‘ప్రమాదంలో ఉంది ప్రజాస్వామ్యం కాదు చంద్రబాబు’

Ambati Rambabu Slams Chandrababu Naidu Over Alliance With Congress - Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాజకీయంగా అంతిమ సమయం ఆసన్నమైందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఆదివారం విజయవాడలోని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌పై దాడి జరిగితే అవహేళన చేయడం దారుణమని.. 40 ఏళ్ల అనుభవం గల రాజకీయ నాయకుడు ఇలాగేనా మాట్లాడేదని విమర్శించారు. నీచమైన ఎత్తుగడలతో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.  చంద్రబాబు వైఎస్సార్‌ సీపీపై దుర్మార్గపు ప్రచారం చేస్తూ.. శునకానందం పొందుతున్నారని.. అందుకే టీడీపీని శునకానంద పార్టీ అనాలని అన్నారు. తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొన్న చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని రక్షించేవారా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, చంద్రబాబులు జాతి ప్రయోజనం కోసం కలవలేదని తెలిపారు. ప్రమాదంలో ఉంది ప్రజాస్వామ్యం కాదని.. చంద్రబాబు నాయుడని పేర్కొన్నారు. చంద్రబాబు కలయికపై కాంగ్రెస్‌ నాయకులు పునరాలోచించుకోవాలని సూచించారు. ఇప్పటికే కొందరు కాంగ్రెస్‌ పార్టీని వీడిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ అపవిత్ర కలయికపై టీడీపీలో ఉన్న ఎన్టీఆర్‌ అభిమానులు ఆలోచించుకోవాలని కోరారు. టీడీపీని చంద్రబాబు గంగలో కలుపుతున్నారని.. ఆ పార్టీకి ఇవే చివరి రోజులని వ్యాఖ్యానించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top