెగబడ్డారు. మంగళవారం పట్టణ వైఎస్సార్‌సీపీ కన్వీనర్‌ పోరెడ్డి మహేశ్వరరెడ్డి వాహనాన్ని ధ్వంసం చేశారు. గ్రామస్థాయి నుంచి ఓ మోస్తరు నేతలను టార్గెట్‌ చేయడం వెనుక పోలింగ్‌ నాటికి భయోత్పాతం సృష్టించడమే ధ్యేయంగా టీడీపీ వ్యవహారిస్తోందని పలువురు వివరిస్తున్నారు.

జీ.. హుజూర్‌ ఉన్నంతకాలం అంతే..
ఎలక్షన్‌ కమిషన్‌ పరిధిలో ఉద్యోగులు ఎన్నికల కోడ్‌కు అనుగుణంగా విధి నిర్వహణ చేపట్టాలి. జమ్మలమడుగు సబ్‌డివిజన్‌లో భిన్నమైన పరిస్థితిలు నెలకొన్నాయి. అక్కడి పోలీసు యంత్రాంగంలో కొంతమంది అధికారులు ఇప్పటికీ జీ.. హుజూర్‌ అంటూ అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. పట్టణంలో పట్టపగలు వాహనం ధ్వంసం చేయడం, పార్టీ మారుతున్న వారి ఇళ్లల్లోకి వెళ్లి దాడి చేయడం లాంటి ఘటనలు పరిశీలిస్తే పోలీసు వ్యవస్థ ఏస్థాయిలో పనిచేస్తోందో అర్ధం చేసుకోవచ్చు. జమ్మలమడుగులో అత్యంత సున్నితమైన పోలింగ్‌ కేంద్రాలు పదుల సంఖ్యలో ఉన్నాయి.

అక్కడ ఎంతో నిక్కచ్ఛిగా, నిబంధనలకు అనుగుణంగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తిస్తే తప్ప ప్రశాంత పోలింగ్‌ నిర్వహించలేరు. అలాంటి పరిస్థితిలో ఓ వర్గానికి కొమ్ముకాసే యంత్రాంగం విధి నిర్వహణలో ఉంటే ఎన్నికల ప్రక్రియను ఏమాత్రం సమర్థవంతంగా నిర్వహించే అవకాశం ఉండదని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఇదివరకు ఏకంగా ఐపీఎస్‌ అధికారిపైనే దాడి చేసిన ఘటన చోటుచేసుకున్న చరిత్ర ఉంది. జమ్మలమడుగు ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా సమర్థవంతమైన అధికారికి ఎన్నికల నిర్వహణ బాధ్యతను అప్పగించాల్సి అవసరం ఉంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top