టీఆర్‌ఎస్‌ ఓడిపోతే నాకేమి నష్టం లేదు: కేసీఆర్‌

KCR Fires On Congress Leaders And Chandrababu Naidu - Sakshi

సాక్షి, నిర్మల్‌ : ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతే తనకు పెద్దగా వచ్చే  నష్టమేమి లేదని, తెలంగాణ ప్రజలే తీవ్రంగా నష్టపోతారని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణపై చంద్రబాబు పెత్తనం వస్తే ఎవరికీ లాభమని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు తమ చిల్లర రాజకీయం కోసం చంద్రబాబునాయుడును తెచ్చుకొంటున్నారని మండిపడ్డారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖనాపూర్ లో గురువారం నాడు నిర్వహించిన టీఆర్ఎస్ ఎన్నికల సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి వస్తే అభివృద్ధి వెనక్కి పోతుందని,తెలంగాణ అంధకారమవుతుందని చెప్పారు. 58 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ తెలంగాణను అభివృద్ది చేయలేదని విమర్శించారు.

కాంగ్రెస్‌ నేతలు చంద్రబాబును తీసుకొచ్చి ప్రజల నెత్తిమీద రుద్దాలని ప్రయత్నిస్తున్నారని, అంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. కాంగ్రెస్‌అధికారంలోకి వస్తే దరఖాస్తులు పట్టుకొని విజయవాడకు వెళ్లాల్సి వస్తుందన్నారు. ఒకసారి చంద్రబాబును తాను తెలంగాణ నుంచి తరిమేశానని, ఈ సారి మాత్రం ఆ బాధ్యత తెలంగాణ ప్రజలే తీసుకోవాలని సూచించారు. టీఆర్‌ఎస్ హయంలోనే తెలంగాణ సంపద పెరిగిందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర వచ్చేందుకు కృషి చేశామన్నారు. మళ్లీ అధికారంలోకి రాగానే  రైతులకు రూ. లక్ష రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. విపక్ష నేతల అబద్దపు ప్రచారం నమ్మోదన్నారు. మంచి వ్యక్తులే ఎన్నికల్లో గెలిపించాలని కేసీఆర్ కోరారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top