ఠాక్రే టీంలోకి ఎంట్రీ.. డిప్యూటీ సీఎంగా అజిత్‌!

Ajit Pawar May Be Maharashtra Deputy Chief Minister - Sakshi

ఈనెల 30న మంత్రివర్గ విస్తరణ!

సాక్షి, ముంబై : శివసేన–ఎన్సీపీ–కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహా వికాస్‌ ఆఘాడి ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈనెల 30న ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కేబినెట్‌ విస్తరణ చేస్తారని సమాచారం. ఎన్సీపీ సీనియర్‌ నేత అజిత్‌ పవార్‌ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణపై చర్చ నిమిత్తం సోమవారం సీఎం ఠాక్రేతో ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ భేటీ అయ్యారు. డిప్యూటీ సీఎం పదవిపైనే వీరిద్దరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది. శరద్‌ విజ్ఞప్తి మేరకు అజిత్‌కు డిప్యూటీ సీఎం కేటాయించేందుకు ఉద్ధవ్‌ అంగీకరించినట్లు సమాచారం. దీంతో ఈనెల 30న ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.

కాగా, ఉద్ధవ్‌తో పాటు మరో ఆరుగురు కూడా గతంలోనే మంత్రులుగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్సీపీపై తిరుగుబాటు, ఫడ్నవిస్‌తో చేతులు కలపడం, డిప్యూటీ సీఎంగా ప్రమాణం, రాజీనామా.. అనంతరం తిరిగి సొంత గూటికి రావడం వంటి చర్యలతో వివాదానికి అజిత్‌ కేంద్ర బిందువుగా మారారు. దీంతో​ శివసేన నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆయనకు ఎలాంటి పదవి దక్కలేదు. ఎన్సీపీని నుంచి ఇద్దరు నేతలు ఉద్ధవ్‌తో ప్రమాణం చేసినప్పటికీ వారికి శాఖలు కేటాయించలేదు. మరోవైపు అజిత్‌ ఎన్సీపీలోకి తిరిగిరావడంతో డిప్యూటీ సీఎం పదవికి ఆయనకే దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. శివసేనకు నగరాభివృద్ధి శాఖ, ఎన్సీపీకి హోం శాఖ, కాంగ్రెస్‌కు రెవెన్యూ శాఖ కట్టబెట్టే సూచనలున్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top