చీకటి ఒప్పందం

Chandrababu naidu Target to YSRCP Votes in Chittoor - Sakshi

వైఎస్సార్‌సీపీ ఓట్లు చీల్చడమే లక్ష్యం

కాంగ్రెస్, జనసేనతో బాబు లోపాయికారి ఒప్పందం

అభ్యర్థుల ఎంపికలోనూ అదే తంతు

ఖర్చు మొత్తం టీడీపీ భరించేలా నిర్ణయం

పదవి కోసం బాబు నమ్మించి మోసం చేశారంటున్న అసంతృప్తులు

అధికారమే లక్ష్యంగా బాబు పావులు కదుపుతున్నారు. మహాకూటమి పేరుతో వెళితే జనం నమ్మడం లేదని కాంగ్రెస్, జనసేనతో లోపాయికారి పొత్తులు పెట్టుకున్నారు. బాబు డైరెక్షన్లోనే జిల్లాలో జనసేన, కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక పూర్తిచేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి వెళ్లే ఓటర్లను ఆయోమయానికి గురిచేసి తద్వారా లబ్ధిపొందేందుకు పథకం వేశారు. సామాజికవర్గ సమీకరణాలను టీడీపీకి అనుకూలంగా మలుచుకునేందుకు పవన్‌కల్యాణ్, చంద్రబాబు కుట్రలు  చేస్తున్నారు.

సాక్షి, తిరుపతి: జిల్లాలో టీడీపీకి ప్రతికూల వాతావరణం ఉండడంతో చంద్రబాబు అనైతిక, లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారు. తిరుపతి పార్లమెంట్‌ స్థానానికి టీడీపీ తరఫున పోటీ చేయడానికి కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు మాజీ మంత్రి పనబాకలక్ష్మిని తెరపైకి తీసుకొచ్చారు. మరోవైపు తిరుపతి కాంగ్రెస్‌ పార్లమెంట్‌ అభ్యర్థిగా చింతామోహన్‌ పేరు ఖరారు చేశారు. రాజంపేట, చిత్తూరు పార్లమెంట్‌ స్థానాలకు షాజహాన్‌ బాషా, శ్రీరంగప్ప పేర్లను ప్రకటించారు. ప్రశ్నించే పార్టీ జనసేన అంటూ సినిమా డైలాగులతో ప్రగల్భాలు పలికిన పవన్‌కల్యాణ్‌ బాబు చాటు మనిషిగా అనైతిక పొత్తులతో ఓటర్లను మభ్యపెట్టేందుకు సిద్ధమయ్యారు. జిల్లాలో వైఎస్సార్‌సీపీ ప్రజాదరణను దారి మళ్లించేందుకు టీడీపీ, జనసేన, కాంగ్రెస్‌ లోపాయికారి పొత్తులు పెట్టుకున్నట్లు ఆ పార్టీ శ్రేణులే బహిరంగంగా చర్చించుకుంటున్నారు.

జనసేన పార్టీ నుంచి పుంగనూరు, పలమనేరులో మాత్రం అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన స్థానాలకు నేడో, రేపో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. తమ అభ్యర్థుల జాబితాను  జనసేన అధినేతే చంద్రబాబుకు పంపినట్లు విశ్వసనీయ సమాచారం. చంద్రబాబు పర్యటనలో ఉండడంతో ఆ జాబితాను పరిశీలించి మార్పులు, చేర్పులు చేశాక అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని జనసేన శ్రేణులు వెల్లడించాయి. కాంగ్రెస్‌ పార్టీ సోమవారం రాత్రి చిత్తూరు, కుప్పం, గంగాధరనెల్లూరు, శ్రీకాళహస్తి, చంద్రగిరి, తంబళ్లపల్లికి అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులందరినీ చంద్రబాబు ఎంపిక చేసినట్లు విశ్వసనీయ సమాచారం. మిగిలిన అసెంబ్లీ స్థానాలకూత్వరలో అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు ఉ న్నాయి. కాంగ్రెస్, జనసేన అభ్యర్థులందరికీ ఎన్ని కల్లో ఖర్చు మొత్తాన్ని బాబు భరించేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

