నువ్వేమన్నా శుద్దపూసవా?

KTR Fires On Chandrababu - Sakshi

ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరకలేదా? 

ఏపీ సీఎం చంద్రబాబుపై మంత్రి కేటీఆర్‌ ఫైర్‌ 

సిగ్గు, రోషం లేకుండా బాబుతో కాంగ్రెస్‌ పొత్తా? 

పెద్దపల్లి, గోదావరిఖని, కోరుట్ల, ఉట్నూరు సభల్లో మంత్రి కేటీఆర్‌ 

సాక్షి, పెద్దపల్లి/ఉట్నూర్‌/కోరుట్ల/గోదావరిఖని: ‘‘తప్పు చేయకపోతే నువ్వేమన్నా శుద్దపూసవా..? ఎమ్మెల్యేలను కొనడానికి రూ.50 లక్షల బ్యాగ్‌తో అడ్డంగా దొరికింది నీ మనిషి రేవంత్‌రెడ్డి కాదా.. తెలంగాణకు నీళ్లివ్వద్దని, కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల పథకాలను ఆపాలని కేంద్రానికి 30 ఉత్తరాలు రాసింది నువ్వు కాదా’అంటూ ఏపీ సీఎం చంద్రబాబునుద్దేశించి మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. సోమ వారం పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి, గోదావరిఖని, జగిత్యాల జిల్లా కోరుట్ల, ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌లలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టొద్దని, నీళ్లివ్వొద్దంటున్న చంద్రబాబు, కాంగ్రెస్‌లను నమ్ముకుంటే నిండా మునుగుతామని, మన వేలుతో మన కన్నే పొడుచుకున్నట్లు, మన రైతుల నోట్లో మనమే మన్ను కొట్టినట్లయితదని చెప్పారు. తెలంగాణను దోచుకోవడానికి ప్రజాకూటమి పేరుతో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐలు ఒక్కటయ్యాయని ఆరోపించారు. వారికి అధికారం ఇస్తే ఢిల్లీ కాంగ్రెస్‌ సిఫారసులతో అమరావతి టీడీపీ చేతిలో కీలుబొమ్మలా ఉండేవారు తెలంగాణకు సీఎం అవుతారని విమర్శించారు. తద్వారా తెలంగాణను మరింత దోచుకోవడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.  

పహిల్వాన్‌లంతా ఒక్కటయ్యారు 
కేసీఆర్‌పై కుట్రతో ఒకప్పుడు బద్దశత్రువుల్లా ఉన్న కాంగ్రెస్‌.. టీడీపీ ఒక్కటయ్యాయని కేటీఆర్‌ పేర్కొన్నా రు. కేసీఆర్‌ను పడగొట్టేందుకు దేశంలో ఎక్కడెక్కడో ఉన్న పలు పార్టీల పహిల్వాన్‌లు అంతా ఒక్కటై రాష్ట్రంపై మొసలికన్నీరు కారుస్తున్నారని, వారిని విశ్వసించవద్దన్నారు. సింగిల్‌గా బరిలో ఉన్న సింహంలాంటి కేసీఆర్‌ను ఎదిరించే ధైర్యం లేక గుంపులుగా వస్తున్నా కూటమి నేతలకు గుణపాఠం చెప్పాలన్నా రు. ప్రజాశక్తి అండతో కేసీఆర్‌ మాయకూటమిని చిత్తు చేయడం ఖాయమన్నారు. తెలంగాణ తామిచ్చామం టూ కాంగ్రెస్‌ నేతలు ఏదేదో చెబుతున్నారని, దిక్కులేక.. ఇయ్యకపోతే ఈపు చింతపండైతదనే పరిస్థితి వస్తేనే ఇచ్చారన్నారు. సోనియాను తాను ఒక్క మాట అంటే రోషం వచ్చిందని, కానీ అన్ని తిట్లు తిట్టిన బాబుతో ఎలా పొత్తు పెట్టుకున్నారని ప్రశ్నించారు. మీకు సిగ్గు, రోషం లేదా అని కాంగ్రెస్‌ నేతలను ప్రశ్నిం చారు. తీగలు ముట్టుకుంటే కరెంట్‌ ఉందో లేదో తెలుస్తుందని ప్రధాని మోదీనుద్దేశించి వ్యాఖ్యానించారు.  

