
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బంద్ ద్వారా ప్రజల ఆకాంక్షను తెలియజేసి, ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రాజకీయ పక్షాలు చేస్తున్న ప్రయత్నాలను సీఎం చంద్రబాబు అపహాస్యం చేయడం దురదృష్టకరం, హాస్యాస్పదమని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు.
ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారని, ప్రజల ఆకాంక్షను కాలరాసేలా బంద్‌లను విఫలం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. ఈ నెల 16న రాష్ట్రబంద్ పాటించాలని వైఎస్సార్‌సీపీ, వామపక్షాలు, జనసేన, ప్రత్యేక హోదా సాధన సమితి, ప్రజా సంఘాలు ఇచ్చిన పిలుపును తప్పుపట్టడం చంద్రబాబుకే చెల్లిందన్నారు.
‘‘పార్లమెంట్‌ను నడపడంలో విఫలమైన ప్రధాని మోదీ ప్రతిపక్షాలపై నెపం వేసేందుకు దీక్ష చేశారు. చంద్రబాబుకు ప్రత్యేక హోదాపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ నెల 16న జరిగే బంద్‌కు పూర్తి మద్దతు ప్రకటించాలి. తాను తలచుకుంటే రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ వాహనాలు కదలవని చంద్రబాబు అనడం నియంతృత్వ ధోరణికి నిదర్శనం. ’’ అని అంబటి పేర్కొన్నారు.