భగ్గుమన్న అసంతృప్తులు
చంద్రబాబుది మొదటి నుంచే అధికార దాహంతో కుట్రపూరిత రాజకీయాలు చేయడం ఆయన నైజమని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాలోని పూతలపట్టు, జీడీ నెల్లూరు, సత్యవేడు, తంబళ్లపల్లి, చిత్తూరుకి తెర్లం పూర్ణం, హరికృష్ణ, జేడీ రాజశేఖర్, శంకర్‌యాదవ్, ఏఎస్‌ మనోహర్‌ పేర్లను ప్రకటించారు. పూతలపట్టు ఇన్‌చార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే లలితకుమారికే టికెట్‌ అని మొదటి నుంచి చెబుతూ వచ్చారు. అందులో భాగంగానే నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. రాత్రి ఒక్కసారిగా షాక్‌ ఇచ్చారు. పూతలపట్టుకు పూర్ణం అనే వ్యక్తి పేరును ప్రకటించారు. లలిత కుమారి బంగారుపాళెంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో కన్నీరుమున్నీరయ్యారు. టీడీపీ నమ్మించి మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీడీ నెల్లూరుకు మాజీ ఎమ్మెల్యే గాంధీకే అని చంద్రబాబు అమరావతికి పిలిపించి మరీ చెప్పినట్లు ఆయన వర్గీయులు చెప్పారు. చివరకు గాంధీని పక్కనపెట్టి గుమ్మడి హరికృష్ణ పేరు ప్రకటించి షాక్‌ ఇచ్చారు.

గాంధీ వర్గీయులు సమావేశమై చర్చించుకున్నారు. టీడీపీకి పనిచేయమని తేల్చిచెప్పారు. టీడీపీ అధినేత అటు జనసేన, కాంగ్రెస్‌ పార్టీలతో చీకటి ఒప్పందం కుదుర్చుకోవడం.. మరో వైపు పార్టీ కోసం పనిచేసిన వారిని నమ్మించి నట్టేట ముంచడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారా? అని ప్రశ్నిస్తుండడం గమనార్హం.

మా నాయకుడికి అన్యాయం చేశారు
‘‘మా నాయకుడు గాంధీని చంద్రబాబు అమరావతికి పిలించుకున్నారు. జీడీ నెల్లూరు టికెట్‌ నీకే ప్రచారం చేసుకో అన్నారు. దీంతో ఆయన ప్ర చారం మొదలుపెట్టారు. అనుచరులతో సమావేశమయ్యారు. ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు మోసం చేశారు. నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలతో సత్సంబంధాలు లేని వ్యక్తికి టికెట్‌ కేటాయించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన వారికి నా యకులకు, కార్యకర్తలకు గుర్తింపు లేకపోవడం బాధాకరం. రానున్న ఎన్నికల్లో గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న కళత్తూరు నారాయణస్వామి భారీ మెజారిటీతో గెలవడం ఖా యం. రానున్న ఎన్నికల్లో కార్వేటినగరం మం డలంలో టీడీపీ తుడిచి పెట్టుకుపోవడం ఖాయమని చెప్పారు. టీడీపీకి చెందిన ప్రతి నాయకుడు, కార్యకర్త్త వైఎస్సార్‌సీపీకే పనిచేస్తాం.’’    – రవికుమార్, వైస్‌ ఎంపీపీ (టీడీపీ)

స్వార్థపరుల కుట్రలకు బలయ్యా
నియోజకవర్గ అధినాయకుల చెప్పుచేతల్లో మెలిగాను. కాలితో చెప్పిన పని చేతులతో చేశా. కుటుంబానికి, పిల్ల లకు దూరంగా ఉంటూ భార్యాభర్తలు కలసి పార్టీకోసం పనిచేశాం. 25 సంవత్సరాలుగా పార్టీకోసం కూలిపనిచేశా. కొందరు స్వార్థపరుల కుట్రలకు బలయ్యా. పూతలపట్టు టీడీపీ టిక్కెట్‌ నాకు దక్కకుండా చేశారు. పూతలపట్టు నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత రెండుసార్లు స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యా. నా ఓటమికి కొందరు స్వార్థపరులు కుట్రపన్నారు. ఈసారి నాకే టిక్కెట్‌ వస్తుందని ఆశించాను. నాతో పాటు మరికొందరు కూడా ఆశించారు. మాకు కూడా తెలియకుండా కొత్త వ్యక్తిని ప్రకటించడం బాధాకరం’’    – లలితకుమారి, మాజీ ఎమ్మెల్యే

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top