ఎమ్మెల్యేలను భయపెట్టి పార్టీలోకి చేర్చుకుంటున్నారు

Congress Leaders Criticize CM KCR Over Operation Akarsh - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మహేశ్వరం ఎమ్మెల్యే సబితా రెడ్డి పార్టీ మారడాన్ని రంగారెడ్డి కాంగ్రెస్‌ నేతలు ఖండించారు. పార్టీలో అన్ని పదవులు అనుభవించి ఇతర పార్టీలోకి వెళ్తూ.. కాంగ్రెస్‌పై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇతర పార్టీ ఎమ్మెల్యేలను భయపెట్టి పార్టీలోకి చేర్చుకుంటున్నారని ఆరోపించారు. గురువారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్‌ మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ మాట్లాడుతూ.. సబితా ఇంద్రారెడ్డికి కాంగ్రెస్‌ చాలా గౌరవం ఇచ్చిందని, అన్ని పదవులు అనుభవించి పార్టీ మారుతున్నారని విమర్శించారు. ఇంద్రారెడ్డి ఆశయాలు సాధించడం టీఆర్‌ఎస్‌లోకి వెళితేనే సాధ్యం అవుతుందా అన్ని ప్రశ్నించారు. సబితాను టీఆర్‌ఎస్‌లోకి తీసుకొని అమరుల కుటుంబాలకు కేసీఆర్‌ ఏమి సమాధానం చెప్పారని ప్రశ్నించారు. ఉద్యమ ద్రోహులు మంత్రులుగా కొనసాగుతున్నారని ఆరోపించారు. ఒక్కరు పార్టీ మారితే కాంగ్రెస్‌కు పోయేది ఏమి లేదన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలను అణచివేయాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఎన్నికల హామీలు అమలు చేయడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమయ్యిందని విమర్శించారు.

 కార్యకర్తలను బెదిరిస్తే ఊరుకోం
కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను, కార్యకర్తలను బెదిరించి టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారని తాండూరు ఎమ్మెల్యే, వికారాబాద​ డీసీసీ ప్రెసిడెంట్‌ పైలెట్‌ రెడ్డి ఆరోపించారు. తమ పార్టీ కార్యకర్తలను బెదిరిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. చేవేళ్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు. ఓడిపోతామనే భయంతో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు పోటీ నుంచి తప్పుకున్నారని ఎద్దేవా చేశారు. ఊరు పేరు తెలియని రంజిత్‌ రెడ్డి ఎలా గెలుస్తారే చూద్దామని సవాల్‌ చేశారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటామని, కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 

కొండా కేంద్ర మంత్రి అవుతారు
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ భారీ మెజారిటితో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని రంగారెడ్డి జిల్లా డీసీసీ ప్రెసిడెంట్‌ నర్సింహరెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతోనే కొండా విశ్వేశ్వరరెడ్డి కేంద్రమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో అన్ని పదవులు అనుభవించి పార్టీని వీడడం మంచి పద్దతి కాదన్నారు. ఒకరిద్దరు పార్టీ మారితే కార్యకర్తలు అధైర్యపడొద్దని, తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను ఈ ఎన్నికల్లో భారిగా గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే పరిగి రామ్‌ మోహన్‌ రెడ్డి కోరారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top