
కేరళ: బీజేపీ వేసిన కేసులకు భయపడనని, వాటిని పతకాలుగా భావిస్తానని కాంగ్రెస్ అగ్రనేత వయానాడ్ ఎంపీ రాహుల్ గాంధీ తెలిపారు. గురువారం ఆయన కేరళలో మీడియాతో మాట్లాడుతూ..తన పై వ్యతిరేకంగా 15నుంచి 16కేసులు ఉన్నాయన్నారు. సైనికులను గమనిస్తే వారి చాతిపై చాలా పథకాలు ఉంటాయని తెలిపారు. ప్రతి కేసు తానకొక పతకం లాంటిదని అన్నారు. కాగా తాను బీజేపీతో సిద్దాంతపరంగా పోరాడతానని స్పష్టం చేశారు. దేశంలో విద్వేషపూరిత వాతావరణం లేదని బీజేపీ తనను ఎంత నమ్మంచినా తాను నమ్మబోనని వెల్లడించారు. దేశంలో మహిళలను గౌరవించడం, అన్ని వర్గాలు, కులమతాల ప్రజలు ఐక్యంగా ఉండడమే బలమని స్పష్టం చేశారు. ఎప్పుడైనా బీజేపీ వారు తనపై కేసు పెడితే మెడలో పతకం ఉన్నట్లే భావిస్తానన్నారు.
గత సంవత్సరం కేరళ రాష్ట్రంలో సంభవించిన వరదలలో ప్రజలు తమ ఇళ్లను, జీవితాన్ని, అన్నింటినీ కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఇటువంటి పరిస్థితిలో కూడా ప్రజలు సానుకూల దృక్పథంతో ఉన్నారని కొనియాడారు. వరదలలో నష్టపోయిన బాధిత ప్రజలకు ఇంకా సహాయం అందాల్సి ఉందన్నారు. నష్టపోయిన ప్రజలకు పరిహారం, పునరావాసం త్వరగా దక్కేలా రాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం చర్చిస్తున్నానని తెలిపారు. సాధ్యమైనంత త్వరగా అందరికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఏ దేశంలో లేని విధంగా ఇతరులకు సాయం చేసే సంస్కృతి మన దేశంలో మిళితమై ఉందని పేర్కొన్నారు.