మహాకూటమిలో బుజ్జగింపుల పర్వం

Appeasement In Grand Alliance - Sakshi

ఢిల్లీ: మహాకూటమిలో బుజ్జగింపుల పర్వం మొదలైంది. కాంగ్రెస్‌ అగ్రనేతలు డీకే అరుణ, సబితా ఇంద్రారెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డిలకు కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. గురువారం కూడా ఢిల్లీ వేదికగా కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. స్క్రీనింగ్‌ కమిటీలో ఖరారు కాని 15 స్థానాలకు చెందిన అభ్యర్థులను ఢిల్లీకి రావాల్సిందిగా హైకమాండ్‌ నుంచి పిలుపు వచ్చింది. అభ్యర్థుల ఎంపిక విషయంలో  కాంగ్రెస్‌ అధిష్టానం బుజ్జగింపులు మొదలెట్టింది.

సూర్యాపేట, ములుగు, ఇబ్రహీంపట్నం, ధర్మపురి, స్టేషన్‌ ఘన్‌పూర్‌, తుంగతుర్తి, రాజేంద్రనగర్‌, దుబ్బాక, మెదక్‌, పెద్దపల్లి, కోరుట్ల, వరంగల్‌ ఈస్ట్‌, కొత్తగూడెం, నిజామాబాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌, మేడ్చల్‌, పటాన్‌చెరువు, జుక్కల్‌ స్థానాలకు చెందిన ఆశావహులతో ఈరోజు కాంగ్రెస్‌ వార్‌ రూంలో చర్చలు జరగనున్నాయి. ఒక్కొక్క జిల్లాకు గంట సమయం కేటాయిస్తున్నట్లు సమాచారం. స్క్రీనింగ్‌ కమిటీ సీట్ల కేటాయింపు విషయంలో జనసమితి, సీపీఐ ఒత్తిడికి కాంగ్రెస్‌ తలొగ్గినట్లు కనపడుతోంది.

తెలంగాణాలో ఉన్న 119 సీట్లలో 29 సీట్లు మిత్రపక్షాలకు ఇవ్వడానికి కాంగ్రెస్‌ అదిష్టానం సిద్ధపడుతోంది. మహాకూటమిలో భాగంగా ఇప్పటికే టీడీపీకి 14 స్థానాలు ఖరారైనట్లు అందరి నోళ్లలో నానుతోంది. మిత్రపక్షాలకు కేటాయించిన సీట్లు పోను మిగిలిన 90 సీట్లలో పోటీ చేయడానికి కాంగ్రెస్‌ సిద్ధపడుతోంది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. సంప్రదింపులు పూర్తయిన తర్వాతే జాబితే వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top