‘పింఛన్‌’ వృద్ధులకు జెండాలిచ్చి ప్రచారం చేయించండి | Sakshi
Sakshi News home page

‘పింఛన్‌’ వృద్ధులకు జెండాలిచ్చి ప్రచారం చేయించండి

Published Tue, Mar 19 2019 5:34 AM

Chandrababu Comments On KCR At Public Meetings - Sakshi

సాక్షి, గుంటూరు/నెల్లూరు/ఒంగోలు: ‘రాష్ట్రంలో ఉన్న వృద్ధులకు పెద్ద కొడుకులా పింఛన్లు ఇస్తున్నా.. వారికి ఉదయం, సాయంత్రం రెండు గంటలపాటు టీడీపీ జెండా ఇచ్చి ప్రచారం చేయించే బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలంటూ’ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. సోమవారం నెల్లూరు, ఒంగోలు, గుంటూరు నగరాల్లో జరిగిన  టీడీపీ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. గుంటూరు నగరంలోని ఎల్‌ఈఎం పాఠశాల గ్రౌండ్‌లో సోమవారం రాత్రి జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో ఆదాయం తగ్గి కష్టాలపాలై బస్సులో బస చేశానని.. బస్సే తన ఆఫీస్‌ అని,.. ఇప్పుడు టెంపరరీ సెక్రటేరియట్‌ ఉందని.. తాను అధికారంలోకి వస్తే సుందరమైన సెక్రటేరియట్‌ నిర్మిస్తామని చెప్పారు. ఏమీ చేయని కేసీఆర్‌కే ఆ రాష్ట్ర ప్రజలు 88 సీట్లు కట్టబెట్టారని, మీకు రోషం లేదా తమ్ముళ్లూ అంటూ కార్యకర్తలను రెచ్చగొట్టే చర్యలకు దిగారు.  అయితే చంద్రబాబు ప్రసంగం ప్రారంభించక ముందే సభ నుంచి కొంతమంది వెనుదిరిగారు.  

లోకేష్‌ను మాట్లాడించే ధైర్యం చేయని బాబు.. 
గుంటూరులో జరిగిన టీడీపీ ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరైన ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ సభావేదికపై ఉన్నప్పటికీ ఆయన్ను మాట్లాడించే ధైర్యం మాత్రం చంద్రబాబు చేయలేదు. సభకు హాజరైన మంత్రులు నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావుతో మాట్లాడించిన చంద్రబాబు .. మంగళగిరి నుంచి పోటీలో ఉన్న తన తనయుడు నారా లోకేష్‌ను మాత్రం మాట్లాడించలేదు.  

మద్దాళి గిరికి అన్యాయం చేస్తే ఊరుకోం.. 
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థిగా మద్దాళి గిరిని ఇప్పటికే  ప్రకటించారని.. అయితే ఇప్పుడు ఆ స్థానం వేరే వారికి కేటాయించి ఆయన్ను తెనాలి లేదా నరసరావుపేట అభ్యర్థిగా పంపించనున్నట్లు తెలిసిందని అనుచరులు ఆందోళనకు దిగారు. అయితే ఆందోళన ఉధృతం అవుతున్న సమయంలో వేదికపై ఉన్న నాయకులు మద్దాళి గిరిని కిందకు పంపి గొడవ సర్దుమణిగించే ప్రయత్నం చేశారు. 

కేసీఆర్‌..ఖబడ్దార్‌...
‘ఒకప్పుడు అందరి మాదిరిగానే స్టేజీపై మా పక్కన కూర్చున్న వాడివి, నా దగ్గర పనిచేసిన వ్యక్తివి, నువ్వేమైనా ఆకాశం నుంచి దిగొచ్చావా, నన్ను తిడితే సహించను. కేసీఆర్‌ కాసుకో ఖబడ్డార్, నెల్లూరు సభ నుంచే హెచ్చరిస్తున్నా,  ఏదైనా ఉంటే మర్యాదగా ఉండు’ అంటూ సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్‌ ఆటలు సాగనివ్వనని బాబు ధ్వజమెత్తారు. అభ్యర్థుల ప్రకటన..

సర్వేలు చేసి అభ్యర్థిత్వం ఖరారు చేశానని చంద్రబాబు తెలిపారు. నెల్లూరురూరల్‌కు నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్, నెల్లూరు సిటీకి మంత్రి నారాయణ, సర్వేపల్లికి మంత్రి సోమిరెడ్డి చంద్రమెహన్‌రెడ్డి, కావలి అభ్యర్థిగా కాటంరెడ్డి విష్ణువర్థన్‌రెడ్డి, నెల్లూరు పార్లమెంట్‌ అభ్యర్థిగా బీద మస్తాన్‌రావును ఖరారు చేసినట్లు చంద్రబాబు ప్రకటించారు. కాగా, చంద్రబాబు సభలు జనం లేక వెలవెలబోయాయి.  

కేసీఆర్‌కు మనమే రిటర్న్‌ గిఫ్టు ఇద్దాం
పెనమలూరు:తెలంగాణ సీఎం కేసీఆర్‌ మనకు రిటర్ను గిఫ్టు ఇస్తామని చెబుతున్నారని, ఈసారి ఎన్నికల్లో 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ సీట్లు గెలిచి మనమే కేసీఆర్‌కు రిట్నర్‌ గిఫ్టు ఇద్దామని సీఎం చంద్రబాబు అన్నారు. తెలంగాణలో 16 ఎంపీ సీట్లు గెలిచి కేంద్రంలో పెత్తనం చేస్తానని కేసీఆర్‌ చెబుతున్నారని, మనకు 25 సీట్లు ఉన్నాయని.. మనకు పౌరుషం లేదా? మనం పాతిక సీట్లు గెలవాలని ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం రాత్రి విజయవాడ సిద్దార్ధ కళాశాల ఆవరణలో నిర్వహించిన పార్టీ సన్నాహక ప్రత్యేక జనరల్‌ బాడీ సమావేశంలో సీఎం ప్రసంగించారు. వీవీప్యాట్‌ పెట్టించిన ఘనత తనదేనన్నారు. రాష్ట్రాన్ని అన్యాయం చేసిన నరేంద్రమోదీని ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 

Advertisement
Advertisement