అనుకున్నామని.. జరగవు అన్నీ..

Shock to Congress ticket expected Leaders Heirs - Sakshi

కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డ వారసులు 

ఈ జాబితాలో కార్తీక్‌రెడ్డి, రఘువీర్, స్నిగ్ధారెడ్డి, సుస్మితాపటేల్‌ 

మరో దఫా చూద్దామని సర్దిచెప్పుకుని.. తల్లిదండ్రుల తరఫున ప్రచారంలోకి..

అనుకున్నామని జరగవు అన్నీ..అనుకోలేదని ఆగవు కొన్ని..జరిగినవన్ని మంచికని అనుకోవడమే మనిషి పని..అన్నారు మనసు కవి..
ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌ నేతల వారసులు ఇలాగే సర్దిచెప్పుకుంటున్నారు. వీరి రంగప్రవేశానికి కాంగ్రెస్‌ అధిష్టానం ఎర్రజెండా చూపింది. ఒక్కరికి మినహాయించి మిగిలిన నేతల సంతానానికి ఇప్పుడు అవకాశమివ్వలేమని తేల్చిచెప్పడంతో వారు ఎన్నికల బరికి దూరమయ్యారు. కుటుంబానికి ఒకే టికెట్‌ అన్న విధానాన్ని ముందుపెట్టి..కాంగ్రెస్‌ అధిష్టానం టికెట్లు నిరాకరించిన దరిమిలా మరో దఫా చూద్దామని సర్దిచెప్పుకుని తల్లిదండ్రుల ప్రచారంలో వారు చురుగ్గా పాల్గొంటున్నారు.  
– సాక్షి, హైదరాబాద్‌ 

కార్తీక్‌.. వచ్చేసారే.. 
ఈ జాబితాలో అందరి కంటే ముందుగా నిరాశకు గురైంది. కాంగ్రెస్‌ యువనేత కార్తీక్‌ రెడ్డి. గతంలో చేవెళ్ల ఎంపీగా పోటీ చేసిన.. ఆయన ఈసారి రాజేంద్రనగర్‌ అసెంబ్లీ టికెట్‌ ఆశించారు. దానిని పొత్తుల్లో భాగంగా టీడీపీకి కేటాయించడంతో కార్తీక్‌కు తీవ్ర భంగపాటు ఎదురైంది. ఆయన తల్లి, మాజీ మంత్రి సబితారెడ్డికి మహేశ్వరం టికెట్‌ కేటాయించిన అధిష్టానం కార్తీక్‌కు టికెట్‌ ఇవ్వలేమని తేల్చిచెప్పింది.  

జానా కుమారుడికీ రిక్తహస్తమే.. 
ఇక అంతా ఆసక్తిగా ఎదురుచూసిన మిర్యాలగూడ టికెట్‌ జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డికి దక్కలేదు. నాలుగేళ్లుగా నియోజకవర్గంలో రఘువీర్‌ పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొన్నా.. అధిష్టానం మాత్రం కరుణించలేదు. ఆయన తండ్రి జానారెడ్డి టికెట్‌ కోసం రంగంలోకి దిగి పార్టీ అధ్యక్షుడు రాహుల్‌వద్ద చర్చలు జరిపారు. ఒకదశలో రాహుల్‌ నుంచి రఘువీర్‌కు పిలుపురావడంతో టికెట్‌ వస్తుందని ఆశించినా భంగపాటే ఎదురైంది. ప్రస్తుతం నాగార్జున సాగర్‌ ఎన్నికల ప్రచారంలో ఆయన తలమునకలయ్యారు. 

అరుణ కుమార్తెకూ నో.. 
ఈసారి ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ తన కుమార్తె స్నిగ్ధారెడ్డిని పోటీకి దింపాలని డీకే అరుణ గట్టి ప్రయత్నాలు చేశారు. ఢిల్లీ వేదికగాను, అధిష్టాన పెద్దలతో పలు దఫాలు చర్చలు జరిపారు. తన తండ్రి చిట్టెం నర్సిరెడ్డి గతంలో ప్రాతినిధ్యం వహించిన మక్తల్‌ నుంచి టికెట్‌ను ఇప్పించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. కుటుంబానికి రెండు ఇవ్వమని చెప్పిన కాంగ్రెస్‌ అధిష్టానం ఆ స్థానాన్ని సైతం టీడీపీకే కేటాయించింది. దీంతో చేసేదిలేక స్నిగ్ధారెడ్డి తన తల్లికి మద్దతుగా గద్వాల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. 

సుస్మితకూ.. అదే పరిస్థితి.. 
కూతురు కోసమే పార్టీ మారిన కొండా సురేఖకు భంగపాటు తప్పలేదు. తన తనయ సుస్మితాపటేల్‌ను భూపాలపల్లి నుంచి పోటీలోకి దించేందుకు టీఆర్‌ఎస్‌ నుంచి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఆమె టీఆర్‌ఎస్‌తో విభేదించి కాంగ్రెస్‌లో చేరారు. కుటుంబానికి ఒకే టికెట్‌ అన్న కాంగ్రెస్‌ నిబంధన ఆమెకు నిరాశే మిగిల్చింది. 

షబ్బీర్‌ పుత్రుడికీ.. అబ్బే అనేశారు 
మాజీమంత్రి షబ్బీర్‌ అలీ తన కుమారుడు ఇలియాస్‌ను బరిలోకి దించాలని గత ఎన్నికల నుంచి యోచిస్తున్నా కార్యరూపం దాల్చలేదు. యూత్‌ కాంగ్రెస్‌ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఇలియాస్‌ను గత ఎన్నికల్లోనే కామారెడ్డి నుంచి పోటీలో నిలిపేందుకు ప్రయత్నించినా.. చివరి నిమిషంలో ఎడ్ల రాజిరెడ్డికి అవకాశం దక్కింది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top