‘పంచాయతీ’ వాయిదాకే మొగ్గు!

Chandrababu Govt will look forward to postpone panchayat elections - Sakshi

ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సర్కార్‌ దృష్టి 

ఆగస్టు 1వ తేదీన ముగియనున్న సర్పంచుల పదవీ కాలం

ప్రత్యేకాధికారుల నియామకమా? సర్పంచుల పదవీ కాలం పొడిగింపా?

అధికారుల అభిప్రాయం కోరిన ప్రభుత్వం

పంచాయతీరాజ్‌ చట్టం 143 నిబంధనలు వివరిస్తూ ప్రభుత్వానికి నివేదిక

సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయడానికే చంద్రబాబు ప్రభుత్వం మొగ్గుచూపుతుంది. ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సర్పంచుల పదవీ కాలం ముగుస్తుండగా..తిరిగి ఎన్నికలు నిర్వహించకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ విషయమై ప్రభుత్వం పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయ ఉన్నతాధికారుల అభిప్రాయం కోరింది.

ఈ నెల 14వ తేదీన ప్రభుత్వం నుంచి అందిన మెమో నం 1281కు జవాబిస్తూ పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయ ఉన్నతాధికారులు రెండు రోజుల క్రితం ఒక నివేదికను అందజేశారు. సకాలంలో ఎన్నికలు జరగని పక్షంలో ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టం –1994లోని సెక్షన్‌ 143(3) సర్పంచుల స్థానంలో గ్రామ పంచాయతీలకు వేర్వేరుగా ప్రత్యేకాధికారులను నియమించడం లేదంటే ప్రస్తుత సర్పంచులనే ఆరు నెలల పాటు పర్సన్‌ ఇన్‌చార్జులుగా నియమించాలా అన్న దానిపై ప్రభుత్వమే తగిన నిర్ణయం తీసుకుని ఆదేశాలు జారీ చేయాలంటూ నివేదికలో పేర్కొన్నారు. 

పదవీ కాలం పొడిగించాలంటూ సర్పంచుల సంఘాల వినతి
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఆసక్తిగా లేదన్న సమాచారంతో సర్పంచుల సంఘాలు తమ పదవీ కాలం మరో ఆరు నెలలు పొడిగించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. అఖిల భారత పంచాయతీ పరిషత్‌ జాతీయ కార్యదర్శి వీరాంజనేయులు, గుంటూరు జిల్లా ఎస్సీ సర్పంచుల సంఘం అధ్యక్షులు సుజాత కిషోర్, జిల్లా సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి గౌస్‌ సంథాని తదితర ప్రతినిధుల బృందం శుక్రవారం సచివాలయంలో పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్య దర్శి జవహర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top