జిల్లాకు నలుగురు సీఎంలు 
టీఆర్‌ఎస్‌ గెలిస్తే కేసీఆర్‌ సీఎం అవుతాడని చిన్నపిల్లాడైనా చెబుతాడని, మరి కాంగ్రెస్‌ గెలిస్తే ఎవరవుతారని కేటీఆర్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో జిల్లాకు నలుగురు సీఎంలు ఉన్నారని, 40 మంది సీఎంలు 60 నెలలు..నెలన్నరకొక్కరు మారుతారన్నారు. అమరావతిలో చంద్రబాబు, రాహుల్‌లు కూర్చొని లాటరీ తీసి సీల్డ్‌ కవర్‌లో పంపిస్తారని ఎద్దేవా చేశారు. తెల్లారిలేస్తేనే చంద్రబాబు ఇంటికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెళుతున్నాడని, కాంగ్రెస్‌ నిర్ణయాలు ఢిల్లీలయితున్నయో...అమరావతిలో అవుతున్నాయో తెలియడం లేదన్నారు. కేసీఆర్‌ను ఎదుర్కోలేక దేశంలోని పహిల్వాన్‌లంతా రాష్ట్రంలో దిగారని ఎద్దేవా చేశారు.  
ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌ 

పారిశ్రామిక ప్రాంతంగా పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని బసంత్‌నగర్‌లో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. మెడికల్‌ కాలేజీ, ఇంజనీరింగ్‌ ఇస్తామన్నారు. నల్లసూరీల పిల్లల కోసం మైనింగ్‌ ఇంజినీర్‌ కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు. 100 పడకల మాతాశిశుసంరక్షణ ఆసుపత్రి మంజూరు చేసేలా కృషి చేస్తానన్నారు. కాంట్రాక్టు కార్మికుల తక్కువ డబ్బులు వస్తున్నాయి.. వారికి కూడా జీతాలు పెంచే విధంగా చూస్తామన్నారు.  

అధికారంలోకి వచ్చినట్లే ఫీలవుతున్న ‘గడ్డం’ గ్యాంగ్‌
వరంగల్‌ రోడ్‌షోలో మంత్రి కేటీఆర్‌ 
హన్మకొండ: గడ్డం గ్యాంగ్‌ అధికారంలోకి వచ్చినట్లే ఫీలవుతోందని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. సోమవారం వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని హసన్‌పర్తి, హన్మకొండ, వరంగల్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు అరూరి రమేష్, దాస్యం వినయ్‌భాస్కర్, నన్నపునేని నరేందర్‌ గెలుపు కోసం రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ఆంధ్ర పార్టీ టీడీపీని భుజాల మీద ఎత్తుకొచ్చిన కాంగ్రెస్‌ కూటమిని ప్రజలు మట్టి కరిపిస్తారన్నారు. ప్రొఫెసర్‌ కోదండరాంను కాంగ్రెస్‌ పార్టీ కరివేపాకులా, గంజిలో ఈగలొ తీసేసిందని విమర్శించారు. కేసీఆర్‌ను ఓడించేందుకు దేశవ్యాప్తంగా మచ్చల్‌ పైల్‌వాన్‌లు వస్తున్నారని ధ్వజమెత్తారు.

మరోసారి ఆశీర్వదిస్తే.. 
రాష్ట్ర ప్రజలు మరోసారి టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదిస్తే ప్రస్తుతమున్న పింఛన్లను డబుల్‌ చేస్తామని కేటీఆర్‌ ప్రకటించారు. సొంత స్థలం ఉంటే ఇల్లు నిర్మించుకోవడానికి రూ.5 లక్షలు అందిస్తామన్నారు. రైతులకు రూ.17 వేల కోట్ల రుణమాఫీ చేశామని, అధికారంలోకి రాగానే రూ.లక్ష రుణామాఫీ అమలు చేస్తామన్నారు. 12 లక్షలమంది నిరుద్యోగులకు నెలకు రూ.3,016 చొప్పున నిరుద్యోగ భృతి, ఆసరా పింఛన్ల కింద రూ.2016 అందిస్తామన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇచ్చిన ఘనత దేశంలో టీఆర్‌ఎస్‌కే దక్కుతుందని చెప్పారు. రైతుబంధు ద్వారా ఎకరానికి రూ. 10 వేలు అందిస్తామని చెప్పారు. గిరిజనులను రాజకీయంగా ఉన్నతికి చేర్చేందుకు గిరిజన తండాలు, గూడేలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేశామన్నారు. కాయితీ లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చే అంశం పరిశీలనలో ఉందని, నిరుత్సాహానికి గురికావద్దని సూచించారు. బీడీ కార్మికులకు 2018 వరకు పీఎఫ్‌ సడలింపు ఇచ్చి అందిరికీ పింఛన్లు ఇస్తామన్నారు. నేత కార్మికుల సంక్షేమానికి సిరిసిల్ల తరహాలో చర్యలు చేపడతామన్నారు. కాంగ్రెస్, టీడీపీలు 50 ఏళ్లలో చేయని పనులను తాము నాలుగేళ్లలో చేశామన్నారు. ప్రజలు ఆగం కావద్దని...ఆలోచించి ఓటు వేయాలని కేటీఆర్‌ కోరారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top