వాళ్ల ఐకమత్యం మాకు మహాబలం

PM Modi addresses farmers' rally in Shahjahanpur - Sakshi

విపక్షాలు కలిస్తే కమలమే వికసిస్తుంది

షాజహాన్‌పూర్‌ ర్యాలీలో మోదీ

షాజహాన్‌పూర్‌: ప్రతిపక్షాల ఐకమత్యం తమకే లాభం చేకూరుస్తుందని ప్రధాని మోదీ అన్నారు. అవిశ్వాసం ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తే కౌగిలింతతో సరిపుచ్చారని ఎద్దేవా చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో శనివారం జరిగిన రైతు ర్యాలీలో మోదీ ప్రసంగించారు. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, విపక్షాల ఐక్యత, అవిశ్వాసంపై చర్చ జరుగుతున్న సమయంలో రాహుల్‌ వచ్చి హఠాత్తుగా తనని కౌగిలించుకోవడం తదితర విషయాలను ప్రస్తావించారు.

తమ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఓర్వలేక విపక్షాలు పార్లమెంట్‌లో అవిశ్వాసం పేరిట కాలక్షేపం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ‘దేశంలో ఇప్పుడు ఒక్కటే దళ్‌(రాజకీయ పార్టీని ఉద్దేశించి) లేదు. ఎన్నో దళ్‌లు కలవడం వల్ల ఏర్పడే దల్‌దల్‌(బురద) ‘కమలం’ వికసించడానికే దోహదపడుతుంది’ అని మోదీ చమత్కరించారు. ‘అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి కారణమేంటని ప్రశ్నిస్తే వారు బదులివ్వలేదు. కౌగిలింతతో సరిపెట్టారు’ అని రాహుల్‌నుద్దేశించి అన్నారు.

ప్రధాని పీఠంపైనే కళ్లన్నీ..
పేదలు, యువతను విస్మరిస్తూ ప్రతిపక్షాలన్నీ ప్రధాని పీఠం కోసం పాకులాడుతున్నాయని మోదీ మండిపడ్డారు. ‘లోక్‌సభలో శుక్రవారం జరిగిన చర్చను చూశారా? తప్పెవరిదో తెలిసిందా? ప్రతిపక్షాలు దేశం, పేదల గురించి ఆలోచించడం లేదు. ప్రధాని కుర్చీపైనే వాళ్ల కళ్లన్నీ ఉన్నాయి. అవినీతితో పోరాడుతూ దేశం, ప్రజల కోసం పనిచేయడమేనా నా నేరం? ప్రతిపక్షాల కుతంత్రాలు నాకు తెలుసు. సైకిలు(సమాజ్‌వాదీ పార్టీ), ఏనుగు(బీఎస్పీ)తో జతకట్టినా వారిని గెలవనీయం.

భారత ప్రజాస్వామ్యంలో 125 కోట్ల మంది ఓటు ద్వారా ఇచ్చిన తీర్పే శిరోధార్యమని, దానికి వ్యతిరేకంగా వెళ్తే మూల్యం చెల్లించుకోక తప్పదని వారిని హెచ్చరిస్తూనే ఉన్నాం. కానీ వారు నన్ను పదవి నుంచి తొలగించాలని ఆరాటపడుతున్నారు’ అని మోదీ మండిపడ్డారు. నాటి ప్రధాని రాజీవ్‌ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ..ఆనాడు రూపాయి ప్రయోజనంలో పేదలకు కేవలం 15 పైసలే చేరాయని అన్నారు. కానీ తమ ప్రభుత్వం సాంకేతికత సాయంతో పూర్తి ప్రయోజనాన్ని నేరుగా లబ్ధిదారుడి ఖాతాలోనే వేస్తోందని చెప్పారు.  

ఆ చీకట్లకు బాధ్యులెవరు.?
ఎన్డీయే నాలుగేళ్ల పాలనకాలంలోని సంక్షేమ కార్యక్రమాలను పేర్కొంటూ..తాము 18 వేల గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించినా, కొందరు విమర్శలు చేస్తున్నారన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటినా కొన్ని గ్రామాలు చీకట్లోనే ఉన్నాయంటే దానికి కారణమెవరని ప్రశ్నించారు. రైతుల సంక్షేమానికి గత ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయలేదన్న మోదీ..సాగును లాభసాటిగా మార్చేందుకు తమ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను వివరించారు. ఈ డిసెంబర్‌ నుంచి మొలాసిస్, చెరకు రసం నుంచి ఇథనాల్‌ ఉత్పత్తి చేసేందుకు మిల్లులకు అనుమతి ఇచ్చిన సంగతిని గుర్తుచేశారు. చెరకు కనీస ధరను క్వింటాలుకు రూ.20 పెంచామని తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top