షాక్‌: ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గైర్హాజరు..!

 Four MLAS Absent From Congress Meeting - Sakshi

కీలక సమావేశానికి హైదరాబాద్‌ కర్ణాటకకు చెందిన నలుగురు గైర్హాజరు

టచ్‌లో లేకుండాపోయిన శాసనసభ సభ్యులు.. హైకమాండ్‌లో కలవరం

సాక్షి, బెంగళూరు : నగరంలో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ శాసనసభ్యుల సమావేశానికి సంబంధించి షాకింగ్‌ సమాచారం అందుతోంది. కర్ణాటక పీసీసీ కార్యాయలంలో జరిగిన పార్టీ శాసనసభా భేటీకి మొత్తం ఎమ్మెల్యేలు హాజరు కాలేదని తెలుస్తోంది. మొత్తం ఆరుగురు శాసనసభ్యులు ఈ భేటీ గైర్హాజరైనట్టు సమాచారం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 78 సీట్లను గెలుపొంది... రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. అయితే, 78మంది శాసనసభ్యుల్లో 72మంది మాత్రమే ఇప్పటివరకు సమావేశానికి వచ్చారు. మరీ ఈ భేటీకి దూరంగా ఉన్న ఆరుగురు ఎమ్మెల్యేల వైఖరి ఏమై ఉంటుందన్నది అంతుచిక్కడం లేదు. వీరిలో ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరినట్టు అనుమానిస్తున్నారు. మిగతా ముగ్గురు ఎందుకు గైర్హాజరయ్యారనేది పార్టీ నేతలు చెప్పడం లేదు. వీరిలో చాలామంది బీజేపీ గూటికి చేరారంటూ వస్తున్న ప్రచారాన్ని కాంగ్రెస్‌ నేతలు కొట్టిపారేస్తున్నారు.

టచ్‌లోని లేని ముగ్గురు ఎమ్మెల్యేలు!
జేడీఎస్‌ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా కదులుతున్న కాంగ్రెస్‌ పార్టీ బెంగళూరులో నిర్వహించిన ఈ సమావేశానికి ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అయితే, ఈ సమావేశానికి హైదరాబాద్‌ కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యేలు ఆనంద్‌సింగ్‌, నాగేంద్ర, రాజశేఖర పాటిల్‌ గైర్హాజరయ్యారు. వీరు కనీసం అధిష్టానంతో టచ్‌లో కూడా లేకపోవడం కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది. ఈ ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఆనందసింగ్‌, నాగేంద్ర గాలి జనార్దన్‌రెడ్డి సోదరులకు సన్నిహితులు అని తెలుస్తోంది. బీజేపీ నేత శ్రీరాములుకు వీరు బంధువులు కావడంతో.. ఆయన దగ్గరు ఈ ఇద్దరు ఉన్నట్టు సమాచారం.

ఇప్పటికే ఐదుగురు లింగాయత్‌ ఎమ్మెల్యేలు బీజేపీ నేత యడ్యూరప్పతో రహస్యంగా మంతనాలు జరిపినట్టు ప్రచారం జరుగుతుండటం పార్టీని ఆందోళనపరుస్తోంది. మొత్తం 15 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ నేతలు టచ్‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీజేపీ మైండ్‌గేమ్‌ ఆడుతోందని, అనైతిక చర్యల ద్వారా ఎమ్మెల్యేలు ఫిరాయింపులు ప్రోత్సహిస్తోందని కాంగ్రెస్‌ అధిష్టాన దూత గులాంనబీ ఆజాద్‌ మండిపడ్డారు. బీజేపీ అనైతిక చర్యలకు పాల్పడినా.. తమ ఎమ్మెల్యేలపై విశ్వాసముందని, ఎవరూ బీజేపీ గూటికి చేరబోరని ఆయన చెప్పారు. జేడీఎస్‌ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుచేసి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ వైపు తమ ఎమ్మెల్యేలు ఆకర్షితం కాకుండా కాంగ్రెస్‌ పార్టీ క్యాంపు రాజకీయాలకు తెరతీసింది. బెంగళూరులోని ఈగల్టన్‌ హోటల్లో 150 గదులు బుక్‌ చేసి.. తమ ఎమ్మెల్యేలను అక్కడికి తరలించాలని భావిస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top