‘అక్కడ రాజధాని సాధ్యం కాదని అప్పుడే చెప్పారు’

Botsa Satyanarayana Slams Chandrababu Over Decentralized Development - Sakshi

సాక్షి, తిరుపతి : చంద్రబాబు చాలా అసహనంతో ఉన్నారని, ఏరోజు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. అమరావతి అంశంపై ధర్నాలు, దీక్షలు చేయాలంటూ బాబు రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల వద్ద మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. శివరామకృష్ణ కమిటీ ఏం చెప్పిందో అందరికీ తెలుసునని బొత్స అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ ఉండాలని శివరామకృష్ణ కమిటీ చెప్పిందని ఆయన గుర్తు చేశారు. విజయవాడ, గుంటూరు మధ్య వ్యవసాయ భూముల్లో.. రాజధాని నిర్మాణం సాధ్యం కాదని కమిటీ చెప్పిందని పేర్కొన్నారు. 

ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డితో కలిసి తుకివాకంలోని బయోగ్రీన్‌ సిటీని బొత్స సందర్శించారు. తిరుపతిలో తాగునీటి సమస్య పరిష్కరించడానికి ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు. గరుఢవారధి పనులను పరిశీలించామని అన్నారు. రూ. 9 కోట్లతో ప్రకాశం పార్క్‌ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. తిరుపతి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ పరిధిని పెంచాలని నిర్ణయించామని తెలిపారు. దానికోసం మాస్టర్‌ ప్లాన్‌ రూపొందిస్తామని అన్నారు. శ్రీకాళహస్తి పట్టణాబివృద్ధికోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని బొత్స తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

‘విశాఖకంటే విజయవాడ పెద్ద నగరమని చంద్రబాబు అంటున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవమని చెప్పుకునే బాబు కాకి లెక్కలతో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. శివరామకృష్ణ కమిటీ నివేదికను ఆయన తుంగలో తొక్కారు. రాజధాని నిర్మాణానికి తొలిదశలో రూ.52 వేల కోట్లకు బాబు టెండర్లు పిలిచారు. ఇప్పుడేమో రూ.3 వేల కోట్లు ఖర్చు పెడితే సరిపోతుందంటున్నారు. రైతుల వద్ద తీసుకున్న పొలాలు లే అవుట్లుగా అభివృద్ధి చేసేందుకు రూ.17 వేల కోట్లు ఖర్చు చేయాలనుకున్నారు. కేవలం కన్సల్టెంట్లకు రూ.800 కోట్లు అగ్రిమెంట్‌ చేసుకున్నారు. రూ.330 కోట్లు విడుదల చేశారు. ఇవన్నీవాస్తవం కాదా..? చంద్రబాబు చేసిన తప్పులను సీఎం జగన్‌ సరిదిద్దుతున్నారు.

రాష్ట్ర సమగ్ర అభిృద్ధికోసం జీఎన్‌ రావు కమిటీని వేశాం. విశాఖలో సచివాలయం.. అమరావతిలో రాజ్‌భవన్‌, అసెంబ్లీ.. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని జీఎన్‌రావు కమిటీ చెప్పింది. విశాఖలో, అమరావతిలో హైకోర్టు బెంచ్‌లు సూచించింది. రాజధానికోసం చంద్రబాబు ఖర్చు చేసిన రూ.5400 కోట్లలో రూ.1500 కోట్లు కేంద్రం ఇచ్చింది. ప్రపంచంలోనే బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ) మూడో స్థానంలో ఉంది. బీసీజీ సంస్థతో గతంలో పనిచేసి ఇప్పుడు పనికి రాదంటున్నారు. బీసీజీకి రిపోర్టు ఇచ్చే అధికారం ఎవరిచ్చారని బాబు అనడం సిగ్గుచేటు. 13 జిల్లాల అభివృద్ధే సీఎం వైఎస్‌ జగన్‌ లక్ష్యం. 5 కోట్ల ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్యేయం.

రూ. లక్షా 10 వేల కోట్లతో ఒక రాజధాని నిర్మాణం చేపట్టడం సాధ్యమేనా..? పోలవరం పూర్తి చేయాల్సిన బాధ్యత లేదా..? ఎన్ని ఇబ్బదులున్నా ప్రభుత్వం ముందుకెళ్తుంది పవన్‌ కల్యాణ్‌ సహనం కోల్పోతే ఇంట్లో కూర్చోవాలి. ఘీంకారాలు చేస్తే సహించేది లేదు. రాబోయే తరాల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని సీఎం జగన్‌ నిర్ణయాలు తీసుకుంటారు. ప్రజలు కూడా అర్థం చేసుకుని సహకరించాలి. రాజధాని ప్రకటనకు ముందే బాబు వ్యక్తులు అక్కడ భూములు కొన్నారు. అమరావతి రాజధానిగా ప్రకటించిన తర్వాత చంద్రబాబుకు చెందిన వ్యక్తులు భూములను సీఆర్‌డీఏ పరిధిలో కలిపారు. ఇది చంద్రబాబు అవినీతికి పరాకాష్ట. ప్రభుత్వం అంటే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారమా..! దళారి వ్యాపారమా..! విశాఖలో రూ.10 వేల కోట్లు ఖర్చు పెడితే హైదరాబాద్‌ను మించిన రాజధాని తయారవుతుంది’ అని బొత్స అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top