నేడు గులాబీ రణభేరి

KCR Starts Election Campaign From Karimnagar - Sakshi

కరీంనగర్‌లో కేసీఆర్‌ భారీ బహిరంగ సభ

గుణాత్మక మార్పు లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారం

ప్రతి సెగ్మెంట్‌లోనూ సభలకు ప్రణాళిక  

సాక్షి, హైదరాబాద్‌: దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి లోక్‌సభ ఎన్నికల రణంలోకి దిగుతోంది. టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు ఆదివారం లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌కు బాగా కలిసొచ్చిన కరీంనగర్‌ నుంచే లోక్‌సభ ఎన్నికల ప్రచారం మొదలవుతోంది. రెండు లక్షల మందితో కరీంనగర్‌ లోక్‌సభ సెగ్మెంట్‌లో ఎన్నికల ప్రచార సభ నిర్వహిస్తున్నారు. కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కరీంనగర్‌లోని స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ మైదానంలో సాయంత్రం 6 గంటలకు ఈ సభ జరగనుంది. ఒక్క రోజు విరామం తర్వాత ఈ నెల 19న నిజామాబాద్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఎంఐఎంతో కలసి రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో గెలుపు లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రచార వ్యూహం రచించారు. అభ్యర్థుల ఖరారుతో సంబంధం లేకుండా గ్రామస్థాయిలో ప్రచారం నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు.

లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జీలకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించారు. ఎమ్మెల్యేలతో సమన్వయంతోపాటు ఒక్కో లోక్‌సభ నియోజకవర్గంలో గెలుపు బాధ్యతలను ఆయా జిల్లాల్లోని మంత్రులకు అప్పగించారు. అభ్యర్థులను ప్రకటించిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ప్రచారం నిర్వహించాలని కేసీఆర్‌ ఆదేశించారు. కరీంనగర్‌ బహిరంగ సభ తర్వాతే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు చెబుతున్నారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో కచ్చితంగా ఒక భారీ బహిరంగ సభను నిర్వహించేలా టీఆర్‌ఎస్‌ అధినేత ప్రచార ప్రణాళికను రూపొందించారు. మహబూబాబాద్, జహీరాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, భువనగిరి వంటి సెగ్మెంట్లలో రెండు సభలు నిర్వహించే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. 

కేటీఆర్‌ సైతం... 
టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఎన్నికల బహిరంగ సభలకు సమాంతరంగా పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె. తారక రామారావు ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ప్రతి లోక్‌సభ సెగ్మెంట్‌లో కేటీఆర్‌ సభలు నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొన్ని కీలక అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ కేటీఆర్‌ సభలు జరగనున్నాయి. ప్రచారంతోపాటు టీఆర్‌ఎస్‌ ఎన్నికల వ్యూహంపై ఎప్ప టికప్పుడు కేటీఆర్‌ పర్యవేక్షించనున్నారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top