గవర్నర్‌ ఢిల్లీ పర్యటన; ఊహించని ట్విస్ట్‌

Unexpected Twist In Governor ESL Narasimhans Delhi Tour - Sakshi

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ ఢిల్లీ పర్యటనలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌.. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఇతర కేంద్ర మంత్రులను కలవాల్సిఉంది. ఈ మేరకు అపాయింట్‌మెంట్లు కూడా ఖరారయ్యాయి. కానీ అనూహ్యరీతిలో గవర్నర్‌ తన పర్యటనను అర్ధాంతరంగా రద్దుచేసుకున్నారు. మంగళవారం రాత్రే ఢిల్లీకి చేరుకున్న ఆయన బుధవారం ఉదయానికి హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు. గవర్నర్‌ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పర్యటనల రద్దు వ్యవహారం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

అసలేం జరిగింది?: ఢిల్లీకి బయలుదేరడానికి ముందు గవర్నర్‌ నరసింహన్‌.. తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్‌, చంద్రబాబులతో సుదీర్ఘ భేటీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులతోపాటు కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు యత్నాలు, విభజన హామీలపై చంద్రబాబు విన్నపాలను ఢిల్లీ పెద్దలకు వివరించేందుకు గవర్నర్‌ సంసిద్ధులయ్యారు. కానీ అంతలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. గవర్నర్‌ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు. టీడీపీకి వ్యతిరేకంగా మిగతా పార్టీలను ఏకం చేయడంలో గవర్నర్‌ కీలకంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ-బీజేపీలు తిరిగి ఏకం అవుతున్నాయన్న వార్తల నడుమ గవర్నర్‌పై చంద్రబాబు వ్యాఖ్యలు, ఆ వెంటనే గవర్నర్‌ ఢిల్లీ పర్యటన ఆకస్మిక రద్దు తదితర అంశాలు చర్చనీయాంశం అయ్యాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top